Tiger Attack: అడవిలో గడ్డి కోస్తుండగా ఊహించని విషాదం..
ABN , Publish Date - Dec 27 , 2025 | 08:05 PM
చామరాజనగర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పులుల దాడులు బాగా పెరిగిపోయాయి. సాధారణం జనంతో పాటు ఫారెస్ట్ సిబ్బందికి కూడా అది కష్టంగా మారింది. అడవి జంతువుల సంరక్షణ కోసం పాటు పడుతున్న ఓ ఫారెస్ట్ గార్డ్ పులి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.
అడవి జంతువుల సంరక్షణ కోసం పాటు పడుతున్న ఓ ఫారెస్ట్ గార్డ్ పులి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. విధుల్లో ఉన్న సమయంలో ఆ పులి గార్డ్ ప్రాణాలు తీసింది. మీద పడి విచక్షణా రహితంగా దాడి చేసి చంపేసింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట్ తాలూకాకు చెందిన 56 ఏళ్ల సన్న హైద అనే వ్యక్తి బండిపూర్ టైగర్ రిజర్వ్ ఏరియాలోని మరహళ్ల పోచింగ్ క్యాంప్‌లో ఫారెస్ట్ గార్డుగా పని చేస్తున్నాడు. అక్కడి అడవి జంతువుల కదలికలపై నిఘా వేయటం.
ఆ ప్రాంతంలోకి వేటగాళ్లు రాకుండా చూసుకోవటం అతడి పని. ఎంతో నిబద్ధతతో అతడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం సన్న హైద మరో నలుగురు గార్డులతో కలిసి అడవిలో ప్రతీ రోజూ లాగే బీటింగ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అతడు అడవిలో గడ్డి కోసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ పులి సన్న హైదపై దాడి చేయసాగింది. తన పంజాలతో విచక్షణా రహితంగా అతడి శరీరాన్ని చీల్చ సాగింది. సన్న హైద నొప్పి తట్టుకోలేక గట్టిగా అరవటం మొదలెట్టాడు.
అతడి అరుపులు విన్న మిగిలిన గార్డ్స్ అలర్ట్ అయ్యారు. గట్టిగా అరుస్తూ పులి ఉన్న చోటుకు వెళ్లారు. పులి భయపడి అక్కడినుంచి పారిపోయింది. అయితే, పులి దాడిలో సన్న హైద అప్పటికే మరణించాడు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సన్న హైద శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. కాగా, చామరాజనగర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పులుల దాడులు బాగా పెరిగిపోయాయి. సాధారణం జనంతో పాటు ఫారెస్ట్ సిబ్బందికి కూడా అది కష్టంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఆర్ఎస్ఎస్‌పై నా పోరాటం ఆగదు.. ప్రకాశ్‌రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్
రూ.7కోట్లు పెట్టినా.. తుది జట్టులో అతడికి నో ఛాన్స్: అనిల్ కుంబ్లే