ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mock Drill: యుద్ధ సన్నద్ధతకుసైరన్‌

ABN, Publish Date - May 07 , 2025 | 05:07 AM

కేంద్ర హోం శాఖ ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ డ్రిల్స్‌ ప్రజలకు యుద్ధ సమయంలో ఎలా ప్రవర్తించాలో నేర్పించడానికి నిర్వహించబడుతున్నాయి.

  • కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహణకు రంగం సిద్ధం

  • తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖ, బాపట్లలో!

  • ఎయిర్‌ రైడ్‌ సైరన్లు, క్రాష్‌ బ్లాకవుట్లు, పౌర శిక్షణ,తరలింపు చర్యలతో.. ప్రజల్లో అవగాహన పెంపు

  • యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలో నేర్పే ప్రక్రియ

  • 1971 తర్వాత మాక్‌ డ్రిల్‌ నిర్వహించడం ఇదే!

న్యూఢిల్లీ, మే 6: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. కేంద్ర ఆదేశాల మేరకు బుధవారం దేశవ్యాప్తంగా పౌరుల భద్రత సన్నద్ధతను పరీక్షించే మాక్‌డ్రిల్స్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. యుద్ధమంటూ మొదలైతే.. 33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో.. దాడులకు గురయ్యే ప్రమాదం ఉన్న 244 జిల్లాల్లోని అత్యంత సున్నితమైన 259 ప్రాంతాల్లో వీటిని నిర్వహించనున్నారు. వాటిలో.. తెలంగాణలో హైదరాబాద్‌, ఏపీలో విశాఖ, బాపట్ల ఉన్నాయి. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో.. ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహణకు సంబంధించి మంగళవారం అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. అత్యంత కీలకస్థానాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఈ భేటీలో పాల్గొని చర్చించారు. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగేటప్పుడు దేశంలో ఇలాగే మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. మళ్లీ 50 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు అలాంటి కసరత్తే జరగనుంది. ఇంతకీ ఏమిటీ మాక్‌ డ్రిల్‌? ప్రభుత్వం వీటిని ఎందుకు నిర్వహిస్తోంది? అందులో పౌరుల పాత్ర ఏమిటి? అంటే.. యుద్ధ సమయంలో ప్రజలు, రక్షణ, విపత్తు స్పందన, ప్రభుత్వ సిబ్బంది ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడం ఇలా మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తారు. అందులో భాగంగా పలు చర్యలు చేపడతారు. అవేంటంటే..

  • ఎయిర్‌ రైడ్‌ సైరన్లు: వైమానిక దాడులు జరిగే ప్రమాదం ఉన్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే సైరన్లు. ఆ సైరన్‌ మోగిందంటే ముప్పు ముంచుకొస్తున్నట్టే. ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలి. ఇంట్లోనే ఉండాలి.

  • క్రాష్‌ బ్లాకవుట్స్‌: యుద్ధ సమయాల్లో రాత్రి వేళల్లో వైమానిక దాడులు జరగకుండా.. విద్యుద్దీపాలన్నీ ఆర్పేసి కారుచీకట్లు కమ్ముకునేలా చేయడం. 1971లో జరిగిన బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధంలో ఈ వ్యూహాన్ని విస్తృతంగా వినియోగించారు.


  • కేమోఫ్లేజ్‌ మెజర్స్‌: పాకిస్థాన్‌తో 1971లో యుద్ధం జరిగిన సమయంలో.. శత్రువుల విమానాలు మన తాజ్‌మహల్‌పై దాడులు చేయకుండా దాన్ని జనపనార తాళ్లతో కప్పి ఉంచారు. అలా కీలక, చారిత్రక కట్టడాలను, సైనిక కేంద్రాలు, సమాచార టవర్లు, విద్యుత్‌ కేంద్రాల వంటివాటిని శత్రువుల కంటపడకుండా చేసి, వాటిని కాపాడుకునే ప్రక్రియ ఇది.

  • తరలింపు చర్యలు: ఇది అందరికీ తెలిసిందే. వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా.. యుద్ధ సమయంలో పౌరులను హైరిస్క్‌ జోన్ల నుంచి సేఫ్‌ జోన్లకు తరలిస్తారు.

  • పౌర శిక్షణ: యుద్ధ సమయాల్లో ఎలా ప్రవర్తించాలో పౌరులకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం పాఠశాలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో వర్క్‌షా్‌పలు నిర్వహిస్తారు. వారు ఉన్న చోట దాడి జరిగినప్పుడు తలభాగాన్ని ఎలా కాపాడుకుంటూ నేలపై కూర్చుండిపోవాలి, సమీపంలోని ప్రభుత్వ షెల్టర్లను ఎలా గుర్తించాలి?, ప్రాథమిక చికిత్స ఎలా చేయాలి? ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఒత్తిడికి, భయాందోళనలకు గురికాకుండా ఎలా ఉండాలి వంటి అంశాలను ఆ వర్క్‌షాపుల్లో బోధిస్తారు.


