Share News

Maeredumilli Encounter: అందుకే మావోయిస్టులు మారేడుమిల్లికి వచ్చారు: జిల్లా ఎస్పీ

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:06 PM

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మృతి చెందారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఐదుగురు మావోయిస్టులు తప్పించుకున్నారని వివరించారు. వారి కోసం కూంబింగ్ కొనసాగుతుందన్నారు.

Maeredumilli Encounter: అందుకే మావోయిస్టులు మారేడుమిల్లికి వచ్చారు: జిల్లా ఎస్పీ

పాడేరు, నవంబర్ 18: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మృతి చెందారని అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ వెల్లడించారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ వివరాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించారు. మరో ఐదుగురు మావోయిస్టులు ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారన్నారు. వారి కోసం కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు. మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా 28 హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నారని వివరించారు. అతడిపై అనేక రివార్డులు ఉన్నాయని గుర్తు చేశారు. హిడ్మా కదలికలపై గత మూడు వారాలు నుంచే సమాచారం ఉందన్నారు.

ASRR-SP.jpg


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై పోలీసులు ఉక్కుపాదం మోపటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి వారు చేరుకున్నారన్నారు. మావోయిస్టుల ఉద్యమాలకు ప్రజాదరణ లేదని పేర్కొన్నారు. జనజీవనస్రవంతిలోకి రావాలంటూ ఈ సందర్భంగా మావోయిస్టులకు ఆయన పిలుపు నిచ్చారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే మృతి చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు.


హిడ్మా మృతిని ధృవీకరించిన డీఐజీ గోపీనాథ్ జెట్టి..

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతోపాటు అతడి అనుచరులు మరణించారని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి ధృవీకరించారు. మంగళవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. అలాగే మావోయిస్టుల కదిలికలపై నిఘా ఉంటుందని తెలిపారు. మావోయిస్టులపై ఇతర రాష్ట్రాల్లో పోలీస్ నిఘా అధికంగా ఉండడంతో ఆగ్రనేతలంతా ఏవోబీలోకి ప్రవేశిస్తున్నారని వివరించారు.

విశాఖ రేంజ్‌లో మావోయిస్టులకు ఆశ్రయం పొందేందుకు వీలు లేదన్నారు. భవిష్యత్తు ముందని..గంజాయి వద్దని యువత ఆయన సూచించారు. గంజాయి నిర్మూలనలో భాగంగా చైతన్యం కల్పించడం కోసం అభ్యుదయ సైకిల్ యాత్ర చేపట్టామని డీఐజీ స్పష్టం చేశారు. అనంతరం నర్సీపట్నం డి.ఎస్.పి కార్యాలయంలో వార్షిక తనిఖీల్లో భాగంగా వివిధ నేర చరిత్రలపై రికార్డులను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పరిశీలించారు.


ఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు..

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లతోపాటు పేలుడుకు ఉపయోగించే ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

  • ఏకే 47 : 2

  • పిస్టల్ : 1

  • రివాల్వర్ 1

  • సింగిల్ బ్యారెల్ : 1

ఈ వార్తలు కూడా చదవండి..

అర్బన్ నక్సల్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బిహార్‌కు సీఎం చంద్రబాబు, లోకేశ్.. ఎప్పుడంటే..?

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 08:40 PM