Loofah Usage Tips: లూఫా వాడుతున్నారా...
ABN, Publish Date - Dec 28 , 2025 | 05:18 AM
చాలామందికి స్నానం చేసేటప్పుడు లూఫా (బాడీ స్క్రబ్బర్) వాడే అలవాటు ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించాలనీ లేదంటే చర్మవ్యాధులు తప్పవని...
చాలామందికి స్నానం చేసేటప్పుడు లూఫా (బాడీ స్క్రబ్బర్) వాడే అలవాటు ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించాలనీ లేదంటే చర్మవ్యాధులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లూఫాతో శరీరాన్ని రుద్దుకున్నప్పుడు దాని రంధ్రాల్లోకి సబ్బు నురుగు, మురికి, చర్మం నుంచి విడివడిన మృతకణాలు చేరి ఇరుక్కుంటాయి. దీన్ని సరిగా శుభ్రం చేయకుండా దీర్ఘకాలం అలాగే వాడుతూ ఉంటే ఫోలిక్యులైటిస్ అనే చర్మ వ్యాధి రావచ్చు. చర్మం మీద ఉండే వెంట్రుకల కుదుళ్లు వాచి కురుపులు, పుండ్లు ఏర్పడతాయి.
లూఫాను వారానికి ఒకసారి వేడినీళ్లలో నానబెట్టి కొద్దిగా షాంపూ రాసి శుభ్రం చేయాలి. దీన్ని స్నానాల గదిలో, షవర్ కింద వేలాడదీయకూడదు. అలా చేయడం వల్ల లూఫా సరిగా ఆరదు. చెమ్మ వల్ల ఫంగ్‌సలు, హానికారక బ్యాక్టీరియాలు చేరతాయి. లూఫాను ఎండ, గాలి తగిలేలా ఉంచడం మంచిది.
ఇతరుల లూఫాలను వాడకూడదు. కనీసం రెండు నెలలకోసారి లూఫాను మార్చాలి.
సింథటిక్ లూఫాలు గరుకుగా ఉంటాయి. ఇవి చర్మం పై పొరల్లో ఉండే సహజ నూనెలను తొలగిస్తాయి. దీంతో చర్మం పొడిబారడం, ఎర్రగా కమలడం, గీసుకుపోయి నల్లమచ్చలు ఏర్పడడం లాంటివి ఎదురవుతాయి. కాబట్టి మృదువుగా ఉండే ఆర్గానిక్ లూఫాలు ఉపయోగించడం మంచిది.
వారానికి రెండుసార్లకు మించి లూఫాను వాడకూడదు. ముఖాన్ని శరీరలోని సున్నితమైన భాగాలను దీనితో రుద్దకూడదు. దీనికి బదులు సిలికాన్ స్క్రబ్బర్ లేదా కొంజాక్ స్పాంజ్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
టీమిండియా టెస్ట్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? డేంజర్‌లో గంభీర్ పదవి!
అడవిలో గడ్డి కోస్తుండగా ఊహించని విషాదం..
Updated Date - Dec 28 , 2025 | 05:18 AM