Meditation for Mental Peace: ధ్యానం అమోఘం
ABN, Publish Date - Oct 28 , 2025 | 01:56 AM
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం. ఫలితంగా చికాకు, విసుగు, అనాసక్తత ఆవరించి జీవన నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి వీటిని వదిలించుకోవాలంటే మానసిక ప్రశాంతత చేకూర్చుకోవాలి....
మానసిక ప్రశాంతత
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం. ఫలితంగా చికాకు, విసుగు, అనాసక్తత ఆవరించి జీవన నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి వీటిని వదిలించుకోవాలంటే మానసిక ప్రశాంతత చేకూర్చుకోవాలి. ఇందుకు అనువైన మార్గం ‘ధ్యానం’!
ధ్యానం చేయమంటే, కదలకుండా కూర్చుని చేసే ధ్యానంతో ఒరిగేదేముంది? అనిపిస్తుంది. అసలు అందరూ అలా ఎలా మౌనంగా, నిశ్చలంగా ధ్యానం చేయగలుగుతున్నారు? అందులో ఆనందం ఏముంటుంది? అనే అనుమానమూ వస్తుంది. అయితే ధ్యానం అనేది కదలికలతో కూడుకున్న వ్యాయామం, కార్యక్రమం, చర్య కాదు. మనసు పెట్టి చేయవలసిన క్లిష్టమైన పని అంతకన్నా కాదు. అదొక విశ్రాంత స్థితి. నిద్రను మించిన లోతైన నిద్రావస్థ స్థితి. ఈ స్థితిలో మనసు స్థిరంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడులు, ఆందోళనలు తొలిగి మనసు నిర్మలమవుతుంది. ఆ స్థితికి చేరుకోవడాన్నే ‘ధ్యానం’ అంటారు. వినడానికి తేలికగానే అనిపించినా ఆ స్థితికి చేరుకోవడం అంత తేలిక కాదు. మనసులో చెలరేగే ఆలోచనలను ఆపలేని నిస్సహాయులం మనం. అంతగా మన జీవితాలు లోక సంబంధ అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆలోచనల సంకెళ్లు మన మనసును స్థిమితంగా ఉండనివ్వవు. కాబట్టి ధ్యాన స్థితికి చేరుకోవలంటే మనసులో చెలరేగే ఆలోచనలను బంధించే సహనం, సాధన అవసరం.
ధ్యాన స్థితికి ఎందుకు చేరుకోలేం?
ధ్యానం ప్రారంభించిన మొదట్లో ముందుకు వెళ్లలేకపోతున్న భావన కలగడం సహజం. ఇందుకు కారణం ధ్యానం మీద మనసు లగ్నం కాకపోవడమే! ఆ లోతైన నిద్రావస్థ స్థితిని ఎలా చేరుకోవాలో అర్థం చేసుకోలేకపోవడమే! అయితే ధ్యానంలోకి చేరుకోవడానికంటే ముందు రెండు అంశాలను అర్థం చేసుకోవాలి. మన మనసు రెండు పనులు చేస్తూ ఉంటుంది. మొదటిది ‘గ్రహింపు’, రెండవది ‘ఆచరింపు’. ధ్యానంలో ఆచరింపు అనే అంశాన్ని నెమ్మదింపజేసి, గ్రహింపును ఉత్తేజితంగా ఉంచాలి. చాలామంది ఈ రెండు అంశాల గురించిన అవగాహన లేకుండానే ధ్యానం సాధన చేయడం మొదలు పెడతారు. ధ్యానం కోసం సిద్ధపడేముందు ఈ విషయాలను తెలుసుకోగలిగితే, అందుకోసం మనసు నిశ్చలంగా మారి, ధ్యాన ప్రక్రియ సులువవుతుంది. గాఢమైన నిద్రావస్థ ధ్యాన స్థితికి చేరుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే....
