Hidden Lung Risks from Pigeons: పావురాళ్లతో పలురకాల ఊపిరితిత్తుల సమస్యలు
ABN, Publish Date - Nov 18 , 2025 | 05:05 AM
మనం మూగజీవాల పట్ల ఆపేక్ష కనబరుస్తూ ఉంటాం. బాల్కనీలో గూళ్లు కట్టుకునే పావురాళ్లను చూసి ముచ్చట పడిపోతాం. వాటికి ఆహారం, నీళ్లు అందిస్తూ, ఆదరిస్తాం....
లంగ్ కేర్
మనం మూగజీవాల పట్ల ఆపేక్ష కనబరుస్తూ ఉంటాం. బాల్కనీలో గూళ్లు కట్టుకునే పావురాళ్లను చూసి ముచ్చట పడిపోతాం. వాటికి ఆహారం, నీళ్లు అందిస్తూ, ఆదరిస్తాం. అయితే ఇలా పావురాళ్లకు ఆశ్రయం కల్పించడం వల్ల, వాటి విసర్జకాలు, ఈకల ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులు సోకుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు సాధారణంగా పైకప్పులు, బాల్కనీలు పావురాళ్లకు ఆశ్రయాలుగా మారిపోతూ ఉంటాయి. అలా ఇంటి పరిసరాల్లోకి చేరుకునే పావురాళ్ల ఆకలి తీర్చడాన్ని మనం మన బాధ్యతగా భావిస్తూ ఉంటాం. అయితే హానికరంగా కనిపించని ఈ చర్యలతో కంటికి కనిపించని ఆరోగ్య ముప్పు పొంచి ఉంటుంది. పదే పదే పావురాళ్ల విసర్జకాలు, దుమ్ము, ధూళితో కూడిన వాటి ఈకలకు బహిర్గతమైతే, తీవ్రమైన ఊపిరితిత్తుల జబ్బులు సోకుతాయి. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన హైపర్‌సెన్సిటివిటీ న్యుమొనోటిస్, ఇంటర్టీషియల్ లంగ్ డిసీజ్‌లు పెరుగుతాయి.
పావురాళ్లతో వ్యాధులు ఎందుకు?
పావురాళ్ల విసర్జకాలు, ఈకలు, గూళ్లు కట్టుకోడానికి ఉపయోగించే పదార్థాలు, భవనాల పైకప్పులు, బాల్కనీల్లో పేరుకుపోతూ ఉంటాయి. కొంత కాలానికి అవన్నీ ఎండిపోయి, కంటికి కనిపించని ధూళి రేణువులుగా మారిపోతాయి. పావురాళ్ల విసర్జకాల్లో, ఈకల్లో... హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకొకోసిస్ అనే ఫంగల్ స్పోర్స్‌తో పాటు, బ్యాక్టీరియా, వైరల్ వ్యాధికారక సూక్ష్మక్రిములు, అలర్జీలను కలిగించే పక్షుల ప్రొటీన్లు ఉంటాయి. గాలితో పాటు వీటిని పదే పదే పీల్చుకున్నప్పుడు ఈ అలర్జెన్స్, స్పోర్స్‌కు ఊపిరితిత్తులు స్పందిస్తాయి. హైపర్‌సెన్సిటివిటీ న్యుమొనైటి్‌సలో, వ్యాధినిరోధక వ్యవస్థ, ఊపిరితిత్తుల కణజాలం మీద దాడి చేసి, ఊపిరితిత్తుల సహాయక కణజాలమైన, ఇంటర్‌స్టిషియమ్ వాపుకు దారి తీస్తుంది. ఈ పరిస్థితి ఊపిరితిత్తులు గట్టిపడే ఫైబ్రోసి్‌సకు దారి తీస్తుంది. ఇలా పావురాళ్ల విసర్జకాలు, ఈకలకు పదే పదే బహిర్గతమవుతూ, ఊపిరితిత్తులకు జరుగుతున్న నష్టాన్ని సకాలంలో కనిపెట్టలేకపోతే, అంతిమంగా తిరిగి సరిదిద్దలేనంతగా ఊపిరితిత్తులు దెబ్బతిని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ప్రతి శ్వాసకూ ఆక్సిజన్ మీద ఆధారపడే పరిస్థితి తలెత్తి, ఊపిరితిత్తుల మార్పిడి అవసరమవుతుంది.
ముప్పు ఎవరికి?
