Chunki Jewelry Fashion Trends: చంకీ చమక్కులు
ABN, Publish Date - Dec 14 , 2025 | 01:52 AM
ప్రస్తుతం చంకీ ఆభరణాల హవా కొనసాగుతోంది. మోడరన్ దుస్తుల మీద నప్పేలా ఒకింత పాశ్చాత్య ధోరణిని రంగరించి సరికొత్త చంకీ డిజైన్లను అందుబాటులోకి తెస్తున్నారు జ్యువెలరీ డిజైనర్లు...
ప్రస్తుతం చంకీ ఆభరణాల హవా కొనసాగుతోంది. మోడరన్ దుస్తుల మీద నప్పేలా ఒకింత పాశ్చాత్య ధోరణిని రంగరించి సరికొత్త చంకీ డిజైన్లను అందుబాటులోకి తెస్తున్నారు జ్యువెలరీ డిజైనర్లు. యువతులు, మహిళలు రోజువారీ ధరించే జుంకాలు, గొలుసులు, గాజులు, బ్రేస్‌లెట్లు, ఉంగరాలు... తదితరాలన్నీ చంకీ ఛాయలతో మెరిసిపోతున్నాయి. మహిళలే కాదు పురుషులు కూడా చంకీ స్టయిల్స్‌ను అనుసరించడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. సెలబ్రిటీల నుంచి మధ్యతరగతి వర్గం దాకా అందరినీ ఆకర్షిస్తున్న చంకీ ఆభరణాల సమాచారం మీకోసం...
ఫ్యాషన్ ప్రపంచంలో.. దుస్తులతోపాటు ఆభరణాల్లో కూడా రోజుకో ట్రెండ్ పుట్టుకొస్తోంది. ఒకవైపు కంటికి సరిగా కనిపించనంత సన్నని మినిమలిస్ట్ ఆభరణాలను ఇష్టపడుతూనే మరోవైపు భారీ రింగులు, జ్యామితీ ఆకృతులు, హూప్స్‌తో కూడిన చంకీ డిజైన్లను ఆదరిస్తున్నారు యువత. ఇవి బంగారం, ప్లాటినం, వెండితో మాత్రమే కాదు వన్ గ్రామ్ గోల్డ్, గాజు, లక్క, మట్టి, ప్లాస్టిక్, మెటాలిక్, లోహపు తీగలు, ఆక్సిడైజ్డ్ ఆభరణాలుగా కూడా లభ్యమవుతున్నాయి. 80ల నాటి రెట్రో ఫ్యాషన్‌ను తలపించే మందపాటి చైన్ నెక్లె్‌సలు, లావాటి పొడవైన గొలుసులు, పెద్ద హూప్ ఇయర్ రింగ్స్, లింక్‌లతో కూడిన బ్రేస్‌లెట్లు-ఉంగరాలు, కడియాల్లాంటి గాజులు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరను దృష్టిలో ఉంచుకుని డిజైనర్లు.. 18 కె, 14 కె, 9కె బంగారంతో లోపల గుల్లగా ఉంటూ పైకి భారీగా కనిపించే డిజైన్లను రూపొందిస్తున్నారు. ట్రెండీ లుక్‌ను అమితంగా ఇష్టపడే నేటి తరం అమ్మాయిలు ఈ స్టేట్‌మెంట్ జ్యువెలరీని ఫాలో అవుతూ తమ వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నారు. అప్పుడప్పుడు ఈ చంకీ ఆభరణాలను సంప్రదాయ దుస్తులమీద కూడా ధరిస్తూ సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు.
డెనిమ్ జాకెట్లు, లెదర్ బాటమ్స్, తెల్లటి షర్డులు, స్లీవ్‌లెస్ దుస్తుల మీద చంకీ ఆభరణాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆమధ్య ఓ ఈవెంట్లో భూమి పెడ్నేకర్.. సన్నని లింక్ చెయిన్, మెటల్ బ్రేస్‌లెట్, చెక్క బ్యాంగిల్స్, ఉంగరంతో ఆకర్షణీయంగా కనిపించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మెట్‌గాలా వేడుకల్లో బాలీవుడ్ నటి కాజోల్.. భారీ వెండి కడియాలు, ఉంగరాలు, ముక్కుపుడక, హూప్ ఇయర్ రింగ్స్‌తో కనిపించారు. ఈ ఈవెంట్లో షారూఖ్ ఖాన్ కూడా టూర్‌మలైన్, నీలమణి, వజ్రాలు పొదిగిన 18 కె బంగారు చంకీ గొలుసులు, ఉంగరాలు, పెండెంట్లు ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. మాధురీ దీక్షిత్.. బంగారం, వెండిలతో రూపొందించిన చిక్ కాంబినేషన్ బ్రేస్‌లెట్, బంగారు క్లౌడ్ చెయిన్‌తో అందంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. శ్రద్దా కపూర్, కృతి కర్బందా తరచూ చంకీ బ్రేస్‌లెట్స్, బ్యాంగిల్స్‌తో కనిపిస్తూ ఉంటారు.
మధ్య వేలికి లేదా చూపుడు వేలికి పెద్ద ఉంగరాన్ని పెట్టుకోవడం నేటి ట్రెండ్. లావుగా వెడల్పుగా ఉండే చంకీ డాజ్లర్ అదనపు అందాన్నిస్తుంది. పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. పూలు, లతలు, రేఖా గణిత ఆకృతులు, జ్యామితి వలయాలు, పక్షులు, జంతువుల ఆకారాలను లింక్‌లు, హూప్స్‌తో జోడించి విభిన్నమైన డిజైన్లను రూపొందిస్తున్నారు. వీటి మధ్యలో వజ్రాలు, కెంపులు, పచ్చలు, పగడాలు, నీలాలు కూర్చి గ్రాండ్‌గా తయారుచేసిన చంకీ ఉంగరాలకు అధికంగా డిమాండ్ ఉంటోంది.
సూట్స్, క్యాజువల్స్, ఫార్మల్స్ మీద చంకీ చెయిన్స్ చక్కని యాక్సెసరీ్‌సగా నప్పుతాయి. మల్టీ లేయర్ చెయిన్, కేబుల్ చెయిన్, క్యూబన్ చెయిన్, కర్బ్ చెయిన్, పేపర్ క్లిప్ చెయిన్, హెరింగ్ బోన్ చెయిన్‌లను నేటి యువత ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. వీటికి తమాషా పెండెంట్లను జోడించి మరింత ఆకర్షణీయంగా సందడి చేస్తున్నారు. ఈ చంకీ చెయిన్స్ వారి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆధునికతకు, లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్‌కు ప్రతీకగా నిలుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్
ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్
Updated Date - Dec 14 , 2025 | 01:52 AM