Curious Play Labs: ఆసక్తిగా ఆలోచనాత్మకంగా
ABN, Publish Date - Nov 19 , 2025 | 05:45 AM
‘‘ఒక చిన్న అడుగు... ఎంతోమంది విద్యార్థుల భవితవ్యానికి బలమైన పునాదులు వేసింది. సైన్స్ అంటే అదేదో బ్రహ్మ పదార్థంలాగా భావించి దూరం పెట్టే వారి ఆలోచనా ధోరణిని మార్చేసింది. అందుకు నేను, మావారు అభిజీత్ కారణమైనందుకు...
సంకల్పం
కొంతమంది విద్యార్థులు అన్నింట్లో అల్లుకుపోతారు. కానీ సైన్స్ అనగానే భయపడతారు. అలాంటి పిల్లలను గుర్తించి... వారిలో బెరుకు పోగొడుతున్నారు సరయూ గార్గ్. ఐఏఎస్ అధికారి అయిన తన భర్తతో కలిసి...
సైన్స్‌ను ఒక పాఠ్యాంశంలా కాకుండా... ఆడుతూ పాడుతూ చదివేలా బోధిస్తున్నారు. చిన్నారులను ప్రయోగాల బాట పట్టించి... వారిలో ఆసక్తిని రేకెత్తించి ఆలోచన పెంచుతున్న సరయూ కథ ఇది.
‘‘ఒక చిన్న అడుగు... ఎంతోమంది విద్యార్థుల భవితవ్యానికి బలమైన పునాదులు వేసింది. సైన్స్ అంటే అదేదో బ్రహ్మ పదార్థంలాగా భావించి దూరం పెట్టే వారి ఆలోచనా ధోరణిని మార్చేసింది. అందుకు నేను, మావారు అభిజీత్ కారణమైనందుకు ఆనందంగా ఉంది. మా ఇద్దరి నేపథ్యాలు వేరైనా మేం పుట్టి పెరిగింది చండీగఢ్‌లోనే. నేను ‘పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ’లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చదివాను. 2018లో మొహలీ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ నుంచి వాతావరణ శాస్త్రంలో పీహెచ్‌డీ చేశాను. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అభిజీత్ 2015లో సివిల్స్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం ముక్తసర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు. రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకున్న ఒకేఒక్క, అతిముఖ్యమైన అభిరుచి... పుస్తకాలు చదవడం. అంతేకాదు... ఎక్కడ పని చేసినా కొంత సమయాన్ని విద్యార్థులతో గడుపుతుంటారు. పాఠశాలలను సందర్శించినప్పుడు తనతోపాటు నేను కూడా వెళుతుండేదాన్ని.
అక్కడ మొదలైంది...
ముక్తసర్ రావడానికి ముందు అభిజీత్ ఫాజిల్కా అదనపు కమిషనర్‌గా పని చేశారు. ఆ సమయంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడారు. అప్పుడు తను గమనించింది ఏంటంటే... చాలామంది సైన్స్ అంటే భయపడుతున్నారని. దానివల్ల క్రమంగా వారికి ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తి తగ్గిపోతోందని. టీచర్లను అడిగితే... మార్కుల రేసులో బట్టీ పట్టించడంవల్ల వారు పాఠ్యాంశాలు అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు. పైతరగతుల్లో సైన్స్ అత్యంత కీలకమైన పాఠ్యాంశం. అందులో వెనకబడితే అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. ఇదే మా ఆందోళన. దీనికి సరైన పరిష్కారం కనుగొనాలని అనుకున్నాం.
పాఠంలా కాకుండా...
