Share News

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:40 PM

సౌదీలో సోమవారం తెల్లవారుజామును జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మరణించారు. వీరంతా హైదరాబాద్ వాసులని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటన వెల్లడించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Saudi Bus Accident

హైదరాబాద్, నవంబర్ 17: సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. బాధితులకు అండగా నిలవాలని ఈ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.


మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యేతో పాటు మైనార్టీ విభాగానికి చెందిన ఉన్నతాధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపాలని కేబినెట్ నిర్ణయించింది. బస్సు ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబసభ్యులకు చెందిన ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీ తీసుకెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకుంది.


సౌదీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మరణించారు. వీరంతా హైదరాబాద్ వాసులని తెలంగాణ హజ్ కమిటీ ఒక ప్రకటన వెల్లడించింది. మృతుల్లో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది. హైదరాబాద్‌లోని మొత్తం 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా నవంబర్ 9వ తేదీన వీరంతా ఉమ్రాకు బయలుదేరి వెళ్లారు.


మక్కా యాత్ర పూర్తి చేసుకుని వారంతా మదీనాకి వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది ఈ ప్రమాదంలో మరణించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Kavitha: సింగరేణి సీఎండీ ఆఫీస్ ముట్టడికి కవిత పిలుపు

Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..

Updated Date - Nov 18 , 2025 | 07:08 AM