Team India: 2025.. భారత క్రికెట్ చరిత్రలో ఓ భావోద్వేగ రోలర్‌కోస్టర్!
ABN , Publish Date - Dec 27 , 2025 | 06:35 PM
2025.. భారత క్రికెట్ చరిత్రలో ఓ మరుపురని ఏడాదిగా మిలిగిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఏడాది చివరిలో సౌతాఫ్రికాపై స్వదేశంలోనే క్లీన్ స్వీప్ అయ్యే వరకు ప్రతి మ్యాచ్ ప్రతి మూమెంట్ చిరస్మరణీయం.
ఇంటర్నెట్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో ఘనంగా మొదలైన ఈ ఏడాది.. చివరికి స్వదేశంలోనే టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ పరాభవంతో ముగిసింది. విజయాల ఆనందంతో పాటు వివాదాల కలకలం, నాయకత్వ మార్పులు, సీనియర్ల భవిష్యత్తుపై ఎన్నో ప్రశ్నలు.. మొత్తానికి భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది భావోద్వేగాల రోలర్‌కోస్టర్‌లా మారింది. పరుగులు, వికెట్లకే కాదు.. వ్యక్తిత్వాలు, విభేదాలు, అభిమానుల భావోద్వేగాలే క్రికెట్‌కు ప్రాణమని మరోసారి గుర్తు చేసిన సంవత్సరం ఇది.
ఛాంపియన్స్ ట్రోఫీతో శుభారంభం..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని 12 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా సగర్వంగా సొంతం చేసుకుంది. రోహిత్ సేన ఫైనల్‌లో కివీస్‌ను చిత్తు చేసింది. పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చినా.. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచుల్లో ఒక్క ఓటమి లేకుండా భారత్ అజేయంగా నిలిచింది. హేమాహేమీ జట్లను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకున్న టీమ్‌ఇండియాకు ‘ఈ సంబరం’ ఎంతో ప్రత్యేకం.
ఫైనల్లో న్యూజిలాండ్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఛేదించింది. రోహిత్ శర్మ ఆడిన 76 పరుగుల ఇన్నింగ్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. విమర్శకుల నోళ్లు మూయించి ఐసీసీ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది.
ఆసియా కప్: విజయం.. వివాదం
సీనియర్లు వీడ్కోలు పలకడంతో భారత యువ జట్టు ఆసియా కప్‌లో బరిలోకి దిగింది. లీగ్ సహా ఫైనల్‌లోనూ పాకిస్థాన్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. కానీ అవార్డుల ప్రదానోత్సవం వివాదాస్పదమైంది. పీసీబీ చీఫ్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షెడ్యూల్ వివాదాలు, అధికారుల మధ్య మాటల యుద్ధం ఆసియా కప్‌ను ఏడాదిలో అత్యంత చర్చనీయాంశంగా మార్చాయి.
గిల్‌కి టెస్టు కెప్టెన్సీ
2025తో భారత టెస్టు జట్టులో ‘తరం’ మార్పు స్పష్టమైంది. సీనియర్లు విరాట్, రోహిత్ వీడ్కోలు పలకడంతో శుభ్‌మన్ గిల్‌కు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ బలమైన ప్రదర్శన ఇచ్చింది. గిల్ స్వయంగా పరుగుల వరద పారించి రికార్డులు సృష్టించాడు. యువ ఆటగాళ్లపై నమ్మకంతో కొత్త భారత జట్టు దిశను ఈ నిర్ణయం చూపించింది.
దక్షిణాఫ్రికాతో టెస్టు పరాభవం
అయితే ఏడాది మొత్తం విజయాలకే పరిమితం కాలేదు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ ఘోరంగా విఫలమైంది. కోల్‌కతాలో 124 పరుగుల స్వల్ప లక్ష్యం కూడా ఛేదించలేక 98 పరుగులకు ఆలౌటైంది. గువాహటిలో 408 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత టెస్టు చరిత్రలోనే అతిపెద్ద పరాభవంగా నమోదైంది. బ్యాటింగ్ లోపాలు, ఒత్తిడిని తట్టుకోలేని వైఖరి తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఆర్‌సీబీ: విజయం.. విషాదం
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దింపుతూ ట్రోఫీని సొంతం చేసుకుంది. కోహ్లీ చేతుల్లో ట్రోఫీ ఎగసిన క్షణం అభిమానులకు చిరస్మరణీయం. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
మొత్తానికి..
ఐసీసీ ట్రోఫీ ఘనత నుంచి టెస్టు అవమానం వరకూ.. కెప్టెన్సీ మార్పుల నుంచి తెర వెనుక వివాదాల వరకూ.. 2025 భారత క్రికెట్‌కు సంపూర్ణ కథ. ఆనందం, బాధ, గర్వం, ఆవేదన.. అన్నీ కలగలిసిన ఏడాది. క్రికెట్ అంటే కేవలం ఆట కాదు.. కోట్లాది మంది అభిమానుల భావోద్వేగాల ప్రతిబింబమని మరోసారి రుజువైన సంవత్సరం ఇది.
ఇవి కూడా చదవండి
తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్