Shashi Thaoor: ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:43 PM
తిరువనంతపురంలో చారిత్రక పనితీరును బీజేపీ ప్రదర్శించిందని, సిటీ కార్పొరేషన్‌ను గెలుచుకున్నందుకు హృదయాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అన్నారు.
న్యూఢిల్లీ: తిరువనంతపురం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP)ని కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శిశథరూర్ (Shashi Tharoor) అభినందించారు. ప్రజాతీర్పును తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పేర్కొన్నారు. తన సుదీర్ఘ పోస్ట్‌లో కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)ను సైతం ఆయన ప్రశంసించారు. కేరళ అభివృద్ధికి యూడీఎఫ్ కట్టుబడి ఉందని అన్నారు.
'కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చిన రోజు ఇది. తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి తొణికిసలాడుతోంది' అని శశిథరూర్ సంతోషం వ్యక్తం చేశారు. తిరువనంతపురంలో చారిత్రక పనితీరును బీజేపీ ప్రదర్శించిందని, సిటీ కార్పొరేషన్‌ను గెలుచుకున్నందుకు హృదయాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. 45 ఏళ్ల లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) అవకతవకల పాలనకు వ్యతిరేకంగా మార్పు కోరుతూ తాను ప్రచారం సాగించానని, అయితే ఇదే తరహాలో మార్పు కోరుతున్న మరో పార్టీకి అంతిమంగా ఓటర్లు తీర్పునిచ్చారని చెప్పారు. స్థానిక సంస్థలకు రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ వార్డులను కైవసం చేసుకున్న యూడీఎఫ్‌ను సైతం ఆయన అభినందించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజా ఫలితాల ద్వారా ప్రజలు శక్తివంతమైన సంకేతాలనిచ్చారని అభివర్ణించారు. కష్టపడి పనిచేయడం, స్పష్టమైన ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా 2020 కంటే మంచి ఫలితాలను సాధించామన్నారు. కేరళ అభివృద్ధికి పునరకింతమై పనిచేస్తామని, సుపరిపాలనకు కట్టుబడి మునుముందుకు దూసుకు వెళ్తామని అన్నారు.
కాగా, కేరళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం సాయంత్రం వరకూ వెలువరించిన ఫలితాల ప్రకారం, ఎల్డీఎఫ్ అధీనంలోని కొల్లాం, త్రిసూరి, కొచ్చిలో యూడీఎఫ్ గెలుపు ఖాయమైంది. అయితే తిరువనంతపురంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే చారిత్రక విజయాన్ని సాధించింది. 101 వార్డుల్లో 50 వార్డులు సొంతం చేసుకుంది. అధికార ఎల్‌డీఎఫ్ 29 వార్డులు, యూడీఎఫ్ 19 వార్డులు గెలుచుకోగా, రెండు వార్డులను ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. 45 ఏళ్ల తర్వాత కామ్రేడ్ల కంచుకోటను బీజేపీ కైవసం చేసుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి.
ఇవి కూడా చదవండి..
తిరువనంతపురం కొర్పొరేషన్ బీజేపీ కైవసం
బీజేపీ పనితీరుపై అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తి.. పార్టీని వీడతారంటూ ఊహాగానాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి