Oxidized Black Anklets Trend: నల్లని పట్టీలే నయా ట్రెండ్
ABN, Publish Date - Dec 07 , 2025 | 05:37 AM
వెండి పట్టీల స్థానంలో ఆక్సిడైజ్డ్ పట్టీలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఒకింత నలుపుదనాన్ని మేళవించినట్లుండే ఈ పట్టీలు.. ఎన్నేళ్లు పెట్టుకున్నా చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకే....
వెండి పట్టీల స్థానంలో ఆక్సిడైజ్డ్ పట్టీలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఒకింత నలుపుదనాన్ని మేళవించినట్లుండే ఈ పట్టీలు.. ఎన్నేళ్లు పెట్టుకున్నా చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకే మహిళలంతా వీటివైపే మొగ్గు చూపుతున్నారు. ఆధునిక పోకడలకు అనుగుణంగా విభిన్నమైన డిజైన్లలో సరికొత్త హంగులతో వీటిని రూపొందిస్తున్నారు. నేటి యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్న ఈ ఆక్సిడైజ్డ్ పట్టీలపై ఓ లుక్కేద్దామా...
కడా మోడల్
ఈ పట్టీలు రాజస్థాన్, గుజరాత్ సంస్కృతులను ప్రతిబింబిస్తూ నల్లగా గుండ్రంగా ఉంటాయి. కడా బ్రేస్‌లెట్‌ను తలపిస్తాయి. పాదాల మీదుగా జాలువారకుండా చీలమండకు అంటిపెట్టుకుని ఉంటాయి. వీటికి స్ర్కూ లేదా స్నాప్ క్లోజర్‌ను అమరుస్తారు. క్లాసీగా ఉండేలా చిన్న చిన్న మువ్వలు చేర్చి రత్నాలు పొదిగిన కడా స్టయిల్ పట్టీలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
స్టోన్ వర్క్ పట్టీలు
సున్నితమైన గొలుసుకు రంగురంగుల రాళ్లు, పూసలు, చిన్న సైజు రత్నాలు జతచేసి తయారుచేసిన ఈ పట్టీలు.. అమ్మాయిలను బాగా ఆకర్షిస్తున్నాయి. నల్లగా మెరిసే వెడల్పాటి గొలుసు మీద చిన్న మోటి్‌ఫలు, పూలు, లతలు తీర్చి వాటి మధ్యలో మెరిసే రాళ్లు, కుందనాలు పొదిగి ఆకర్షణీయమైన పట్టీలను రూపొందిస్తున్నారు.
గుత్తి స్టయిల్
నల్లగా మెరిసే వెడల్పాటి పట్టీలకు చిన్న చిన్న మువ్వలను గుత్తులు గుత్తులుగా జోడిస్తారు. ఈ మువ్వలు శబ్దం చేయవు. పట్టు చీరలు, పరికిణీలు, లెహంగాల మీద గ్రాండ్ లుక్‌నిస్తాయి. మహిళలు వివాహాది శుభకార్యాల్లో వీటిని ఎక్కువగా ధరిస్తుంటారు. చిన్న పిల్లల నుంచి మధ్య వయసు మహిళల వరకు అందరూ ఇష్టపడే మోడల్ ఇది.
ఫ్లవర్ డిజైన్
పువ్వులను వరుసగా పేర్చినట్లు కనిపించే ఈ డిజైనర్ పట్టీలకు కూడా డిమాండ్ అధికంగా ఉంది. తేలికపాటి నలుపు రంగులో సింపుల్‌గా కనిపించే విభిన్నమైన డిజైన్లలో ఇవి లభ్యమవుతున్నాయి. ఇవి రోజువారీ పెట్టుకోడానికి బాగుంటాయి.
మిర్రర్ మోడల్
గుండ్రని లేదా జ్యామితి ఆకృతుల్లో ఉన్న చిన్న, పెద్ద అద్దాలను చక్కని డిజైన్ ప్రకారం చేర్చి ఈ మిర్రర్ మోడల్ ఆక్సిడైజ్డ్ పట్టీలను తయారు చేస్తారు. ఇవి రాజస్థానీ కచ్ సంప్రదాయాన్ని గుర్తుకు తెస్తాయి. ఈ పట్టీలకు చిన్న మువ్వలను కూడా జోడించడంతో నడిచేటప్పుడు శ్రావ్యమైన ధ్వని వస్తుంటుంది. వీటిని యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
రత్నాల పట్టీలు
అక్కడక్కడా నల్లగా మెరిసే ఆక్సిడైజ్డ్ వెండి గొలుసుకు రంగురంగుల రత్నాలను జతచేసి ఈ రత్నాల పట్టీలను రూపొందిస్తున్నారు. పూలు, కొమ్మల డిజైన్లలో ఇవి ఎక్కువగా లభిస్తుంటాయి. వీటికి పెద్ద సైజు మువ్వలను లేదంటే చిన్న మువ్వల గుత్తులను జోడించి వింటేజ్ లుక్ తెస్తున్నారు. వివాహాది శుభకార్యాల్లో, పండుగలప్పుడు పెట్టుకోడానికి మహిళలు ఎక్కువగా ఈ రత్నాల పట్టీలనే ఎంచుకుంటున్నారు.
ఎలా తయారుచేస్తారంటే...
వెండి పట్టీలను సల్ఫైడ్ సమ్మేళనాల్లో ముంచి నల్లబరిచి ఆక్సిడైజ్డ్ పట్టీలను తయారు చేస్తున్నారు. ఈ ఆక్సిడైజ్డ్ పట్టీలు.. దుమ్ము, ధూళిని ఆకర్షించకుండా అందంగా మెరుస్తూ కనిపిస్తాయి. డిజైన్‌ను అనుసరించి వాటికి అరుదైన గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. చీరలు, లెహంగాలు, సల్వార్ సూట్లు లాంటి సంప్రదాయ దుస్తులతోపాటు డెనిమ్, బొహేమియన్, ఫ్యూజన్ తదితర మోడరన్ డ్రెస్‌ల మీద కూడా ఇవి చక్కగా సూటవుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
Read Latest AP News and National News
Updated Date - Dec 07 , 2025 | 05:37 AM