Bandi Sanjay: అర్బన్ నక్సల్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:48 PM
అర్బన్ నక్సల్స్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. వారిని చూసి మోసపోవద్దంటూ ప్రజలకు హితవు పలికారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పైరవీలు చేసుకుంటూ వారు ఆస్తులు పోగేసుకుంటున్నారని విమర్శించారు.
సిరిసిల్ల, నవంబర్ 18: అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వారిని చూసి మోసపోవద్దంటూ ప్రజలకు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం వేములవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారని అర్బన్ నక్సల్స్‌పై నిప్పులు చెరిగారు. వారి మాటలు నమ్మి అమాయక,పేద ప్రజలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల మరణాలకు అర్బన్ నక్సల్స్ కారకులని తెలిపారు. నక్సల్స్‌కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులని అభివర్ణించారు. తక్షణమే తుపాకీ వీడి జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. మరో 4 నెలల గడువు మాత్రమే ఉదంటూ ఈ సందర్భంగా మావోయిస్టులకు ఆయన గుర్తు చేశారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దీనిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మరణించారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రంప చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.
మరోవైపు 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆపరేషన్ కగార్‌ను తెరపైకి తీసుకు వచ్చి.. మావోయిస్టులు లక్ష్యంగా వారి ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తోంది. దాంతో వేలాది మంది మావోయిస్టులు మరణించారు. వందలాది మంది ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. భారీగా మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.