Leadership Skills to Boost: నాయకత్వ లక్షణాలతో ఆత్మవిశ్వాసం
ABN, Publish Date - Jul 20 , 2025 | 03:20 AM
పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి నాయకత్వ లక్షణాలు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే వీటిపై అవగాహన కల్పించడం మంచిదంటున్నారు. ఇందులో భాగంగా...
పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి నాయకత్వ లక్షణాలు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే వీటిపై అవగాహన కల్పించడం మంచిదంటున్నారు. ఇందులో భాగంగా పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి శిక్షణ అందించాలో తెలుసుకుందాం...
చేసే ప్రతి పనిలో పిల్లలను భాగస్వాములుగా చేయాలి. బజారు నుంచి సరుకులు తేవడం, డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం, కరెంట్ తదితర బిల్లులను ఆన్‌లైన్లో కట్టడం, హోటల్‌కి వెళ్లినప్పుడు ఆహారాన్ని ఆర్డర్ చేయడం, గ్యాస్ బుక్ చేయడం లాంటి పనులను పిల్లలకు అప్పజెప్పాలి. వివిధ సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో చేసి చూపించాలి. దీంతో బాధ్యత, క్రమశిక్షణ, పనులను పూర్తిచేసే నేర్పరితనం అలవడతాయి.
వారికంటే చిన్నవారైన తమ్ముళ్లు, చెల్లెళ్లను జాగ్రత్తగా చూసుకోవడం, దగ్గరుండి హోంవర్క్ చేయించడం, పెద్దవారైన అక్కలు, అన్నలకు సహాయం చేయడం లాంటివి చెప్పి చేయించాలి. దీనివల్ల పిల్లలు తెలియకుండానే నాయకులుగా ఎదుగుతారు.
ఇంటిని శుభ్రం చేయడం, తోటపని, కూరగాయలు కోయడం, బడికి వెళ్లేముందు బాక్సులు సర్దడం, వాటర్ బాటిల్స్ నింపడం లాంటి పనులు నేర్పించాలి. వీటివల్ల పిల్లలకు బాధ్యతగా ప్రవర్తించడం అలవాటవుతుంది.
మీవల్ల ఏదైన పొరబాటు జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే తప్పులు, పొరబాట్లు జరగడం కూడా సహజమే అన్న అంశం పిల్లలకు అర్థమవుతుంది. నేర్చుకుంటూనే ఎదగాలని తెలుసుకుంటారు.
సంగీతం, నృత్యం, ఆటలు, రచనా వ్యాసాంగం... ఇలా దేనిలో ఆసక్తి ఉందో సూటిగా తెలిపేలా ప్రోత్సహించాలి. దీనివల్ల నేరుగా అభిప్రాయాన్ని తెలపడం, మాట్లాడే నైపుణ్యం, మానసిక ధైర్యం లాంటివి పిల్లలకు అలవడతాయి.
ఇవీ చదవండి:
జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్
22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..
Updated Date - Jul 20 , 2025 | 03:20 AM