Home Appliances Care: ఈ జాగ్రత్తలు తీసుకోండి
ABN, Publish Date - Jul 21 , 2025 | 02:04 AM
ఇంటి పనులు త్వరగా పూర్తవడం కోసం ఈ రోజుల్లో చాలామంది ఎలకా్ట్రనిక్ గృహోపకరణాలు ఉపయోగిస్తున్నారు. అయితే అవి ఎక్కువకాలం పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి...
ఇంటి పనులు త్వరగా పూర్తవడం కోసం ఈ రోజుల్లో చాలామంది ఎలకా్ట్రనిక్ గృహోపకరణాలు ఉపయోగిస్తున్నారు. అయితే అవి ఎక్కువకాలం పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం..
మిక్సీ : చట్నీలు, పిండి, మసాలాలు వంటివి రుబ్బడానికి అనువుగా ఇప్పుడు అందరి ఇళ్లల్లో మిక్సీ ఉంటోంది. అయితే చాలా మంది మిక్సీ జార్‌లను వాడిన తర్వాత సింక్‌లో పడేసి చాలా సమయం తరువాత శుభ్రం చేసుకుంటారు. అయితే ఇలా చేయడం వలన బ్లేడులు మొద్దుబారిపోతాయి. అలాగే గిన్నెల్లో మరకలు అంటుకుపోతాయి. అందుకే మిక్సీ జార్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బ్లేడ్‌లు పదును తగ్గినట్లు అనిపిస్తే జార్‌లో కల్లుప్పు(క్రిస్టల్ సాల్ట్) వేసి మిక్సీ పట్టాలి. ఇలా చేస్తే బ్లేడ్‌లు పదునుగా మారతాయి. అలాగే మరకలు పడ్డాయని మిక్సీని నీటితో కడుగకూడదు. తడి గుడ్డతో తుడిచి శుభ్రం చేసుకోవాలి.
రైస్ కుక్కర్ : అన్నం పొంగడం, పక్కనే ఉండి చూసుకోకపోతే మాడిపోవడం వంటి సమస్యలకు పరిష్కారంగా రైస్ కుక్కర్ వాడుతున్నారు. అయితే ఈ కుక్కర్ వాడేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదం. కుక్కర్ గిన్నెను కుక్కర్‌లో పెట్టేముందు గిన్నె కింద భాగం తడి లేకుండా చూసుకోవాలి. అలాగే కుక్కర్ మీద అన్నం పొంగి మరకలు పడినా ఎట్టిపరిస్థితుల్లోనూ నీటితో కడగకూడదు. కుక్కర్ వైర్‌ను ప్లగ్ తీసేసి వస్త్రంతో కుక్కర్ మీది మరకలను తుడిచేయాలి.
ఫ్రిడ్జ్ : కూరగాయలు, కూరలు, పాలు వంటివి పాడవకుండా నిల్వ చేయడానికి ఫ్రిడ్జ్‌ను వాడుతుంటాం. అయితే చాలామంది ప్రతీ ఆహార పదార్థాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. అలా చేయకూడదు. బయట నిల్వ ఉండే వాటిని బయటే ఉంచాలి. అలాగే ఫ్రిడ్జ్‌లో వేడి వేడి పదార్థాలను పెట్టకూడదు. గిన్నెల మీద మూత పెట్టకుండా ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఒకవేళ అలా పెడితే ఆ పదార్ధం వాసన మిగిలిన ఆహార పదార్థాలకు పడుతుంది. ఊరెళుతున్నాం కదా అని ఫ్రిడ్జిని స్విచ్ఛాఫ్ చేసి వెళ్లకూడదు. ఒకవేళ అలా ఫ్రిడ్జ్ ఆపాలి అనుకుంటే అందులోని వస్తువులన్నీ తీసేసి లోపల తడి లేకుండా ఆరబెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేసేయాలి.
వాషింగ్ మెషీన్ : వాషింగ్ మెషీన్‌ను సక్రమంగా ఉపయోగిస్తే అది ఎక్కువకాలం చక్కగా పనిచేస్తుంది. రెండు మూడు రోజులు బట్టలు వేయడం కుదరలేదని ఆ మొత్తం బట్టలు ఒకేసారి వాషింగ్ మెషీన్‌లో వేసేయకూడదు. లోడ్‌కు మించి ఎక్కువ బట్టలు వేస్తే వాషింగ్ మెషీన్ పాడైపోతుంది. వారానికి ఒకసారి కచ్చితంగా డ్రమ్ శుభ్రం చేయాలి. అలాగే పైప్‌లు, ఫిల్టర్, రబ్బరును తరచూ శుభ్రం చేయాలి.
ఇవీ చదవండి:
జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్
22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..
Updated Date - Jul 21 , 2025 | 02:04 AM