Haragopal Comments on Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:14 PM
ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిడ్మా మావోయిస్టు పార్టీలో చాలా బలమైన నాయకుడని ప్రొ. హరగోపాల్ అభివర్ణించారు. పార్టీ కోసం ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి అతడని స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్లే భావిస్తున్నామని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున రంప చోడవరం ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనపై ప్రొ. హరగోపాల్ హైదరాబాద్‌లో స్పందించారు. పార్టీలోని భిన్నాభిప్రాయాలు, విభేదాల వల్లే మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజ్యంలోని మార్పులు, ప్రజల్లో మావోయిస్టు పార్టీకి సపోర్ట్ లేక పోవడం కూడా ఒక కారణమని ప్రొ. హరగోపాల్ స్పష్టం చేశారు. మావోయిస్టుల్లో చీలికలు, విభేదాలు, అభిప్రాయ బేధాలు వలన మావోయిస్టు పార్టీ క్షీణించిందని చెప్పారు. కేంద్ర కమిటీ నేతలు.. ప్రభుత్వం ఎదుట లొంగుబాటుకు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు, కారణాలు ఉన్నాయని ఆయన విశ్లేషించారు. మూడు రాష్ట్రాల పోలీసులతోపాటు, కేంద్ర ప్రభుత్వం సైతం హిడ్మాపై ఫోకస్ పెట్టిందన్నారు. హిడ్మా అనే వ్యక్తి మావోయిస్టు పార్టీలో చాలా బలమైన నాయకుడని అభివర్ణించారు. పార్టీ కోసం ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి హిడ్మా అని ప్రొ.హరగోపాల్ స్పష్టం చేశారు.
ఏదైనా లక్ష్యం నిర్దేశిస్తే పూర్తి చేయగలడనే ఒక బలమైన నమ్మకం హిడ్మాపై పార్టీలో బలంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాలు టెక్నాలజీ, ఆయుధాలు, డ్రోన్లతో అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయన్నారు. వాటిని మావోయిస్టు పార్టీ తట్టుకోలేక పోయిందని వివరించారు. 25 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో లేవన్నారు. అలాగే ప్రజల నుంచీ ఆశించిన స్థాయిలో వారికి మద్దతు లేదని చెప్పారు. మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైనా ఆదివాసీల ఉద్యమాలు మాత్రం ఆగవని ప్రొ.హరగోపాల్ కుండబద్దలు కొట్టారు.
2026, మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం నిర్ణయించింది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఓడిశా, జార్ఖండ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో భద్రతా బలగాలతో జల్లెడ పడుతోంది. దీంతో వివిధ సందర్భాల్లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలలో వేలాది మంది మావోయిస్టులు మరణించారు. పలువురు అగ్రనేతలు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. అలాగే వందలాది మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం పదుల సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాలకు తరలించి విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vijayawada Maoists: మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ కీలక వ్యాఖ్యలు
Maoists In Kakinada And Eluru: ఇటు ఏలూరు... అటు కాకినాడలో మావోల అరెస్ట్