Abhaya Vidya Nidhi Society: చేయీ చేయీ కలిపి
ABN, Publish Date - Nov 27 , 2025 | 02:37 AM
మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక రకాల అసమానతలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటినైనా తొలగించాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నారు గుంతకల్లుకు చెందిన కొందరు మహిళలు...
మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక రకాల అసమానతలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటినైనా తొలగించాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నారు గుంతకల్లుకు చెందిన కొందరు మహిళలు. రోజుకు రెండు రూపాయలు ఆదా చేస్తే- బాలికలకు ఉన్నత విద్యను అందించవచ్చనే లక్ష్యంతో ‘అభయ విద్యా నిధి సొసైటీ’ అనే ఒక సంస్థను స్థాపించారు. ఆ సొసైటీ ఇప్పుడు అనేక మంది పేద బాలికలకు ఆసరాగా నిలుస్తోంది.
గుంతకల్లుకు చెందిన సత్రసాల వసుంధర ఒక సాధారణ మహిళ. కానీ ఆమెకు సమాజానికి ఏదైనా చేయాలనే కోరిక బలంగా ఉండేది. విద్య వల్ల మహిళలకు సాధికారత వస్తుందని ఆమె నమ్మేవారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యను అభ్యసించలేని అనేక మంది బాలికలను ఆమె ప్రత్యక్షంగా చూశారు. వారికి ఏదైనా సాయం చేయాలనుకున్నారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ‘అభయ విద్యా నిధి సొసైటీ’. తన వద్ద ఉన్న 20 వేల రూపాయలను విరాళంగా ఇచ్చి ఈ సొసైటీని ప్రారంభించారు. ఆమెలా సమాజానికి ఏదైనా చేయాలనే ఆసక్తి ఉన్నవారెందరో ఆమెకు సహకరించారు. చిన్న చిన్న బిందువులు కలిస్తేనే ఒక సముద్రమవుతుంది. మధ్యతరగతి ప్రజలు ఇతరులకు సాయం చేయలేరు కాబట్టి వసుంధర ఒక వినూత్నమైన ఆలోచనకు తెరలేపారు. దీనిలో భాగంగా- సొసైటీలో చేరిన సభ్యులందరి ఇళ్లలోను.. వారి పరిచయస్థుల ఇళ్లు, షాపుల్లోను హుండీ డబ్బాలు పెట్టారు. ఈ హుండి పెట్టుకున్న వారు క్రమం తప్పకుండా రోజుకు రెండు రూపాయలు దానిలో వేయాలి. ఇలా జమైన సొమ్ము ఏప్రిల్ నెలలో సొసైటీకి ఇస్తారు. ఈ ఆలోచన చాలా మందికి నచ్చింది. దీనిలో అనేక మంది హుండీల ద్వారా విరాళాలు ఇవ్వటం మొదలుపెట్టారు. మరి కొందరు ఒక అడుగు ముందుకేసి బాలికలకు ఫీజులు, పుస్తకాలకు- ట్యూషన్లకు అయ్యే వ్యయాన్ని భరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ సొసైటీలో 150 మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద ప్రతి ఏడాది వెయ్యి రూపాయల సభ్యత్వ రుసుము వసూలు చేస్తారు. ఈ రుసుముతో పాటుగా హుండీలు.. విరాళాలతో అనేక మంది బాలికలకు సాయం చేస్తున్నారు. మొదట్లో కేవలం ఇంటర్ వరకు చేరే బాలికలకే సాయం చేసేవారు. ఇప్పుడు డిగ్రీ చదివేవారికి కూడా సాయం చేస్తున్నారు.
ఎంపిక ఎలా..
‘‘అర్హులైన వారందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ సొసైటీని ప్రారంభించాం. అందుకోసం కొన్ని కట్టుదిట్టమైన నియమాలను ఏర్పాటు చేసుకున్నాం’’ అంటారు ఈ సొసైటీ ఛైర్ పర్సన్ వసుంధర. మంచి మార్కులతో ప్రభుత్వ కాలేజీలో సీటు తెచ్చుకొని.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారికి ఈ సొసైటీ సాయం చేస్తుంది. విద్యార్థినులు ఏ కులానికి చెందినవారు? ఏ మతానికి చెందినవారు? అనే పట్టింపులు ఏమి ఉండవు. అయితే సాయం పొందిన వారు కూడా మంచి పార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది. ఒక సారి ఫెయిల్ అయినా- ఈ సాయాన్ని అందించరు. ‘‘ సొసైటీ ఇచ్చిన ఆర్థిక సాయంతో నేను ఎంటెక్ పూర్తి చేశా. క్యాంపెస్ ఇంటర్వ్యూలో టీసీఎ్‌సలో ఉద్యోగం వచ్చింది.. డిగ్రీలో పాస్ కావటమే లక్ష్యం కాదు.. మంచి మార్కులతో ఇతరుల కన్నా ముందు ఉండాలని చదివేదాన్ని’’ అంటారు సంధ్య. ఈ సొసైటీకి విరాళాల రూపంలో వచ్చిన డబ్బంతా బ్యాంకుల్లో ఉంచుతారు. కాలేజీల ఫీజులను నేరుగా సొసైటీ నుంచి నేరుగా చెల్లిస్తారు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో సాయం పొందుతున్న విద్యార్థినులందరికీ ఒక వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ప్రతి రోజు గ్రూపు సభ్యులు సాధించిన విజయాలు.. ఇతర స్ఫూర్తి గాధలను షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా అనేక మంది విద్యార్థినులు ప్రేరణ పొందుతున్నారు. ఈ తరహా సొసైటీలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటైతే మరింత మందికి సాయం అందుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
మహమ్మద్ రఫి,
గుంతకల్లు
అర్హుల ఎంపికలో మా సొసైటీ నిబంధనలను తప్ప మరే ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోం. కుల, మతాలకు అతీతంగా బాలికలను ఎంపిక చేసి ఫీజులు చెల్లిస్తున్నాం. విద్యార్థినులు కూడా శ్రద్ధగా చదివి మాకు ఆత్మసంతృప్తిని కలిగిస్తున్నారు. రానున్న రోజుల్లో సొసైటీని మరింత విస్తృతపరుస్తాం.
- దేవరశెట్టి మాధవీలత,
సొసైటీ అధ్యక్షురాలు
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీలకు మోసం జరుగుతుంటే.. బీఆర్ఎస్ నుంచి నో రియాక్షన్: కవిత
For More AP News And Telugu News
Updated Date - Nov 27 , 2025 | 02:37 AM