మొదటి ప్రయత్నంగా నేను, మావారు స్థానిక ప్రభుత్వ పాఠశాలలు అన్నీ తిరిగాం. అక్కడి సైన్స్ ల్యాబ్‌లు పరిశీలించాం. టీచర్లతో మాట్లాడాం. పిల్లలు ఆ సబ్జెక్ట్‌ను అంత దూరం పెట్టడానికి కారణాలను తెలుసుకున్నాం. వారిని ఆవహించిన భయాన్ని పోగొట్టి, సైన్స్‌పై తిరిగి ఆసక్తి కలిగించాలని అనుకున్నాం. దాన్ని ఒక పాఠంలా కాకుండా... సరదాగా సాగిపోయే ఒక కథలా బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనిపించింది. పాఠ్య పుస్తకాల్లో చూసినప్పుడు కొత్త అంశం ఏదైనా కాస్త క్లిష్టంగానే అనిపిస్తుంది. ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్ విషయంలో చాలామంది విద్యార్థులు కంగారుపడుతుంటారు. అలాంటివారిలో ఆసక్తిని రేకెత్తించి, ఆలోచన పెంచేలా బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మేం చేసింది అదే. చండీగఢ్‌లో ‘క్యూరియస్ ప్లే ల్యాబ్స్’ నెలకొల్పాం. దాని ద్వారా పిల్లలకు పాఠ్యాంశాలను ఒక సిలబ్‌సలా కాకుండా ల్యాబ్‌ల్లో ప్రయోగాలతో వివరించి చెప్పాం. ఆ ప్రయోగాల్లో వారిని భాగస్వాములను చేశాం. అది విద్యార్థుల్లో ఎనలేని ఉత్సాహం నింపింది. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగింది.
మార్పు రావాలి...
దాదాపు నాలుగేళ్ల కిందట ప్రారంభించిన ‘క్యూరియస్ ప్లే ల్యాబ్స్’కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. దీంతో ఒకప్పుడు ఇంటికే పరిమితమైన నేను... ల్యాబ్ కోసం పూర్తి సమయాన్ని కేటాయించాను. దాన్ని ఒక రిజిస్టర్ సంస్థగా మార్చాను. ఇక్కడ కేవలం పాఠ్యాంశాల బోధనే కాదు, మానసికంగానూ విద్యార్థులను దృఢంగా తీర్చిదిద్దడంలోనూ శ్రద్ధ పెట్టాం. ఎంతటి క్లిష్టమైన సబ్జెక్ట్ అయినా అర్థం చేసుకొనేలా వారిలో ఆలోచనాశక్తిని, తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాం. ఒక్కసారి పిల్లల్లో పాతుకుపోయిన భయం పోగొడితే... విద్యాభ్యాసం ఆటలాగా ఉల్లాసంగా సాగిపోతుందనేది మా నమ్మకం. ఆ దిశగా విద్యావిధానంలో మార్పు తేవడానికి మేం కృషి చేస్తున్నాం.
ఆటలూ ముఖ్యమే...
విచ్చలవిడిగా కార్పొరేటు బడులు వచ్చాక పిల్లలు ఆటలకు దూరమైపోతున్నారు. విద్యతోపాటు క్రీడలు కూడా వారికి ఎంతో ముఖ్యం. అందుకే అభిజీత్ ప్రస్తుతం ముక్తసర్ జిల్లాలో విద్యార్థులను క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నారు. ‘చాలామంది పిల్లలు ఆటల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. సరైన సదుపాయాలు కల్పిస్తే వారు మెరికల్లా తయారవుతారు’ అంటారు అభిజీత్. అలాంటివారిని ఒకచోటకు చేర్చి, మెరుగైన శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రభుత్వం, వివిధ సంస్థల సహకారంతో సుమారు ముప్ఫై లక్షల నిధులు సమీకరించి టేబుల్ టెన్నిస్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల కోసం ఆటస్థలాలు ఆధునీకరించారు. స్విమ్మింగ్‌పూల్స్ ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు ఆట సామగ్రి అందిస్తున్నారు. అంతేకాదు... మేం ఇద్దరు పేద పిల్లలను దత్తత తీసుకున్నాం. వారికి విద్యతోపాటు కావల్సినవన్నీ సమకూరుస్తున్నాం. ఏదిఏమైనా మేం కోరుకున్న మార్పు దిశగా విద్యార్థులు అడుగులు వేస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉంది.’’
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 19 , 2025 | 05:45 AM