Saree Draping Styles: చీర కట్టు కళాత్మకంగా
ABN, Publish Date - Dec 17 , 2025 | 01:24 AM
చీరలు కాలాతీతమైనవి. అయితే కాలక్రమేణా చీరకట్టులో ఎన్నో మార్పులొచ్చేశాయి. సామాజిక మాధ్యమాల్లో కొత్త తరం క్రియేటర్లు చీరకట్టులో కొత్త పంథాలను...
ట్రెండ్
చీరలు కాలాతీతమైనవి. అయితే కాలక్రమేణా చీరకట్టులో ఎన్నో మార్పులొచ్చేశాయి. సామాజిక మాధ్యమాల్లో కొత్త తరం క్రియేటర్లు చీరకట్టులో కొత్త పంథాలను అనుసరిస్తూ, సంప్రదాయ చీరలకు ఆధునిక హంగులను అద్దుతున్నారు. వాళ్ల వినూత్న ప్రయోగాలు, పొందుతున్న ఆదరణల గురించి తెలుసుకుందాం!
చీరకట్టు సంక్లిష్టమనీ, అసౌకర్యాన్ని కలిగిస్తుందనీ నేటి తరం భావిస్తోంది. కాబట్టే రెడీమేడ్ చీరలు మార్కెట్లోకి ఉప్పెనలా వచ్చిపడుతున్నాయి. కానీ చీరకట్టులో మెలకువలు తెలుసుకోగలిగితే, మరింత సులభంగా, మరింత ఆధునికంగా సింగారించుకోవచ్చని ఇన్‌ఫ్లూయన్సర్లు, శారీ డ్రేప్ నిపుణులూ పేర్కొంటున్నారు.
డాలీ జైన్
ప్రముఖ బ్రైడల్ శారీ డ్రేపర్, డాలీ జైన్, ఏకంగా 350 రకాల చీరకట్టు స్టైల్స్‌ను రూపొందించింది. ఈ సెలబ్రిటీ బ్రైడల్ శారీ డ్రేపర్, కనుమరుగైపోయే ప్రమాదం ఉన్న చీరల గురించి తన అనుభవాన్నీ, అభిప్రాయాన్నీ ఓ సందర్భంలో ఇలా పంచుకుంది. ‘‘ఓసారి నా దగ్గరకొక చేనేత కళాకారుడు వచ్చాడు. తన చీరలకు ప్రచారం కల్పించడం కోసం నన్ను ఆశ్రయించిన అతను తన చీరల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాటల్లో చీరల పట్ల అతనికున్న ప్రేమ, మక్కువలు నన్ను కట్టిపడేశాయి. వెంటనే ఆ చీరలను తెచ్చివ్వమని అన్నాను. అలా కోటా డోరియా చీరలు నాకు మొదటిసారి పరిచయమయ్యాయి. నిజానికి ఆ చీరలు కళాకారుడి వర్ణణను మించి ఎంతో మనోహరంగా ఉన్నాయి. రంగు, ఆకృతి, కట్టుకున్నప్పుడు ఒంటికి హత్తుకునే తీరు నాకెంతో నచ్చాయి. సాధారణంగా చలికాలం రాగానే, ‘ఇక కాటన్ చీరలను అటకెక్కించి, సిల్క్ చీరలు కట్టడం మొదలుపెట్టాలి’ అని మహిళలందరూ అనుకుంటారు. కానీ నేనది ఒప్పుకోను. కాటన్ చీరలు చలికాలానికి కూడా అనువైనవే! వేసవి, శీతాకాలం, వానాకాలం... కాలంతో సంబంధం లేకుండా ఈ చీరలను ఎప్పుడైనా కట్టుకోవచ్చు. చీరలకు క్రమేపీ ఆదరణ తగ్గుతోంది. నేటి తరం అమ్మాయిలు చీరలను ఓల్డ్ ఫ్యాషన్‌గా పరిగణించకుండా ఉండాలంటే తల్లులు, అత్తలు కొత్త కాపురంలో అడుగుపెట్టే వాళ్ల కూతుళ్లు, కోడళ్లకు తప్పకుండా చీరలను బహుమతిగా అందించాలి. ఏడు వారాల నగలతో పాటు ఏడు వారాల చీరలను కూడా