Women in Indian Military: సిందూరానికి గౌరవంగా.. మహిళా శక్తిని చాటేలా..
ABN, Publish Date - May 08 , 2025 | 04:55 AM
పహల్గాం దాడికి గట్టి బదులిచ్చిన భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను మహిళా అధికారులు వెల్లడించడం ద్వారా పాక్‌కు స్పష్టమైన సందేశం పంపింది. వివిధ మతాల అధికారులు పాల్గొన్న దాడి వివరాల బ్రీఫింగ్ ద్వారా భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పింది.
‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను వెల్లడించిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్
సోఫియా ఖురేషీ.. వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
భారీ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులు వెల్లడించడం ఇదే తొలిసారి
అదే వేదికపై కశ్మీరీ పండిట్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
వ్యూహాత్మకంగా ప్రెస్‌మీట్
న్యూఢిల్లీ, మే 7: పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ గట్టిగా బదులు తీర్చుకోవడమే కాదు.. ఆ దాడి వివరాలను వెల్లడించిన తీరుతోనూ పాకిస్థాన్‌కు బలమైన సంకేతాలు పంపింది. ఇద్దరు మహిళా అధికారులు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను వెల్లడించారు. ఈ సమయంలో వారి వెంట విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఉన్నారు. బైసరన్‌లో ఉగ్రవాదులు పర్యాటకుల్లో పురుషులను వాళ్ల భార్యల కళ్లముందే దారుణంగా కాల్చేయడం.. తమనూ చంపేయాలని వారు బాధతో వేడుకుంటే.. ‘వెళ్లి మోదీకి చెప్పుకోండి’ అంటూ ఘాటుగా మాట్లాడిన విషయం తెలిసిందే. భారత్ చేసిన దాడి వివరాలనూ నాటి ఘటనకు దీటైన జవాబుఇచ్చే తరహాలోనే వెల్లడించడం గమనార్హం.
ఆ మహిళల త్యాగాలను గౌరవిస్తూ..
భారత్‌లో వివాహిత మహిళల సంప్రదాయానికి, మనోభావాలకు చిహ్నమైన సిందూరం పేరుతోనే.. దాడులకు ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరుపెట్టడం.. పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల త్యాగాన్ని గౌరవించడమేనని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. భారత్ చేసిన భారీ దాడులకు సంబంధించిన వివరాలను ఇలా మహిళా అధికారులు వెల్లడించడం ఇదే తొలిసారి.
ఉగ్రవాదుల ‘మత’వాదాన్ని తిప్పికొడుతూ..
బైసరన్‌లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చిచంపడాన్ని ఎత్తిచూపుతూ, భారత్‌లో ఐక్యతను చాటి చెప్పేలా కూడా ‘ఆపరేషన్ సిందూర్’ ప్రెస్‌మీట్ ఉందన్న విశ్లేషణలూ వెలువడుతున్నాయి. భారత దాడుల వివరాలను వెల్లడించిన సోఫియా ఖురేషీ ముస్లిం వర్గానికి, వ్యోమికా సింగ్ సిక్కువర్గానికి చెందినవారుకాగా.. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హిందూ కశ్మీరీ పండిట్ కావడం గమనార్హం.
ఎవరీ సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్?
గుజరాత్‌లోని వడోదరకు చెందిన సోఫియా ఖురేషీది వారసత్వంగా మిలటరీ కుటుంబమే. ఆమె తాత, తండ్రి మిలటరీలో వివిధ విభాగాల్లో పనిచేశారు. భర్త కూడా ఆర్మీ అధికారే. 1981లో జన్మించిన సోఫియా ఖురేషీ బయోకెమిస్ట్రీలో పీజీ చేసినా.. సైన్యంపై మక్కువతో 1999లో చెన్నైలోని ఆఫీసర్స్ టైనింగ్ అకాడమీలో చేరా రు. శిక్షణ అనంతరం సైన్యంలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2006 నుంచి ఆరేళ్లపాటు కాంగో, ఇతర దేశాల్లో ఐక్యరాజ్యసమితి శాంతిదళంలో భారత్ తరఫున పనిచేశారు. 2016లో 18 దేశాల సైనిక కవాతులో భారత ఆర్మీ కంటింజెంట్‌కు నేతృత్వం వహించారు. ఇలా భారత్ తరఫున మహిళా అధికారి నేతృత్వం వహించడం అదే తొలిసారి కావడం గమనార్హం.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్‌గా పనిచేస్తున్నారు. స్కూల్ స్థాయిలోనే ఎన్‌సీసీలో చురుకుగా పనిచేశారు. తన పేరుకు తగినట్టుగా ఆకాశంలో విహరించేలా పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2004 వాయుసేనలో చేరారు. 2017లో వింగ్ కమాండర్‌గా పదోన్నతి పొందారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో ఎత్తయిన కొండలు, పర్వత ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చేతక్, చీటా హెలికాప్టర్లను సమర్థంగానడిపారు. 2020 నవంబరులో అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌కు నేతృత్వం వహించి మన్ననలు పొందారు. 2,500 గంటలకుపైగా హెలికాప్టర్ నడిపిన అనుభవం ఆమె సొంతం. ఆమె భర్త కూడా వైమానిక దళంలో పైలట్‌గా పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 05:48 AM