Bhargavi Kunam Celebrity Designer: ప్రతి చేనేత వెనక ఒక కథ ఉంటుంది
ABN, Publish Date - Dec 07 , 2025 | 05:51 AM
భార్గవి కూనం... సెలబ్రిటీ డిజైనర్. ఫ్యాషన్ రంగంలో భార్గవి లేబుల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి భార్య గీత నుంచి మెగా కృష్ణారెడ్డి భార్య సుధ దాకా... నయనతార నుంచి శ్రీలీల దాకా....
అతిథి
భార్గవి కూనం... సెలబ్రిటీ డిజైనర్. ఫ్యాషన్ రంగంలో భార్గవి లేబుల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి భార్య గీత నుంచి మెగా కృష్ణారెడ్డి భార్య సుధ దాకా... నయనతార నుంచి శ్రీలీల దాకా అందరూ భార్గవి దగ్గర దుస్తులు డిజైన్ చేయించుకొనే వారే! భార్గవిని ‘నవ్య’ పలకరించినప్పుడు తన అనుభవాలను పంచుకున్నారు.
చాలామంది సెలబ్రిటీలతో పనిచేయటం కష్టం కదా... అని అడుగుతూ ఉంటారు. కానీ నా ఉద్దేశంలో అంత కష్టం కాదు. గీత గారికి (రేవంత్‌రెడ్డి భార్య), సుధ గారికి (మెగా కృష్ణరెడ్డి భార్య), సమంత.. నయనతార.. రకుల్.. శ్రీలీల..
ఇలా చాలామంది సెలబ్రిటీలకు ఏం కావాలో నాకు తెలుసు. వారితో చాలా కాలంగా కలిసి పని చేస్తున్నాను కాబట్టి వారి ఇష్టాలు నాకు తెలుసు. వాళ్లకు ఏం కావాలో తెలిసినప్పుడు డిజైనింగ్ సులభమవుతుంది కదా!
ఇతర కస్టమర్లకు మూడు ప్రత్యామ్నాయాలు చూపిస్తే- వీరికి పది చూపిస్తాను. అయితే కొన్నిసార్లు ఒత్తిడి ఉంటుంది. ప్రస్ట్రేషన్ కూడా వస్తుంది. కానీ వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే వాటన్నిటినీ దాటితేనే వృత్తిపరంగా మనం ఎదగగలుగుతాం.
‘‘మాది ఆళ్లగడ్డ. మధ్యతరగతి కుటుంబం. డాక్టర్ల కుటుంబం. మా నాన్నగారు డాక్టర్. మా అన్నయ్య డాక్టర్. నేను ఇంటర్ పూర్తి చేసిన తర్వాత నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయాలనుకున్నా. కానీ ఆ రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును చిన్నచూపు చూసేవారు. నేను నిఫ్ట్‌లో చేరటానికి నాన్నగారు ఒప్పుకోలేదు. నేను క్రియేటివ్ కోర్సు చేయాలనుకున్నా. ఆర్కిటెక్చర్‌కు వెళ్తానని పట్టుపట్టా. నాన్నగారు ఒప్పుకున్నారు. ఆర్కిటెక్చర్ చదివాను కానీ నా దృష్టి.. శ్రద్ధ అంతా బట్టలపైనే ఉండేది. ఎందుకో నాకు తెలియదు.. ఒక మంచి చీరనో.. డ్రస్సునో చూసినప్పుడు.. దానిని ఎంపిక చేసుకున్నప్పుడు ఇతరులలో వచ్చే చిరునవ్వును చూడటం నాకు చాలా ఇష్టం. ఒక కంపెనీలో ఆరు నెలలు పనిచేసి బయటకు వచ్చేసి సొంతంగా ఒక లేబుల్ పెట్టుకున్నా. నేను నా సొంత డిజైనింగ్ కంపెనీని ప్రారంభించినప్పుడు నా దగ్గర ముగ్గురు పని చేసేవారు. 18 ఏళ్ల తర్వాత 200 మంది నా దగ్గర పనిచేస్తున్నారు. ఈ 18 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అనుభవాలు. వాటి నుంచి నేర్చుకున్న ఎన్నో పాఠాలు. వాటిని వెనక్కి తిరిగి చూసుకుంటే- ఆనందంగా అనిపిస్తుంది. సంతృప్తిగా అనిపిస్తుంది.
ఎవరూ తెలియని దశ నుంచి...
