Messi Event Organiser Arrested: కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:02 PM
కోల్‌కతా మెస్సీ రాకతో అల్లర్లు చెలరేగిన కారణంగా టూర్ నిర్వాహకుణ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మెస్సీని చూసేందుకు వేలకు వేలు వెచ్చించి టికెట్ కొనుగోలు చేసిన ప్రేక్షకులకు ఆ సొమ్మును రీఫండ్ చేస్తారని అక్కడి ఏడీజీ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ(Lionel Messi).. గోట్ ఇండియా టూర్(GOAT India Tour)లో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా.. మెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ శతద్రు దత్తాను అరెస్ట్ చేశారు పోలీసులు(Messi Event Organiser Satadru Dutta). మెస్సీ పాల్గొన్న కార్యక్రమాన్ని నిర్వహించడంలో విఫలమైనందుకు గానూ.. ఆయన్ను బాధ్యుణ్ని చేస్తూ అరెస్ట్ చేసినట్టు కోల్‌కతా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(ADG) జావేద్ షమీమ్ ధృవీకరించారు.
టికెట్ అమౌంట్ రీఫండ్.!
మెస్సీ(Messi) రాక నేపథ్యంలో.. సాల్ట్ లేక్ స్టేడియాని(Salt Lake Stadium)కి అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. షెడ్యూల్ ప్రకారం.. మెస్సీ అక్కడ ఓ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్(Friendly Football Match) అడాల్సిఉంది. ఈ మ్యాచ్ ద్వారా అర్జెంటీనా దిగ్గజంను ప్రత్యక్షంగా చూడాలనే కాంక్షతో ఒక్కొక్కరు రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకూ వెచ్చించి టికెట్ కొనుగోలు చేశారు అభిమానులు. అయితే.. స్టేడియంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో మ్యాచ్ ఆడకుండానే వెనక్కు వెళ్లిపోయాడు మెస్సీ. తమ అభిమాన క్రీడాకారుడి ఆటను చూద్దామని వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆగ్రహానికి లోనై.. సీట్లు ధ్వంసం చేసి, బాటిళ్లు విసిరేసి నిరసనకు దిగారు. మరికొందరైతే బారికేడ్లు దాటి స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. అయితే.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు ఏడీజీ తెలిపారు. స్టేడియానికి హాజరైన ప్రేక్షకులకు నిర్వాహకులు డబ్బు రీఫండ్(Refund) చేస్తారని ఏడీజీ అన్నారు.
మెస్సీకి సారీ చెప్పిన సీఎం..
ఈ విషయమై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Benarjee) స్పందిస్తూ.. మెస్సీకి 'ఎక్స్' మాధ్యమం వేదికగా క్షమాపణలు చెప్పారు. స్టేడియంలో నిర్వాహణ లోపం గురించి తెలిసి షాక్‌కు గురైనట్టు తెలిపిన ఆమె.. ఈ విషయమై చింతిస్తున్నట్టు తెలిపారు. మెస్సీ సహా స్పోర్ట్స్ లవర్స్, ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై విచారణ కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు. ఆ కమిటీ పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టనుందని చెప్పారు మమత.
ఇవీ చదవండి: