Rujuta Diwekar Tips: బరువు పెరిగినా ఆరోగ్యమే
ABN, Publish Date - Dec 10 , 2025 | 05:24 AM
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్, సామాజిక మాధ్యమాల ద్వారా ఆరోగ్యం చుట్టూ అలుముకుని ఉన్న అపోహలను పారదోలే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తాజాగా పైబడే వయసులో వచ్చిపడే...
వార్తల్లో వ్యక్తి
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్, సామాజిక మాధ్యమాల ద్వారా ఆరోగ్యం చుట్టూ అలుముకుని ఉన్న అపోహలను పారదోలే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తాజాగా పైబడే వయసులో వచ్చిపడే బరువుతో బెంబేలు పడొద్దని మహిళలకు సూచిస్తూ, 40ల్లో 20ల్లా కాకుండా 40లాగే కనిపించాలని హితబోధ చేశారు. మరిన్ని వివరాలు....
వయసును తగ్గించుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. అందుకోసం డైటింగ్‌లూ, వ్యాయామాలూ, గృహ చిట్కాలూ, సౌందర్య చికిత్సలు... ఇలా తోచిన మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటాం. నిజానికి అసలైన ఆరోగ్యం, సంతోషం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి పరిమితమైన సౌందర్య ప్రమాణాలను అందుకోడానికి ప్రయత్నించడానికి బదులుగా వయసు, ఆకారం, పరిమాణాన్ని స్వీకరించేలా ఒకర్నొకరు ప్రోత్సహించుకోవాలి.
40ల్లో 40లాగే కనిపించాలి
యవ్వనంగా కనిపించడం పట్ల పెరుగుతున్న మక్కువ, సంతృప్తికరమైన జీవితానికి అవరోధంగా మారుతోంది. ‘చిన్న పిల్లలా కనిపిస్తున్నావ్’ అనే ప్రశంస ఆనందాన్ని అందించవచ్చు. కానీ ఆ క్రమంలో కొన్ని కీలకమైన అంశాలను మహిళలు విస్మరిస్తున్నారు. బరువు తగ్గామనే ఆనందాన్ని పక్కన పెట్టి, అందుకోసం వదులుకుంటున్న ఆనందాల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. బరువు అదుపులో ఉంచుకోవడం ఆరోగ్యకరమే, కానీ అదొక శిక్ష కాకూడదు. మరీ ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలు బరువు పెరగడం సహజం. ఇది ప్రకృతిసిద్ధ మార్పు. పెరిగే వయసులో శరీరం సమర్థమైన జీవక్రియలకు తగ్గట్టు తనను తాను సర్దుబాటు చేసుకుంటుంది. ఇది ఆరోగ్యకరమే! కాబట్టి 40లో 20లా కనిపించడం కంటే 40లో 40లా, 60లో 60లాగే కనిపించడం కీలకం.
బరువు కాదు, ఆరోగ్యం ముఖ్యం
బరువు, పరిమాణం ఆరోగ్యానికి కొలమానాలు కావు. అసలైన ఆరోగ్యం కొన్ని ప్రాథమిక లక్షణాల్లో ప్రతిఫలిస్తుంది. రాత్రి కంటి నిండా నిద్రపోవడం, ఉదయాన్నే హుషారుగా నిద్రలేవడం, సీజనల్ స్వీట్స్‌తో సహా ఆహారాన్ని ఇష్టంగా ఆస్వాదించడం, శరీరం తేలికగా అనిపించడం, నొప్పి లేని నెలసరులు... ఇవన్నీ నిండైన ఆరోగ్యానికి సూచనలు. మన పరిమాణం, బరువులు ఆరోగ్యాన్ని నిర్థారించలేవు. కాబట్టి రెండు కాళ్ల మీద నిలబడినప్పుడు మన శరీర బరువును సౌకర్యవంతంగా మోయగలుగుతున్నామా? అన్నది గమనించుకోవాలి. శరీరాన్ని తేలికగా, చురుగ్గా కదల్చగలిగితే, మీ ఆరోగ్యం నిక్షేపంగా ఉన్నట్టే!
బాడీ పాజిటివిటీ
మన శరీరాల్ని మనమే విమర్శించుకోవడం, ఇతరుల శరీర పరిమాణాలను ఆరోగ్యంతో ముడిపెట్టడం సరి కాదు. అలాగే మనం కనిపించే తీరు గురించి కామెంట్స్ చేసేవారికి వివరణలు ఇచ్చుకోవడం మానేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని మనం అంగీకరించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాడీ పాజిటివిటీని సాధన చేయాలి. ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పు మనతోనే మొదలు కావాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 10 , 2025 | 05:24 AM