RCB: రూ.7కోట్లు పెట్టినా.. తుది జట్టులో అతడికి నో ఛాన్స్: అనిల్ కుంబ్లే
ABN , Publish Date - Dec 27 , 2025 | 07:47 PM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను ఐపీఎల్ 2026కి సంబంధించి మినీ వేలంలో ఆర్సీబీ రూ.7కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026కి సంబంధించిన ఇప్పటికే మినీ వేలం పూర్తయింది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఐపీఎల్ 2025 మెగా వేలంలో కూడా వెంకటేశ్ అయ్యర్ కోసం ఆర్సీబీ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ కేకేఆర్ రూ.23.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడంతో వెనకడుగు వేసింది. కానీ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) తీవ్రంగా నిరాశపర్చాడు. 11 మ్యాచ్‌ల్లో 20.29 సగటుతో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతన్ని వేలంలోకి వదిలేసిన కేకేఆర్.. తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని భావించింది. కానీ ఆర్సీబీ పోటీ పడటంతో వదిలేసింది. అయితే వెంకటేశ్ అయ్యర్‌ను ఆర్సీబీ తీసుకోవడంపై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే(Anil Kumble) స్పందించాడు.
‘వెంకటేష్ అయ్యర్ ప్రతిభావంతమైన ఆటగాడు. కానీ ఆరంభ మ్యాచ్‌ల్లో అతనికి తుది జట్టులో అవకాశం దక్కడం అనుమానమే. ఎందుకంటే ఆర్సీబీ ఇప్పుడు ఛాంపియన్ టీమ్. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ట్రోఫీని గెలుచుకున్న టీమ్ తమ కాంబినేషన్‌ను మార్చాలనుకోదు. జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవద్దని అనుకుంటారు. రవి బిష్ణోయ్ వంటి సీనియర్ స్పిన్నర్లను ఆర్సీబీ తీసుకోకపోవడానికి కారణం కూడా ఇదే. సుయాష్ శర్మ ఇప్పటికే జట్టులో బాగా రాణిస్తున్నాడు. ఆర్సీబీ సీనియర్ స్పిన్నర్‌ను తీసుకొని యువ ఆటగాడు సుయాష్ శర్మపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావద్దని భావించింది. వెంకటేశ్ అయ్యర్‌కు కూడా ఇదే వర్తిస్తుంది.
వేలానికి ఆర్సీబీ చాలా స్పష్టమైన ప్రణాళికతో వెళ్లింది. వారు తమ కీలక ఆటగాళ్లకు సరైన బ్యాకప్‌లను ఎంచుకున్నారు. జట్టు బలం తగ్గకుండా వారు చూసుకున్నారు. జోష్ హెజల్‌వుడ్‌కు బ్యాకప్‌గా జాకబ్ డఫీ, ఫిల్ సాల్ట్‌కు ప్రత్యామ్నాయంగా జోర్డాన్, యష్ దయాల్‌కు బ్యాకప్‌గా మంగేష్ యాదవ్‌ను కొనుగోలు చేసింది’ అని కుంబ్లే ప్రశంసించాడు.
ఇవి కూడా చదవండి
తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్