Share News

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

ABN , Publish Date - May 07 , 2025 | 04:42 PM

ఆపరేషన్ సిందూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో చాలా కీలకమైన దాడి అని చెప్పవచ్చు. ఈ దాడులు జైష్ ఏ మొహమ్మద్ సంస్థకు గట్టి షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలో దీని ప్రధాన కార్యాలయాన్ని భారత సైన్యం చిత్తుచిత్తుగా కూల్చేసింది. అయితే ఈ దాడికి ముందు ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor

భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో ఖచ్చితమైన దాడులు చేసి, ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మొహమ్మద్ (JM) ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. ఈ దాడులు భారతదేశం ఉగ్రవాదంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టం చేశాయి.


దాడికి ముందు

ఆపరేషన్ సిందూర్‎కు ముందు, జైష్ ఏ మొహమ్మద్ సంస్థ పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో వారి ప్రధాన కార్యాలయం ‘మర్కజ్ సుభాన్ అల్లాహ్’ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కేంద్రం భారత్‌పై అనేక దాడులకు కీలక స్థావరంగా పనిచేసింది. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి, ఇక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదుల చేతిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంస్థ మసూద్ అజార్ నాయకత్వంలో గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో ఉగ్రవాద దాడులకు కారణమైంది. అయితే తాజా దాడుల తర్వాత ఆ కార్యాలయం అస్తవ్యస్తంగా తయారైంది. దీంతోపాటు దాడికి ముందు అందులో ఉన్న ఉగ్రవాదులు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.


ఉగ్రవాదులకు కేంద్రంగా..

బహవల్‌పూర్, పాకిస్తాన్‌లోని 12వ అతిపెద్ద నగరం, జెఎమ్ కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాల సరఫరా దాడుల ప్రణాళికలు జరిగేవి. ఈ కార్యాలయంలో అనేక భవనాలు, శిక్షణా మైదానాలు, ఆయుధ గిడ్డంగులతో సమగ్రంగా నిర్మించబడింది. ఈ స్థావరం ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయంగా ఉంది. ఎందుకంటే ఇది పాకిస్తాన్ లోపల ఉండటం విశేషం. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి ఈ ఆపరేషన్‌కు నాంది పలికింది.


దాడి సమయంలో

బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK), పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేశాయి. ఈ దాడులు కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ సైనిక సౌకర్యాలను ఏమాత్రం దెబ్బతీయలేదు. ఇది భారత్ చేపట్టిన దాడి విధానాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ దాడికి ముందు, దాడి తర్వాత జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో ఓ బీజేపీ నేత పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడులు జెఏమ్ సంస్థకు గట్టి షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..

Read More Business News and Latest Telugu News

Updated Date - May 07 , 2025 | 06:23 PM