Yogi Adityanath: ఈస్ట్ పాకిస్థాన్ శరణార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి
ABN, Publish Date - Jul 21 , 2025 | 05:36 PM
ఈస్ట్ పాకిస్థాన్ కు చెందిన వేలాది మంది 1960-1975 మధ్య కాలం నుంచి శరణార్ధులుగా యూపీలో పునరావాసం పొందుతున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. ఈ మేరకు వారికి ఓ శుభవార్త చెప్పారు.
నొయిడా: ఈస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి దశాబ్దాల కింద శరణార్ధులుగా వచ్చి స్ధిరపడిన వారికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) శుభవార్త చెప్పారు. వారికి భూ యాజమాన్య హక్కులు మంజూరు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం భూ బదలాయింపు కాదని, శరణార్ధి కుటుంబాల దశాబ్దాల పోరాటాన్ని గుర్తించేందుకు నైతిక, జాతీయ బాధ్యతతో తీసుకున్న నిర్ణయమని అభివర్ణించారు. రాష్ట్రంలోని పిలిభిత్, లఖింపూర్ ఖేరి, బిజ్నూర్, రాంపూర్ జిల్లాల్లో సుమారు 10,000 మంది బంగ్లా శరణార్ధులు ఉన్నారు.
1960 నుంచి ఎదురతెన్నులు
ఈస్ట్ పాకిస్థాన్ నుంచి 1960-1975 మధ్య కాలంలో వేలాది మంది శరణార్ధులుగా వచ్చి యూపీలో పునరావాసం పొందుతున్నట్టు ముఖ్యమంత్రి యోగి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ట్రాన్సిట్ శిబిరాలకు వారిని తరలించిన తర్వాత చాలామందికి వ్యవసాయ భూములను కేటాయించామని, అయితే చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు లీగల్ చిక్కులు, అసంపూర్తి పేపర్ వర్క్, నిర్వహణ లోపాలు అడ్డుపడుతున్నాయని వివరించారు.
కాగా, యాజమాన్య హక్కులను రెగ్యులరైజ్ చేసేందుకు అవసరమైన కొత్త లీగల్ మెకానిజం కనుగొనాలని అధికారులను సీఎం ఆదేశించారు. చిరకాలంగా స్థిరపడిన కుటుంబాల పేర్లను నిర్దిష్ట సమయంలోగా రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని జిల్లా మెజిస్ట్రేట్లకు సూచించారు. భూములు అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయ స్థలాలను చూపించి శరణార్దులు గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణాలు అరచేతులో పెట్టుకుని సొంతగడ్డను వదలిపెట్టి వచ్చిన శరణార్ధుల ఆరు దశాబ్దాల కలను నిజం చేయడం సామాజిక, నైతిక, జాతీయ బాధ్యతని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 21 , 2025 | 06:08 PM