ఇలా మాక్‌ డ్రిల్‌ నిర్వహించడం వల్ల.. నిజంగా యుద్ధం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో, ప్రాణాలు కాపాడుకోవాలో ప్రజలకు తెలుస్తుంది. ఈ శిక్షణతో గందరగోళానికి గురి కాకుండా, క్రమశిక్షణతో మెలగడం అలవడుతుంది. అదే సమయంలో అటు ప్రభుత్వ విభాగాలకు కూడా ఎక్కడెక్కడ ఏయే లోపాలున్నాయో తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే వీలు కలుగుతుంది. ఎయిర్‌ రైడ్‌ వార్నింగ్‌ సిస్టమ్స్‌ (శత్రు దాడుల గురించి హెచ్చరించే వ్యవస్థలు) ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయి? కంట్రోల్‌ రూములు, షాడో కంట్రోల్‌ రూముల పనితీరు ఎలా ఉంది? వంటి అంశాలపై ఒక స్పష్టత వస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ‘సివిల్‌ డిఫెన్స్‌ రూల్స్‌, 1968’ ప్రకారం ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహణకు ఆదేశాలు జారీచేసింది. బుధవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. తాము గమనించిన లోపాలు, వాటిని సరిదిద్దుకోవడానికి అవసరమైన సూచనలు, సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి ‘యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు’లు సమర్పిస్తాయి.

కొన్నిచోట్ల మంగళవారమే..

దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో బుధవారం మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్రం ఆదేశించగా.. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రాష్ట్రాలు మంగళవారమే ఆ ప్రక్రియ చేపట్టి పౌరులను అప్రమత్తం చేశాయి. ఉదాహరణకు.. పంజాబ్‌లో ఇండో-పాక్‌ సరిహద్దుకు అత్యంత సమీపంగా ఉండే ఫిరోజ్‌పూర్‌ కంటోన్మెంట్‌లో ఆదివారం సాయంత్రమే 30 నిమిషాల బ్లాకవుట్‌ డ్రిల్‌ (విద్యుద్దీపాల ఆర్పివేత) నిర్వహించారు. మాక్‌ డ్రిల్‌ సమయంలో అధికారులకు ప్రజల సహకారం తప్పనిసరిగా ఉండాలి. అధికారుల సూచనలను తూచాతప్పకుండా పాటించాలి. వదంతులను నమ్మకూడదు. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి.


మోదీతో దోభాల్‌ భేటీ

పహల్గాం ఉగ్రదాడికి గట్టిగా బదులివ్వాలని భారత్‌ భావిస్తున్న తరుణంలో కీలక సమావేశాలు, చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య భేటీ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కాగా, మోదీ ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశమయ్యారు.

ఆ 244 జిల్లాలే ఎందుకు?

దేశభద్రతకు సంబంధించి వ్యూహాత్మక ప్రాముఖ్యం ఉన్న జిల్లాలు, దాడుల ప్రమాదం ఎక్కువగా ఉండే జిల్లాలను ‘సివిల్‌ డిఫెన్స్‌ జిల్లా’లుగా వ్యవహరిస్తారు. అందులో రకరకాల కేటగిరీలు ఉంటాయి.

అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరగా ఉండే జిల్లాలు: పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో ఇండో-పాక్‌ సరిహద్దులకు దగ్గరగా ఉండే జిల్లాలు.

కీలక వ్యవస్థలు ఉండే జిల్లాలు: సైనిక స్థావరాలు, విద్యుత్‌ గ్రిడ్లు, జలవిద్యుత్‌ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఓడరేవులు, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు ఉండే జిల్లాలు.

జనసాంద్రత ఎక్కువగా ఉండే పట్టణాలు: జనసాంద్రత ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాలను శత్రుదేశాలు లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఈ జాబితాలో చేరుస్తారు. జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆయా ప్రాంతాల్లో తరలింపు ప్రక్రియలు కొంత సంక్లిష్టంగా ఉంటాయి. కాబట్టి ఆమేరుకు ముందుజాగ్రత్తచర్యలు తీసుకుంటారు.

తీరప్రాంత జిల్లాలు: శత్రుదేశాల నౌకాదళ దాడుల ముప్పు అధికంగా ఉండే తీర ప్రాంతాలను కూడా ఈ జాబితాలో చేర్చారు.

ఈ నాలుగు రకాల ప్రాంతాలనూ సివిల్‌ డిఫెన్స్‌ జిల్లాలుగా ప్రకటించిన ప్రభుత్వం యుద్ధసమయాల్లో ఆయా జిల్లాల్లో యుద్ధసన్నద్ధతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

Updated Date - May 07 , 2025 | 06:03 AM