నేను హైదరాబాద్‌కు తొలిసారి వచ్చినప్పుడు- నాకు వృత్తి కొత్త. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. ఇప్పుడు ఇక్కడ అందరూ తెలుసు. ఎవరైనా నన్ను మీ 18 ఏళ్ల గురించి చెప్పండి అని అడిగితే- ‘‘అప్పుడు ఎవరూ తెలియదు.. ఇప్పుడు అందరూ తెలుసు’’ అని చెబుతాను. ప్రారంభించినప్పుడు ఇద్దరు ఎంబ్రడరీ పనివాళ్లు ఉండేవారు. ఒక టైలర్ ఉండేవారు. నేను తొలిసారి లంగా.. ఓణీ డిజైన్ చేసి ఒక క్లయింట్‌కు ఇవ్వటం నాకు ఇంకా గుర్తుంది. నేను ప్రారంభించిన రోజుల్లో బొటిక్‌లు ఉండేవి. వాటిలో కొన్ని డిజైనర్ వేర్ ఉండేది. అక్కడకు వెళ్లి మనకు నచ్చింది కొనుక్కోవాల్సి వచ్చేది. మనకు నచ్చింది కొనుక్కోవటం కాకుండా మనకు ఏది నప్పితే అది కుట్టించుకుంటే బావుంటుందని నేను భావించాను. అలా నా కస్టమర్లకు వాళ్లకు ఏది నప్పుతుందో సూచించేదాన్ని.
మలుపు తిప్పిన సందర్భం...
కొందరు కొన్ని రకాల బట్టలు వేసుకోవటానికి ఇష్టపడరు. వారికి తగినట్లుగా బట్టలు కుట్టేదాన్ని. వాళ్లు పార్టీలకు వెళ్లినప్పుడు అవి భిన్నంగా ఉన్నాయని అందరూ గమనించేవారు. వారు మళ్లీ నాకు చెప్పేవారు. నా అనుభవసారమంతా కస్టమర్ల నుంచి వచ్చినదే! వాళ్లు నేర్పినదే. పదేళ్ల పాటు నేను ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా పనిచేశా. ఆ తర్వాత ‘భార్గవి కూనం’ కోసం వచ్చేవారు. 15 ఏళ్ల క్రితం ఒక ఇంగ్లీషు దినపత్రిక కోసం నోవాటెల్‌లో ఒక డిజైనర్ ఫ్యాషన్ షో నిర్వహించాను. హైదరాబాద్‌లో అలాంటి ఫ్యాషన్ షో జరగటం అదే తొలిసారి. ఆ ఫ్యాషన్ షో తర్వాత నాకు మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో కృష్ణవంశీ గారి ‘మొగుడు’ సినిమాలో 36 మందికి బట్టలు.. నగలు నేనే డిజైన్ చేశాను. ఆ సినిమాలో హీరోయిన్ తాప్సీ పన్ను, హీరో గోపీచంద్‌లకు డిజైన్ చేసిన బట్టలు బాగా ప్రసిద్ధి పొందాయి. ఈ సినిమాలో అనేక తరాలకు కావాల్సిన బట్టలు డిజైన్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమావల్ల ఒక పెద్ద వివాదంలో చిక్కుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాకు నేను డిజైనర్‌ని. క్రెడిట్స్‌లో కూడా నా పేరే ఉంటుంది. అయితే ఈ కాస్ట్యూమ్ డిజైన్స్‌ను ఆ సినిమా నిర్మాతలు కళామందిర్‌కు 50 లక్షల రూపాయలకు విక్రయించారు. కళామందిర్ వారు వెడ్డింగ్ కలెక్షన్‌గా ప్రచారం చేసుకున్నారు. నేను ఆ సమయంలో నా ఆవేదనను ఫేస్‌బుక్‌లో పెట్టాను. ఆ సమయంలోనే ‘నేను ఎప్పుడూ సినిమాలకు పని చేయకూడదు’ అనుకున్నా. ‘రారండో.. వేడుక చేద్దాం’ సహా 20 సినిమాలకు పనిచేసి ఉంటా! ఈ సినిమాలో మొత్తం 25 లంగా, ఓణీలు డిజైన్ చేశాను. కానీ ఏ రోజూ డైరక్టర్‌ని కానీ.. హీరో హీరోయిన్లను కానీ కలవలేదు. స్టైలి్‌స్టతోనే కలిసి పనిచేశా! వాళ్లు డబ్బులు ఇచ్చారు. నేను డిజైన్స్ ఇచ్చా. ఈ సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు వేస్తే నాకు మరింత పేరు వచ్చేదేమో! కానీ సినిమాలకు నాకు పడదని అర్ధమయిపోయింది కాబట్టి నేను క్రెడిట్ కోసం ఎప్పుడూ పట్టించుకోలేదు.
