Vijay: 234 నియోజకవర్గాల్లో విజయ్ సేన సర్వే
ABN, Publish Date - Apr 16 , 2025 | 11:34 AM
అగ్రహీరో విజయ్ స్థాపించి తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది దీనిలో భాగంగా పార్టీ విజయావకాశాలపై ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసి గెలిచి అధికారం చేపట్టాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
- డీఎంకే పాలనలో లోపాలేంటి?
- తమ అధినేతపై విశ్వాసానికి కారణాలు?
- ఇంటింటి సర్వే చేస్తున్న టీవీకే మహిళా నేతలు
చెన్నై: అగ్రహీరో విజయ్(Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం విజయావకాశాలు, మా పార్టీ అధినేతపై నమ్మకం ఎంత, డీఎంకే పాలనలో లోటుపాట్లు తదితర అంశాలపై టీవీకే మహిళా నేతలు ఇంటింటి సర్వేలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఈ సర్వే చేస్తున్నారు. ఇందుకోసం టీవీకే ప్రధాన కార్యాలయం ముద్రించిన ప్రత్యేక ఫారంలోని వివరాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలను సేకరిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ
గత 50 యేళ్ళ ద్రవిడ పార్టీల పాలనలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలు? ఏం జరగలేదు? ఈ ద్రావిడ పాలన మీకు నచ్చిందా? నచ్చలేదా? ఒక వేళ నచ్చితే మీకు నచ్చిన అంశాలు ఏంటి? దానికి కారణం ఏంటి? నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు? వంటి ప్రశ్నలకు సమాధానాలు అడుగుతున్నారు. అదేవిధంగా హీరో విజయ్(Hero Vijay) రాజకీయాల్లోకి రావడాన్ని మీరు స్వాగతిస్తారా? లేదా?, విజయ్‌ను ఆదరిస్తూ ఓటు వేస్తారా? రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడికి ఇష్టపడుతున్నారా? వంటి ప్రశ్నలు వేస్తున్నారు.
అలాగే, ఆ కుటుంబంలో ఎంతమందికి ఓటు హక్కు ఉంది? మొబైల్ నంబరు తదితర వివరాలను కూడా సేకరిస్తున్నారు. వివరాలను సేకరించి వెళ్ళే ఆ ఇంటి గుమ్మానికి విజయ్ బొమ్మ స్టిక్కర్ అంటిస్తున్నారు. ఈ తరహా సర్వే 234 నియోజకవర్గాల్లోని 68,320 పోలింగ్ బూత్ పరిధిలో నిర్వహించి, పూర్తి వివరాలను ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి అందజేయనున్నారు.
ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో విజయ్ సొంతంగా పోటీ చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు అన్నాడీఎంకే - బీజేపీ కూటమి ఎన్నికల్లో పోటీ చేయనుంది. అధికార డీఎంకే తన భాగస్వామ్య పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ సారథ్యంలోని టీవీకే రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై సర్వే చేయిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..
Read Latest Telangana News and National News
Updated Date - Apr 16 , 2025 | 11:34 AM