Amarinder Singh: బీజేపీ పనితీరుపై అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తి.. పార్టీని వీడతారంటూ ఊహాగానాలు
ABN , Publish Date - Dec 13 , 2025 | 03:59 PM
బీజేపీ అంతర్గత వ్యవహారాలపై అమరీందర్ సింగ్ అంసతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. పంజాబ్ రాష్ట్ర సంక్షేమం కోసం పని చేసేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పనితీరుపై ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amrinder Singh) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీలో ప్రధాన నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే తీసుకుంటారని, తనవంటి సీనియర్ నేతల అభిప్రాయాలను అడగటం లేదని ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అభిప్రాయాలను వ్యక్తం చేయడం సరళతరంగా ఉంటుందని, సంప్రదింపుల తరహా రాజకీయాలను ఆ పార్టీ కొనసాగిస్తుంటుందని చెప్పారు.
'బీజేపీలో క్షేత్రస్థాయి నేతలను చాలా అరుదుగానే సంప్రదిస్తారు. 60 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ పార్టీలో ఏ ఒక్కరూ నా సలహాలు అడగడం లేదు. నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే తీసుకుంటున్నారు' అని అమరీందర్ సింగ్ చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేసే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తనను తొలగించడం ఇప్పటికీ బాధిస్తూనే ఉందని, ఆ పార్టీలో తిరిగి చేరేది లేదని చెప్పారు.
బీజేపీ అంతర్గత వ్యవహారాలపై అమరీందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. పంజాబ్ రాష్ట్ర సంక్షేమం కోసం పని చేసేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పంజాబ్‌లో బీజేపీ అవకాశాలపై అడిగినప్పుడు, శిరోమణి అకాలీదళ్, బీజేపీ కలిసి పనిచేస్తేనే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పటిష్టమవుతుందని అన్నారు. పొత్తు లేకుండా పంజాబ్‌లో బీజేపీ తన పరిధిని విస్తరించుకోవడం కష్టమని తెగేసిచెప్పారు.
సిద్ధూ దూరంగా ఉంటేనే మంచిది..
సిద్ధూ తిరిగి చురుకుగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలపై అమరీందర్ స్పందిస్తూ, సిద్ధూ రాజకీయాలకు దూరంగా ఉండటం, క్రికెట్ కామెంటరీపై దృష్టి సారించడం మంచిదని అన్నారు. కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు మంత్రిత్వ శాఖలు ఇచ్చామని, అందులో ఒకటి శక్తివంతమైన మంత్రిత్వ శాఖ అనీ, అయినప్పటికీ ఆయన అసంతృప్తితోనే వ్యవహరించారని చెప్పారు. 'ఆయన ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూనే ఉండేవారు. ఎట్టకేలకు రిజైన్ కూడా చేశారు. ఎప్పుడూ ఆయన బాధ్యత తీసుకోలేదు. నెలల తరబడి ఆయన ఫైళ్లు పెండింగ్‌లో ఉండేవి. సూటిగా చెప్పాలంటే ఆయన ఆ పదవికి తగడు' అని అమరీందర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
తిరువనంతపురం కొర్పొరేషన్ బీజేపీ కైవసం
ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి