Fringe Jewelry Trend: ‘ఫ్రింజ్’ మెరుపులు
ABN, Publish Date - Dec 28 , 2025 | 05:21 AM
అందంగా ఊగుతూ ఆకర్షణీయంగా మెరుస్తూ కనువిందు చేసే ఫ్రింజ్ జ్యువెలరీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. పూసలు, గుండ్లు, నవరత్నాలు, సన్నని గొలుసులతోపాటు....
అందంగా ఊగుతూ ఆకర్షణీయంగా మెరుస్తూ కనువిందు చేసే ఫ్రింజ్ జ్యువెలరీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. పూసలు, గుండ్లు, నవరత్నాలు, సన్నని గొలుసులతోపాటు నక్షత్రాలు, పూలు లాంటి విభిన్న ఆకృతులు వేలాడేలా రూపొందించిన ఆభరణాలనే ఫ్రింజ్
జ్యువెలరీగా పరిగణిస్తారు. మన సంప్రదాయంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. కాసులపేరు, బుట్ట జుంకాలు, చెంప స్వరాలు, మువ్వల వడ్డాణం ఈ కోవలోకే వస్తాయి.
మారుతున్న ఫ్యాషన్లకు తగ్గట్టుగా మినిమలిస్టిక్ ఫ్రింజ్ డిజైన్లు అందుబాటులోకి వచ్చేశాయి.
ఫ్రింజ్ ఆభరణాలు క్రీ.పూ 3000 నాటికే వాడుకలో ఉన్నాయి. పురాతన ఈజిప్షియన్, మినోవాన్, ఎట్రుస్కాన్ కాలాలనాటి ఆభరణాల్లో కూడా ఈ శైలి కనిపిస్తుంది.
ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. ప్లాపర్ దుస్తుల మీద ఈ ఆభరణాలను ఎక్కువగా ధరించేవారు. క్రమంగా అమెరికన్ శైలితో మిళితమై బోహో చిక్ డిజైన్లు రూపుదిద్దికున్నాయి. ప్రస్తుతం వింటేజ్, సమకాలీన హై ఫ్యాషన్‌ల కలయికతో సరికొత్త ఫ్రింజ్ ఆభరణాలను తయారు చేస్తున్నారు డిజైనర్లు.
రంగురంగుల పూసలు, మెటల్ గొలుసులు, టాసెల్స్, ఫ్యాబ్రిక్ స్ట్రిప్స్‌తో డాంగ్లింగ్‌లను తయారుచేసి వాటిని నెక్లెస్ లేదా గొలుసుకు అమరుస్తారు. వీటిని సింపుల్‌గా కనిపించే మోడరన్ డ్రెస్‌ల మీద ధరిస్తే బోహేమియన్ గ్లామరస్ లుక్ వస్తుంది. బోహో టాసెల్స్, క్రిస్టల్ ఫ్రింజెస్, సాఫ్ట్ గ్రంజ్‌లతో రూపొందించిన చెయిన్లు... ఫార్మల్ వేర్ మీద బాగా సూటవుతాయి. ముత్యాలు, మువ్వలు, మెరిసే రాళ్లు వేలాడే మల్టీలేయర్డ్ మెటల్ చెయిన్స్... చీరలు, సల్వార్ సూట్స్ లాంటి సంప్రదాయ దుస్తులమీద ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
సన్నని చెయిన్‌కి ప్రేషియస్ రాళ్లు, లావుపాటి గుండ్లు, విభిన్న ఆకృతుల మెటల్ ప్లేట్స్ జోడించి సిద్ధం చేసిన ఫ్రింజ్ బ్రేస్‌లెట్లను యువత ఇష్టంగా ధరిస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, తాళం, తాళం చెవి, కారు, లాఫింగ్ బుద్ద, రాళ్లు పొదిగిన హార్ట్, వివిధ రకాల జంతువుల బొమ్మలను రింగులతో కూర్చిన మల్టీ లేయర్డ్ చెయిన్ ఫ్రింజ్ బ్రేస్‌లెట్లకు అధికంగా డిమాండ్ ఉంటోంది. ఇవి అన్ని రకాల దుస్తుల మీద మోడరన్ లుక్‌నిస్తాయి.
ఫ్రింజ్ జుంకాలను ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. ఇవి వెడల్పుగా పొడవుగా ఉన్నప్పటికీ వేగంగా ఊగుతూ ముఖానికి అదనపు అందాన్నిస్తాయి. వీటిని బంగారం, వెండి, ఆక్సిడైజ్డ్ సిల్వర్, బ్లాక్ మెటల్, ఇతర లోహాలు, పట్టు దారాలతో రూపొందిస్తున్నారు. చాంద్‌బాలీలు, బుట్టలు, పెద్ద రింగులకు నవరత్నాలు, సీజెడ్ రాళ్లు లేదంటే గవ్వలు, రంగు రంగుల పూసలు, చిన్న గంటలు, గుండ్లు, మువ్వలు, సన్నని గొలుసులు వేలాడేలా అమర్చి సరికొత్త ఫ్రింజ్ ఇయర్ రింగ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇవి లెహంగాలు, కుర్తీలు లాంటి సంప్రదాయ దుస్తులమీద బాగుంటాయి. సన్నని పొడవైన సింగిల్ చెయిన్ డిజైన్లు, డ్రాప్ మోడల్స్.. జీన్స్ తరహా మోడరన్ దుస్తుల మీద బాగుంటాయి.
ఇవి కూడా చదవండి
టీమిండియా టెస్ట్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? డేంజర్‌లో గంభీర్ పదవి!
అడవిలో గడ్డి కోస్తుండగా ఊహించని విషాదం..
Updated Date - Dec 28 , 2025 | 05:21 AM