Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
ABN , Publish Date - May 07 , 2025 | 03:02 PM
ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ కీలక నిర్ణయమని అనేక మంది సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రీడాలోకం నుంచి సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, హర్భజన్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

భారత సాయుధ బలగాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు జరిపాయి. ఈ దాడులు రెండు వారాల క్రితం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా జరిగాయి. ఈ దాడుల్లో 70 మందికిపైగా ఉగ్రవాదులు మరణించగా, మరో 60 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఎటాక్ నేపథ్యంలో భారత ప్రజలతోపాటు రాజకీయ ప్రముఖులు సహా అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ భారత మాజీ క్రీడాకారులు కూడా స్పందించారు.
ఈ ఘటనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా పలువురు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ ఆపరేషన్ సిందూర్‌ను సమర్థిస్తూ కీలక పోస్ట్ చేశారు. ఐక్యతలో నిర్భయంగా, బలంలో అనంతంగా, భారతదేశ రక్షణ కవచం ప్రజలని ప్రస్తావించారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని, మనమంతా ఒకే జట్టని, జై హింద్ అంటూ పేర్కొన్నారు. ఈ సందేశం దేశ ప్రజలను ఒక తాటిపైకి తీసుకొచ్చేలా, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన్నించరాదనే ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
సచిన్ మాత్రమే కాదు, ఇతర క్రికెట్ దిగ్గజాలు కూడా ఆపరేషన్ సిందూర్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సచిన్ మాజీ సహచరుడు వీరేందర్ సెహ్వాగ్, ఈ ఆపరేషన్ గురించి సరికొత్తగా చెప్పారు. ఎవరైనా మీ మీద రాళ్లు విసిరితే, వారి మీద పువ్వులు విసరండి. కానీ కుండీతో పాటు వేయాలని, జై హింద్ అంటూ వెల్లడించారు. సెహ్వాగ్ ఈ ఆపరేషన్‌కు మద్దతు ఇస్తూ భారతదేశం ధైర్యసాహసాలను హాస్యాస్పదంగా ప్రశంసించాడు.
అలాగే, భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఈ ఆపరేషన్‌పై ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. జై హింద్ #OperationSindoor అనేది పహల్గామ్‌లో మన అమాయక సోదరుల హత్యకు భారత్ సమాధానం అని చెప్పుకొచ్చారు. దీంతోపాటు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఎక్స్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం మంచి నిర్ణయం తీసుకుందని, భారతమాత వర్ధిల్లాలని పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో కీలకమైన నిర్ణయమని చెప్పవచ్చు. ఇది దేశం భద్రతను కాపాడటానికి, ఉగ్రవాదాన్ని ఏ విధంగా సహించబోమని భారత్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఈ ఆపరేషన్ ద్వారా, భారత సైన్యం తన సామర్థ్యాన్ని, దేశ భద్రతను కాపాడటంలో తన నిబద్ధతను మరోసారి చాటి చెప్పింది.
ఇవి కూడా చదవండి:
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Read More Business News and Latest Telugu News