Kavitha: బీసీలకు మోసం జరుగుతుంటే.. బీఆర్ఎస్ నుంచి నో రియాక్షన్: కవిత
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:10 PM
పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ పరిధిలో జనం బాట కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని కల్వకుంట్ల కవిత తెలిపారు. తనపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
హైదరాబాద్, నవంబర్ 26: అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేస్తే తప్పా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రావని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెలను గ్రామాల్లో కూల్చివేయాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత విలేకర్లతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల అంశంపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో..అన్ రిజర్వుడు స్థానాల్లో అన్ని చోట్లా నామినేషన్లు వేయాలని బీసీలకు ఆమె సూచించారు. 42 శాతం రిజర్వేషన్లలో ప్రధాన దోషి బీజేపీ అని ఆరోపించారు. బీసీలకు మోసం జరుగుతుంటే..ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ లేదని విమర్శించారు. ప్రతిపక్షం గురించి తాను మాట్లాడనని.. మాట్లాడితే బద్నాం చేస్తారన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటం చేసిందేమీ లేదని కుండ బద్దలు కొట్టారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సరిగ్గా జరగలేదన్నారు. అందుకే బీసీలకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగిందని తెలిపారు. మంత్రులు,ఎమ్మెల్యేల ప్రమేయంతోనే ఈ రిజర్వేషన్లు ఖరారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్లే చెబుతున్నారన్నారు. బీసీ జనాభాను కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేసి చూపిందని పేర్కొన్నారు. జిల్లాల వారీగా 5 శాతానికి పైగా బీసీ జనాభా తగ్గించి చూపించారని చెప్పారు.
21శాతం మాత్రమే బీసీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికలతో జనం బాట కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేశామని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ పరిధిలో జనం బాట కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తనపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కాలేదన్నారు.
ఏదైనా ఆరోపణలు చేస్తే.. అర్థం పర్థం ఉండాలని పేర్కొన్నారు. తాను ఎవరిపైనో ఆరోపణలు చేస్తే.. మహేశ్వరరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తన ఆరోపణలపై స్పందించి.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంచి ఒరవడికి శ్రీకారం చుట్టారని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆక్రమించిన భూమి తనకెందుకని ప్రశ్నించారు. ఆ భూమిని ప్రజలకు ఇస్తే సరిపోతుందని కవిత తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హార్ట్ ఎటాక్ బాధితులకు గవర్నమెంట్ గుడ్ న్యూస్..
వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదు: డిప్యూటీ సీఎం సీఎం పవన్ కల్యాణ్
For More TG News And Telugu News