సన్నద్ధం: ధ్యానం చేయడం కంటే అందుకు సన్నద్ధమవడం కష్టం. అయితే ధ్యానానికి ముందు అందుకు మనసు, శరీరాలను సిద్ధం చేయడం వల్ల ధ్యానం తేలికవుతుంది అని నిపుణులు చెబుతారు.
ఊపిరి, శరీరాలను నెమ్మదించాలి: శ్వాస, మనసు, శరీరం అంతర్గతంగా ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. శరీరాన్ని విశ్రాంతంగా ఉంచి, శ్వాసను నెమ్మదింపజేస్తే, మనసూ నిశ్చలంగా మారుతుంది. ఈ స్థితిలో నాడీ వ్యవస్థ ప్రేరేపితమవుతుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది.
ధ్యానం తేలికగా: ధ్యాన ముద్రలో కూర్చుని 5 సార్లు ఊపిరి పీల్చి వదలాలి. ముక్కుతో గాలి లోపలికి పీల్చుకుని, నోటి ద్వారా బయటకు వదలాలి. ఊపిరి లోతుగా, దీర్ఘంగా కొనసాగాలి. ఊపిరి పీల్చుకునే సమయంలో వర్తమానంతో కూడిన స్పృహ కలిగి ఉండాలి. ఊపిరి బయటకు వదిలేటప్పుడు కండరాలన్నిటినీ రిలాక్స్ చేయాలి. ఆ సమయంలోనే ఒత్తిడిలు, ఆందోళనలు బయటకు వెళ్లిపోతున్న భావన కలగాలి. ఇలా చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా నాలుక, దవడ, కంఠం, నుదుటి మీద మనసు పెట్టాలి.
సక్రమ పద్ధతి: ధ్యానానిక ముందు కొన్ని యోగాసనాలు వేసి శరీరాన్ని తేలికపరచవచ్చు. ధ్యానానికి ఉపకరించే ఆసనాలు... శేతుబంధాసనం, ధనురాసనం, బాలాసనం, అధోముఖ శవాసనం, అర్థ మత్స్యేంద్రాసనం, ఉత్తనాసనం, శుప్త మత్య్సేంద్రాసనం, పద్మాసనం, శవాసనం. ఈ ఆసనాలు వేసే సమయంలో ఊపిరి పీల్చుకున్నదానికంటే ఎక్కువ సమయంపాటు బయటకు వదలాలి అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఊపిరి పీల్చుకోవడానికి నాలుగు సెకండ్లు పడితే, వదలడానికి ఎనిమిది సెకండ్ల సమయం తీసుకోవాలి. ఉచ్యాసనిశ్వాసాలు నెమ్మదిగా సాగాలి.
కోరిక బలంగా: ధ్యానం ఎందుకు చేయదలచుకున్నారో, ఎలాంటి ఫలితం కోరుకుంటున్నారో జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ధ్యానానికి ముందు ఇలాంటి లోతైన ఆలోచన ధ్యానబలాన్ని పెంచుతుంది. మీ కోరిక మానసిక ప్రశాంతత కాబట్టి, ఆ ఆలోచన దృఢంగా కొనసాగాలి. ముందున్న కొంత సమయాన్ని నేను ధ్యానం మీదే మనసు కేంద్రీకరిస్తాను అనుకోవాలి. ఆ సమయంలో నేను చేయవలసిన పనులు, ఆలోచించదగిన విషయాలు ఏమీ లేవు అని అనుకోవాలి. నేను ధ్యానం మొదలు పెట్టబోతున్నాను. నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని మనసుకి చెప్పుకోవాలి.