నేసేవారందరూ మహిళలే
నేను బ్రాండ్ ప్రారంభించినప్పుడు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్త్రాలు కొనేదాన్ని. పదేళ్ల తర్వాత దానిని కూడా నేనే తయారుచేయించుకుంటే బావుండుననిపించింది. 8 ఏళ్ల క్రితం నాకు అవసరమైన బట్టలు నేను నేయించుకోవటం మొదలుపెట్టాను. ఒక మగ్గంతో ప్రారంభించా. ఇప్పుడు నా దగ్గర 45 మగ్గాలు ఉన్నాయి. వీటిని నేసేవారందరూ మహిళలే! వాళ్లకు ఇంట్లో పని అయిపోయిన తర్వాత నేయటం మొదలుపెడతారు. వారికి డబ్బులు కూడా వస్తాయి. నా బట్టలన్నీ వీళ్లు నేసినవే! కొన్ని చీరలు చాలా బావుంటాయి. కొన్ని అంతగా బావుండవు. దీనికి కారణం- నేసేవారి భావోద్వేగాలు. ప్రతి చీర వెనక ఒక నేత కథ ఉంటుంది. అందుకే చీరలకు ఆత్మ ఉంటుందని నేను నమ్ముతాను. చీరలు వాటిని నేసేవారి కథలను ప్రతిబింబిస్తాయి. చీరకు వారికి మధ్య ఒక అనుబంధం ఉంటుంది. ఇప్పటికీ కాంచీపురంలో చీర నేసిన వెంటనే కామక్షి దేవి ఆలయానికి తీసుకువెళ్లి పూజ చేయిస్తారు.
అమ్మవారి ఆశీస్సులు పొందుతారు.’’
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
నా బలం నా వర్క్. నా క్లయింట్స్. ఇప్పుడు వెడ్డింగ్స్‌లో వేర్వేరు డిజైజర్స్‌ను వాడుతున్నారు. ఆరేళ్ల క్రితం అన్నీ ఒక్కళ్లకే ఇచ్చేవారు. ఇప్పుడు వేర్వేరు ఫంక్షన్లకు వేర్వేరు డిజైనర్లను పెట్టుకుంటున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి కూతురు పెళ్లిలో 12 ఈవెంట్స్‌కు నేనే కాస్ట్యూమ్స్ డిజైన్ చేశా! వారి కుటుంబంలో నలుగురు ఉంటే, వారందరికీ ప్రతి ఫంక్షన్‌కూ పది భిన్నమైన డిజైన్స్ చేసి చూపించాల్సి వచ్చింది. అది నిజంగా ఒక ఛాలెంజ్ అని చెప్పాల్సిందే!
మనం ఎంత ఆధునికంగా ఉన్నా పెళ్లిళ్లకు, పండగలకు సంప్రదాయబద్ధంగా బట్టలు ధరించాల్సిందే! వీటిలో నాకు అనుభవం ఉంది. నేను రకరకాల చేనేతలను కలిపి కుడతాను. కాంచీవరం లెహంగాకు.. కలంకారి దుప్పట్టా వేసి.. దానిపై ఎంబ్రడరీ బ్లౌజ్ వేస్తాను. ఇలా రకరకాల చేనేతలను కలపటంవల్ల మొత్తం డ్రస్సుకు మంచి అందం వస్తుంది. ఒక డ్రస్సులో అనేక పొరలు వేస్తా. ప్రతిసారి వేర్వేరు రంగులు వాడతాను.
దక్షిణ భారత మహిళలు చాలా బావుంటారు. వాళ్లు వేసుకొనే ఓణీలు, చీరలు వాళ్లను భిన్నంగా మారుస్తాయి.
ఒక పెళ్లికి వెళ్లే ప్రతి అమ్మాయి, ప్రతి మహిళా చాలా అందంగా కనిపిస్తుంది. తెలుగు, కన్నడ, తమిళులు అని వేర్వేరుగా అనిపించవచ్చు. కానీ అందరూ చాలా అందంగా ఉంటారు. తమిళులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. తెలుగు వారు కొత్త కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
Read Latest AP News and National News
Updated Date - Dec 07 , 2025 | 05:51 AM