Ayurvedic Tips to Boost Immunity in Winter: చలిలో చక్కని ఆరోగ్యం
ABN, Publish Date - Nov 18 , 2025 | 05:16 AM
Staying Healthy in Winter Ayurvedic Tips to Boost Immunity and Well being
ఆయుర్వేదం
చలికాలంలోని చల్లని వాతావరణం జీర్ణశక్తిని బలపరిచినా, వాత పిత్త, దోషాల మధ్య సంతులనానికి సవాలు విసురుతుంది. ఫ లితంగా తలెత్తే ఆరోగ్య సమస్యల మీద ఓ కన్నేసి ఉంచి, వాటిని సకాలంలో పరిష్కరించుకుంటూ ఉండాలి.
చలికాలం వాతాన్ని (పొడి, చలి), కఫాన్నీ (భారం, కఫం) పెంచుతుంది. జీర్ణాగ్ని అయిన అగ్ని పోషణకూ, పునరుజ్జీవానికీ చలికాలమే అనువైన సమయం. అయితే పెరిగిన జీర్ణాగ్ని, శక్తిని సక్రమంగా సంతులనం చెందనప్పుడు, కీళ్ల నొప్పులు, సైనస్ సమస్యలు, నిస్సత్తువ రూపాల్లో సంతులనం తలెత్తుతుంది. కాబట్టి మన శరీరం, మనసు సంతులనంగా ఉండడం కోసం ఏడు సూత్రాలను పాటించాలి. అవేంటంటే...
ఆహారం: వేడిగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. నెయ్యి జోడించి తినొచ్చు. చిరుధాన్యాలు, సూప్స్, కూరగాయలు తినాలి. చల్లని, చద్ది పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటితో వాత, కఫాలు దెబ్బతింటాయి
నీళ్లు: రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. వేడి నీళ్లతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరం నుంచి విషాలు బయటకు వెళ్లిపోతాయి. చల్లని నీళ్లు అగ్నిని బలహీనపరుస్తాయి కాబట్టి చల్లనీళ్లకు దూరంగా ఉండాలి
శ్వాస: అనులోమ విలోమ శ్వాస ప్రక్రియలు సాధన చేయాలి. భ్రమరి ప్రాణాయామంతో ఊపిరితిత్తులు బలపడి, నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది
శరీర శోధన: నూనెతో మర్దన చేసుకునే అభ్యంగ, మూలికలను స్క్రబ్‌గా వాడుకునే ఉద్వర్తనం, ఆవిరి చికిత్స అయిన స్వేదనలతో రక్తప్రసరణ మెరుగ్గా ఉండి శరీరం నుంచి విషాలు బయటకు వెళ్లిపోతాయి
మనస్సుద్ధి: ప్రతి రోజూ ధ్యానం చేయాలి. ప్రశాంతమైన మనసుతో వ్యాధినిరోధకశక్తిని పెరుగుతుంది
ఆత్మ పోషణం: ప్రకృతితో అనుసంధానం కావాలి. ఎండలో గడపడం, ఆధ్యాత్మిక సాధనలు అంతర్గత ప్రశాంతతను, సంతృప్తినీ పెంచుతాయి
ఫ అభ్యాస: క్రమశిక్షణతో మెలగాలి. సమయానికి భోజనం, నిద్ర తప్పనిసరి. నిబద్ధతగా నడుచుకోవాలి.
వ్యాధుల బెడద
ఈ కాలంలో వ్యాధులు విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా పిల్లలు, పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు, ఊపిరితిత్తుల సమస్యలున్నవాళ్లు ఈ కాలంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి
పెద్దలు: రక్తప్రసరణ బలహీనంగా ఉండడం వల్ల వీరిలో కీళ్లు బిగుసుకుపోతాయి
పిల్లలు: వ్యాధినిరోధకశక్తి పెరుగుతున్న దశలో ఉండే పిల్లలు సులభంగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు
రోగులు: మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు సులభంగా చలి ప్రభావానికి లోనవుతారు
ఆస్తమా, సైనస్, ఆర్థ్రయిటిస్: ఈ కాలంలో ఈ కోవకు చెందినవాళ్ల కఫ, వాత దోషాలు పెరుగుతాయి.
కాబట్టి ఈ కోవలకు చెందిన వాళ్లు గోరువెచ్చని నూనెతో మర్దన చేసుకుంటూ, సమతులాహారం తీసుకుంటూ, సరిపడా విశ్రాంతిలో గడుపుతూ ఉండాలి.
ఈ ఔషథాలు అందుబాటులో...
చ్యవనప్రాశం: వ్యాధినిరోధకశక్తి, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది
దశమూలారిష్ఠ: దగ్గు, జలుబు, నిస్సత్తువలు తగ్గుతాయి
త్రిఫల చూర్ణం: జీర్ణశక్తి పెరుగుతుంది, విషాలు విరుగుడవుతాయి
రస్నాది చూర్ణం: సైనస్, తలనొప్పులు అదుపులోకొస్తాయి
అమృతారిష్ఠం: జ్వర నివారిణి
అను తైలం (మక్కులో వేసుకునే చుక్కల మందు): చల్లగాలితో సోకే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ దక్కుతుంది
శీతాకాల కషాయాలు
శీతాకాలంలో చోటుచేసుకునే కఫ, వాత దోషాలను హరించే కషాయాలు ఇవే!
దశమూల కషాయం: కీళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు అదుపులోకొస్తాయి
త్రికటు కషాయం: జీర్ణశక్తి, శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం పెరుగుతాయి
కాంతాకారి కషాయం: ఉబ్బసం, దగ్గు తగ్గుతాయి మధుమేహం, అధిక రక్తపోటు ఉంటే?
ఈ కాలంలో మధుమేహులు, అధిక రక్తపోటు కలిగినవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
మధుమేహులు ఇలా...
తీపి పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు మానేయాలి
మెంతులు, ఉసిరి, పసుపు, గుర్మర్ తీసుకోవాలి
ఎండలో నడవాలి, సరిపడా గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి
అధిక రక్తపోటు ఉంటే...
తీవ్రమైన చలికీ, మానసిక ఒత్తిడికీ దూరంగా ఉండాలి
ప్రాణాయామం సాఽధన చేయాలి. ప్రత్యేకించి అనులోమ, విలోమ, భ్రమరి సాధన చేయాలి
అర్జున, అశ్వగంధ, సర్పగంధ, బ్రహ్మి మొదలైన మూలికలు సంతులనాన్ని పెంచుతాయి
ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలుంటే?
ఆయుర్వేదం ఈ సమస్యలను.. చల్లదనంతో పెరిగే కఫ, వాత సమస్యలుగా పరిగణిస్తుంది. వీటిని అధిగమించడం కోసం....
తులసి, వాస లేదా యూకలిప్టస్ ఆకులు వేసి మరిగించి, ఆవిరి పట్టాలి
అగస్త్య రసయానం, వాసవలేహ, కాంతకారి కషాయాలు ఊపిరితిత్తులను బలపరుస్తాయి
చల్లదనం, పాల ఉత్పత్తులు, ఫ్రిజ్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
ఉదయం నీరెండలో ప్రాణాయామం చేయగలిగితే, ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది
ప్రతి రోజూ ధన్వంతరం తైలంతో అభ్యంగనం చేస్తే, రక్తప్రసరణ, రోగనిరోధకశక్తి పెరుగుతాయి.
డాక్టర్ శ్రీవర్మ
శ్రీవర్మ ఆయుర్వేద, చెన్నై.
ఈ వార్తలు కూడా చదవండి:
Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Updated Date - Nov 18 , 2025 | 05:18 AM