ఉన్నది ఉన్నట్టు స్వీకరించాలి: ప్రారంభంలో మనసులో ఆలోచనలు చెలరేగి ధ్యానానికి భంగం కలగవచ్చు. ఆ సమయంలో మిమ్మల్ని మీరు విమర్శించుకోకుండా ఆ ఆలోచనలను అంగీకరించి, వాటిని దూరం చేసుకోవడం మీద పట్టు సాధించాలి. స్వీయనింద ధ్యానాన్ని కొనసాగనివ్వదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు స్వీకరించి మెరుగైన ధ్యానం కోసం ఆలోచనల మీద పట్టు సాధించాలి. మనసు మీద పట్టు సాధించేటందుకు సమయం ఇవ్వాలి. మీతో మీరు సహనంతో మసలుకోవాలి.
ఏకాగ్రతను అభినందించాలి: ఏదైనా వస్తువును ఉపయోగిస్తే మనసు లగ్నమవడం తేలికవుతుంది. అలా చేయడం పొరపాటు కాదు. మనసు కేంద్రీకృతమయ్యేవరకూ ఏ వస్తువు మీదైనా మనసు లగ్నం చేయవచ్చు. అయితే ఆ సమయంలో మనసులో చోటుచేసుకునే నెమ్మదితనాన్ని గమనించాలి. ఏకాగ్రత కోసం మనసుకు శిక్షణ ఇచ్చే సమయంలోనే ఆనందాన్ని గ్రహించేలా కూడా మనసు శిక్షణ పొందుతుంది. కాబట్టి ధ్యానంలో పట్టు సాధించడం కోసం ఏదైనా వస్తువును ఉపయోగించుకోవచ్చు. అయితే అది వెలుగు విరజిమ్మేలా ఉండాలి.
ధ్యానం నుంచి బయటకు: ధ్యానం ముగిసిన తర్వాత దాన్లో నుంచి నెమ్మదిగా బయటకు రావడం కూడా నేర్చుకోవాలి. ధ్యానంలో తొందరపాటు తగదు. మనసు విశ్రాంతి పొందనివ్వాలి. మెడ, వేళ్లు కదిలించాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్లు తెరవాలి.
రాతల్లో పెట్టాలి: ధ్యానం ముగిసిన తర్వాత అనుభవాన్ని అక్షరబద్ధం చేయాలి. అలా చేయడం ద్వారా పురోగతి తెలుస్తుంది. ఎంత సేపు కూర్చుని ఉన్నారు? ధ్యానం ముగిసిన తర్వాత ఎలాంటి అనుభూతి పొందారు? ధ్యానం చేస్తున్నప్పుడు మనసు ఎలా స్పందించింది? అనే విషయాలను కూడా రాయాలి. ధ్యానం ప్రారంభంలో మనసులోకి ఎలాంటి ఆలోచనలు వచ్చాయి? వాటిని మీరెలా అధిగమించారు? అనే విషయాలను రాసుకోగలిగితే, ఆ మెలకువను ఎలా కొనసాగించవచ్చో అర్థమవుతుంది.
మనసు ఆనందంగా : బాధను మరిచి, ఆనందాన్ని సొంతం చేసుకోవడమే మన మెదడు ప్రధాన ధ్యేయం. ధ్యానం చేసే సమయంలో కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాలి. అంతా సవ్యంగానే ఉందనే భావన మనసులో నింపుకుంటే ధ్యానంలోకి పయనం సాధ్యపడుతుంది. అందుకోసం మీ జీవితంలో జరిగిన మంచి విషయాలను మననం చేసుకోవాలి. అంతా మంచే జరుగుతుందన్న సంతుష్టకరమైన భావన మనసులో నింపుకోవాలి. భగవన్నామస్మరణ కూడా ధ్యానానికి మేలు చేస్తుంది. అలాగే ధ్యానం కోసం నిశ్శద్దమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఫోన్లు, పెంపుడు జంతువులు, పిల్లల వల్ల ధ్యానానికి భంగం కలిగే వీలు లేని ప్రదేశాన్ని ధ్యానానికి కేటాయించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More AP News And Telugu News
Updated Date - Oct 28 , 2025 | 01:56 AM