హైపర్‌సెన్సిటివిటీ న్యుమొనైటిస్ ముప్పు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముందు నుంచే ఊపిరితిత్తులు దెబ్బతిన్నవాళ్లకు ఈ ముప్పు మరింత ఎక్కువ. పిల్లలు, వయసు పైబడిన పెద్దలు, వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉన్న వాళ్లకు, ప్రత్యేకించి వ్యాధినిర్థారణ ఆలస్యమైనవాళ్లకు ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. నెలలు, ఏళ్ల తరబడి పదే పదే పావురాళ్ల విసర్జకాలు, ఈకలు, ధూళిలకు బహిర్గతమైన వాళ్లకు కూడా ముప్పు ఎక్కువగానే ఉంటుంది. హైపర్‌సెన్సిటివిటీ న్యుమొనైటిస్ వల్లే దాదాపు 50ు ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్‌లు సోకుతున్నట్టు భారతీయ ఐఎల్‌డి రిజిస్ట్రీ సూచిస్తోంది. పావురాళ్లకు బహిర్గతమవడం మూలంగా హైపర్‌సెన్సిటివిటీ న్యుమొనైటిస్ కారణంగా, ఊపిరితిత్తుల మార్పిడికి దారితీసే సందర్భాలతో పాటు, పావురాళ్ల సంబంధిత ఊపిరితిత్తుల వ్యాధులు క్రమేపీ పెరుగుతున్నట్టు నగర నివేదికలు కూడా సూచిస్తున్నాయి. పావురాళ్లతో ముడిపడి ఉన్న ప్రమాదాలను అరికట్టడం కోసం, ఢిల్లీ, ముంబయిల్లోని ప్రభుత్వ సంస్థలు, పావురాళ్లకు మేత వేసే ప్రదేశాల మీద నిషేధం విధిస్తూ, తగిన నియంత్రణ చర్యలను పాటిస్తున్నాయి.
భద్రతా చర్యలు ఇవే!
ప్రత్యేకించి నివాస ప్రాంతాలు, బాల్కనీలు, పైకప్పుల దగ్గరకు చేరుకునే పావురాళ్లకు ఆహారం తినిపించడం మానేయాలి. ఇలా ఆహారం అందించడం వల్ల పావురాళ్లు భారీ సంఖ్యలో ఆయా ప్రదేశాలకు చేరుకోవడం మొదలుపెడతాయి. దాంతో వాటి విసర్జకాలకు బహిర్గతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి వాటికి జాగా దొరికే వీల్లేకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి.
గూళ్లు కట్టుకునే వీల్లేకుండా, బాల్కనీల్లో బర్డ్ పైక్స్ లేదా మెష్ నెట్స్ ఏర్పాటు చేయాలి
పావురాళ్లు ఒదిగి కూర్చునే వీల్లేకుండా, బహిరంగ పైకప్పులు, కిటికీలకు తెరలు ఏర్పాటు చేయాలి
పావురాళ్ల విసర్జకాలను శుభ్రం చేయడం కోసం ముందుగా ఆ ప్రదేశాన్ని నీళ్లతో తడపాలి. ఇలా తడపడం వల్ల ధూళి గాల్లో కలిసిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ముఖానికి ఎన్95 మాస్కు, చేతులకు గ్లోవ్స్ తొడుక్కుని ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి, వ్యర్థాలను సంచుల్లో వేసి సీల్ చేసి, చెత్త బుట్టలో పారేయాలి.
ఇంట్లోకి గాలి వీచేలా చూసుకోవాలి. వీలైతే ఇంటి లోపల గాలిని వడగట్టే హెపా ఫిల్టర్స్ వాడుకోవాలి
సత్వరమే అప్రమత్తం
ఆగని దగ్గు, ఊపిరి పీల్చుకోలేకపోవడం, తెలియని అలసట లాంటి లక్షణాలు వేధిస్తున్నా, పావురాళ్లకు బహిర్గతమయ్యే ప్రదేశాల్లో నివసిస్తూ, ఈ లక్షణాలు తలెత్తినా, తక్షణమే వైద్యులను కలవడంతో పాటు, పావురాళ్లకు బహిర్గతమవుతున్న విషయాన్ని తెలియపరచాలి. హైపర్‌సెన్సిటివిటీ న్యుమొనైటిస్ సమస్యను ప్రారంభంలోనే గుర్తించడం ఎంతో ముఖ్యం. ఇలా ప్రారంభంలోనే గుర్తించడం వల్ల, సమస్యను రివర్స్ చేయడంతో పాటు, మరింత తీవ్రమవకుండా నిలువరించవచ్చు.
డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రహ్మణియన్
సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి:
Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Updated Date - Nov 18 , 2025 | 05:10 AM