ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandur Handlooms Traditional Weaves: చండూరు చేనేతకు సరికొత్త హంగులు

ABN, Publish Date - Dec 08 , 2025 | 02:13 AM

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ‘కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డు’లకు తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎంతోమంది చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఇక్కత్‌ చీరల తయారీలో వీరు...

సంస్కృతి

ఎర్రంచు తెల్లచీర... పద్మాంజలి పట్టు...

మారుతున్న కాలానికి అనుగుణంగా...

ఆధునికతను ఆవాహన చేసుకొని... సంప్రదాయ

వస్త్రానికి సరికొత్త డిజైన్లు జోడిస్తున్నారు చండూరు

చేనేత కళాకారులు. వినియోగదారుల అభిరుచికి

తగిన పట్టు చీరలు నేస్తూ... సినీ, రాజకీయ,

వ్యాపార రంగ ప్రముఖులను ఆకర్షిస్తున్నారు.

ఫ్యాషన్‌ ప్రపంచంలో తమ ప్రత్యేకత చాటుతూ...

ప్రతిష్ఠాత్మక అవార్డులు సైతం పొందుతున్న

నల్లగొండ జిల్లా చండూరు చేనేతపై ‘నవ్య’ కథనం.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ‘కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డు’లకు తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎంతోమంది చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఇక్కత్‌ చీరల తయారీలో వీరు సిద్ధహస్తులు. వీరి చేతుల్లో రూపుదిద్దుకున్న వస్త్రశ్రేణులు భారత్‌లోనే కాకుండా... రష్యా, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. ఆర్డర్లపై ఎగుమతి అవుతుంటాయి. రసాయన రంగులతోపాటు చెట్లు, వాటి బెరడు, ఆకులను ఉపయోగించి రంగులు తయారు చేస్తున్నారు.

  • పద్మాంజలి పట్టు కేరాఫ్‌ చండూరు...

చేనేత పట్టు చీర ఆధునికత హంగులు అద్దుకొని తెలంగాణ పద్మాంజలిగా వెలుగొందుతోంది. కంచి పట్టు చీరలకు మించి మార్కెట్లో డిమాండ్‌ అందుకుంటున్న ఈ మోడల్‌ పుట్టినిల్లు మన చండూరు. గౌరంగ్‌షా డిజైన్లు, గజం అంజయ్య ఆలోచనల మేళవింపుతో రూపొందించిందే పద్మాంజలి పట్టు చీర. కంచి పట్టు చీరలకు దీటుగా చండూరు చేనేత కార్మికులు తయారు చేస్తున్న ఈ చీరలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రముఖ మాస్టర్‌ వీవర్‌ గజం అంజయ్య వద్ద మెలకువలు నేర్చుకున్న కొంతమంది నేత కార్మికులు ప్రత్యేకమైన జకార్డు మిషన్ల ద్వారా ఇక్కత్‌ టెక్నాలజీని ఉపయోగించి వీటిని రూపొందిస్తున్నారు.

  • నాటి పెద్దంచు చీరే...

ఒకప్పుడు పెద్దంచు పట్టు చీరలంటే ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. అవి నేతన్నలకు మంచి ఉపాధి మార్గం అయ్యాయి. మగ్గాల స్థానంలో మిషన్లు రావడంతో నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ దశలో చేనేత కార్మికులు తమ ఆలోచనలకు పదును పెట్టి పెద్దంచు పట్టు చీరకు ఆధునిక పరిజ్ఞానంతో విభిన్న డిజైన్లు జోడించారు. తమదైన శైలిలో పద్మాంజలి పట్టు చీరలుగా మార్కెట్లోకి తీసుకు వచ్చారు. దీనికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించడంతో, నేతన్నలకు ఇది ఒక వరమయింది. ఈ చీరల తయారీలో మాస్టర్‌ వీవర్లు ప్రత్యేక పట్టును... స్వచ్ఛమైన వెండి జరీని ఉపయోగించి నేస్తుండటంతో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్‌ వస్తోంది.

  • ఎర్రంచు తెల్ల చీర...