అందించాలి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మనందరం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ‘ఈ అమ్మాయికి చీరలు ఇచ్చి ఏం ప్రయోజనం? ఈ రోజుల్లో చీరలెవరు కడుతున్నారు? ఇంత డబ్బు పోసి కొన్న చీరలను వీళ్లు వార్డ్‌రోబ్‌కే పరిమితం చేసేస్తారు’ అంటూ కూతుళ్లు, కోడళ్ల ముందే నిట్టూరుస్తూ ఉంటాం. ఇలా అన్నప్పుడు, ఒకప్పుడు మనం ప్రేమలో పడినట్టు ఇప్పుడు మన అమ్మాయిలు చీరతో ప్రేమలో ఎలా పడగలుగుతారు? కాబట్టి ఈ ధోరణకు స్వస్థి పలికి... ‘నువ్వు ఏడు చీరలు, ఏడు కథలు, ఏడు జ్ఞాపకాలు, ఏడు సాంస్కృతిక నిథులను వెంట తీసుకెళ్లాలి’ అంటూ చీరలతో కూతుళ్లు, కోడళ్లను సాగనంపాలి’ అంటూ చీరలకు పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది డాలీ జైన్
అశ్విని
నారాయణ్
శారీ స్టైలిస్ట్ అశ్విని నారాయణ్, కంటెంట్ క్రియేటర్ కూడా! సంప్రదాయ చీరలకు ఆధునిక హంగులు జోడించే అశ్విని, చేనేత కళాకారులతో కలిసి పని చేస్తూ, మన్నికతో కూడి సహజసిద్ధ వస్త్రాలను ఎంచుకోవడం ఉత్తమమని యువతను ప్రేరేపిస్తోంది. ఈమె అనుసరించే చీరకట్టు ఎంతో సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఉద్యోగాలకూ, ఆరుబయట కాలక్షేపాలకూ, ఇంట్లో ధరించడానికీ వీలుగా ఉండే చీరకట్టును యువతులకు నేర్పిస్తూ ఉంటుందీమె.
నటాషా తాసన్
శారీ ఆర్కిటెక్ట్‌గా పేరు తెచ్చుకున్న నటాషా కెనడాలో స్థిరపడింది. చీరకట్టును స్వీయ వ్యక్తీకరణకు చిహ్నంగా మార్చేసిన నటాషా ‘డ్రేప్ థెరపీ’ని స్థాపించి, చీరకట్టును నేర్పిస్తోంది. పవిట, కుచ్చిళ్లను పలు రకాలుగా ఎలా మలుచుకోవచ్చో ఆన్‌లైన్ క్లాసుల ద్వారా బోధిస్తూ ఉంటుంది నటాషా. బిగినర్స్ గైడ్‌తోపాటు, గాడెస్ శారీ డ్రేపింగ్, మల్టీ వేర్ శారీస్, టు వే సిల్క్ శారీస్ చీరకట్టును నేర్పిస్తోంది. సృజనాత్మకమైన, సంప్రదాయేతర చీరకట్టును నిమిషం వ్యవధిలోనే కట్టి చూపించడం ఈమె ప్రత్యేకత.
మోహిని బసు
ఈ ఫ్యాషన్ క్రియేటర్, ఆఽధునిక శైలిలో చీరకట్టును సాధన చేస్తూ ఉంటుంది. సంక్లిష్టమైన చీరకట్టుతో ప్రయోగాలు చేస్తూ, పిన్నులు పెట్టడం మొదలు, ఒంటికి హత్తుకునేలా చీరలను కట్టడం ఈమె ప్రత్యేకత. ఈమె రూపొందించే చీరల డిజైన్లు ఉన్నత ఫ్యాషన్ల నుంచి ప్రేరణ పొందినవే! సంప్రదాయ వస్త్రాలకు సమకాలీన హంగులు జోడించి, చీరలను శక్తివంతమైన స్టేట్‌మెంట్ పీస్‌గా మార్చేస్తూ ఉంటుందీమె.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
For More AP News And Telugu News
Updated Date - Dec 17 , 2025 | 01:24 AM