Share News

Kishan Reddy Slams Revanth Govt: సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్

ABN , Publish Date - Dec 07 , 2025 | 04:15 PM

రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, రేవంత్ పాలనకు ఏ మాత్రం తేడా లేదని విమర్శించారు.

Kishan Reddy Slams Revanth Govt: సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్
Central Minister Kishan Reddy

హైదరాబాద్, డిసెంబర్ 07: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేడా లేదని.. ఈ రెండు కుటుంబ, అవినీతి పార్టీలేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలంటూ తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మిగుల రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మనం చూశామని.. కేసీఆర్ కుటుంబ పాలన ఎంత అవినీతి చేసిందో అందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెచ్చుకున్న ఈ ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో ఆనాడు బందీ అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందని.. హామీలు అమలు చేయకుండానే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన పేరుతో దినోత్సవాలు నిర్వహిస్తున్నారంటూ సీఎం రేవంత్‌పై మండిపడ్డారు.


ప్రజలకు ఏం చేశారని ఈ ఉత్సవాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలకి ఇచ్చే సన్న బియ్యానికి సైతం కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం మార్పు రాలేదని.. కేసీఆర్ పోయి.. రేవంత్ రెడ్డి వచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాలనలో మార్పు లేదు.. దోపిడీలో మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఈ రెండేళ్లలో అమలు చేసి ఉంటే ఇందిరాపార్క్ వద్ద తనతో చర్చకు వస్తావా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుందని.. ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని, నిరుద్యోగ భృతి రూ.4వేలు ఎందుకు ఇవ్వలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.


వృద్ధులు, వికలాంగులకి పెంచి ఇస్తామన్న పెన్షన్లు ఏమయ్యాయంటూ ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కేంద్రమంత్రి నిలదీశారు. ప్రభుత్వ భూములని అమ్మకపోతే పూట గడవని పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డిదంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్‌లు రద్దు చేస్తామన్నారని.. వాటిని ఎందుకు రద్దు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. కుటుంబాలను రోడ్ మీద పడేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని

హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు: విజయసాయిరెడ్డి

For More TG News And Telugu News

Updated Date - Dec 07 , 2025 | 04:54 PM