బెంగాల్‌ మహిళల ఆహార్యంలో ప్రత్యేక భాగమైన ఎర్రంచు తెల్ల చీర... లాల్‌పాడ్‌ సఫేద్‌ చీర గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. సాధారణంగా ఇక్కత్‌ కాటన్‌ చీరలు ధరించే మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి అప్పట్లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన రోజు... లాల్‌పాడ్‌ సఫేద్‌ చీరలో ఆకట్టుకున్నారు. ఈ డిజైన్‌ చీరలు నల్లగొండ జిల్లా చండూరులో తయారవుతున్నాయి. చండూరుకు చెందిన చిలుకూరి శ్రీనివాసులు స్థానికంగా చేనేత కళాకారులతో నేయించి హైదరాబాద్‌కు చెందిన మార్కెటింగ్‌ మాస్టర్‌ వీవర్‌ గజం భగవాన్‌కు విక్రయిస్తున్నట్టు ఇక్కడి మాస్టర్‌ వీవర్స్‌ చెబుతున్నారు. టస్సర్‌ సిల్క్‌తో చీర తయారవుతుందని, అంచు బ్లెడ్‌ రెడ్‌, కొన అంచు గ్రీన్‌, మధ్యన హాఫ్‌ వైట్‌ కలర్‌లో ఉండటం ప్రత్యేకతని చెప్పారు. వీటి ధర రూ.25 వేలు ఉంటుంది. మాస్టర్‌ వీవర్ల ద్వారా కోల్‌కతా, ముంబయి నగరాలతో పాటు గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ రాష్ర్టాల్లో కూడా వీటికి మంచి ఆదరణ ఉంది. అంతేకాదు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. పిల్ల, పెద్ద... అన్ని వయసులవారికీ నప్పేలా ఇక్కడ వస్త్రశ్రేణులు సిద్ధమవుతాయి. పాన్‌ పఠాన్‌, నార్‌కుండి, రాజస్థాన్‌, నవరత్నం వంటి డిజైన్లతో పాటు జరీ బోర్డర్లతో వినియోగదారుడి అభిరుచికి అనుగుణంగా, అందుబాటు ధరల్లో అందిస్తున్నారు. వీటితో పాటు ఏనుగు పిట్ట, జరీ చెక్స్‌, ఫుల్‌ జరీ చీరలు కూడా ప్రత్యేకత సంతరించుకున్నాయి. నియోజకవర్గ పరిధిలో వందల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి.

  • మడ్తాస్‌ ఇక్కత్‌ చీర...

చండూరుకు చెందిన చేనేత కళాకారుల మరో వినూత్న డిజైన్‌... మడ్తాస్‌ ఇక్కత్‌ చీర. వీటి తయారీతో ఇక్కడి కళాకారులు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఏడాదిపాటు కష్టపడి 234 కొయ్యలు, రిపీట్‌ లేకుండా ఆరు వరుసల్లో, వైట్‌ బేస్‌ చీరల్లో పకృతి అందాలతో పరవశించి నాట్యం చేసే అంబారీ నెమలిని రూపొందించారు. మధ్య మధ్యన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ, పద్మాల డిజైన్లు వేశారు. డిజైన్లను రూపొందించడం, వాటిని గ్రాఫ్‌పై గీయడం, మగ్గంపై నేయడానికి మూడు నెలలు కష్టపడ్డారు. వీరి పనితనానికి ప్రభుత్వం గుర్తింపు కూడా దక్కడం విశేషం.

  • అన్నదమ్ములకు అవార్డులు...

చండూరుకు చెందిన చిలుకూరి శ్రీనివాసులు సహజసిద్ధమైన రంగులతో డబల్‌ ఇక్కత్‌ దుపట్టాను తయారు చేశారు. దీనికిగాను ‘కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డు’కు ఎంపికయ్యారు. శ్రీనివాసులు అన్న చిలుకూరి కృష్ణయ్య 2023లో, తమ్ముడు చిలుకూరి ధనుంజయ 2024లో ఈ అవార్డులు సొంతం చేసుకున్నారు. దాదాపు 35 సంవత్సరాలుగా ముగ్గురు అన్నదమ్ములు డబుల్‌ ఇక్కత్‌పైనే ప్రయోగాలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు రసాయన రంగులతో డబుల్‌ ఇక్కత్‌ వస్త్రాలు నేసినా, ఆ తర్వాత నుంచి సహజ సిద్ధమైన రంగులకు మారి మంచి ఆదరణ పొందుతున్నారు. దుపట్టా తయారు చేసేందుకు రెండు నెలల సమయం పట్టిందంటారు శ్రీనివాసులు.

బరిగెల శ్రీనివాస్‌, చండూరు

ప్రోత్సహిస్తే మరింతమంది

గతంలో మాదిరిగా నూలు రంగుల సబ్సిడీ పథకాలను కొనసాగిస్తే ఈ రంగంపై పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఆసక్తితో ముందుకు వస్తారు. దీనివల్ల నేతన్నలకు ఉపాధి లభిస్తుంది. గ్రామం నుంచి చేనేత కార్మికుల వలసలు తగ్గుతాయి. యువత కూడా ఈ రంగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

చిలుకూరి శ్రీనివాసులు

ఈ వార్తలు కూడా చదవండి..

శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని

సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్

For More AP News And Telugu News

Updated Date - Dec 08 , 2025 | 02:13 AM