US Tariff Threat: ఫార్మాకూ సుంకాల ముప్పు
ABN, Publish Date - Aug 10 , 2025 | 02:32 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలతో భారత ఎగుమతి రంగాలు
ప్రస్తుతానికి మినహాయింపు..
భవిష్యత్‌లో వడ్డింపు తప్పదని ట్రంప్ హెచ్చరిక
మన ఔషధ ఎగుమతుల్లో 40ు అమెరికాకే..
టారి్‌ఫలతో ఫార్మా కంపెనీల ఆదాయం 10% వరకు తగ్గే అవకాశం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50ు సుంకాలతో భారత ఎగుమతి రంగాలు బెంబేలెత్తిపోతున్నా యి. అయితే, అమెరికాలో చవకగా ఔషధాలు లభించడంలో కీలకపాత్ర పోషిస్తున్న భారత ఫార్మా రంగానికి మాత్రం సుంకాల నుంచి మినహాయించారు. ఫార్మా సహా పలు రంగాలకు ఇచ్చిన మినహాయింపుపై సమీక్ష జరుగుతోందని, అవసరమైతే వీటినీ సుంకాల పరిధిలో చేరుస్తామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. పైగా, ఫార్మాపై సుంకాలను వచ్చే 18 నెలల్లో 250 శాతానికి పెంచుతామని హెచ్చరించారు. ప్రస్తుతానికి ఊరట లభించినప్పటికీ, భవిష్యత్‌లో అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ఎలా ఉండనుందోనని మన ఫార్మా రంగం, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఔషధ తయారీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది.
జెనరిక్ ఔషధాల్లో 35 శాతం మనవే..
ఒకవేళ ట్రంప్ ఔషధాలనూ సుంకాల పరిధిలోకి తెస్తే, మన ఫార్మా పరిశ్రమ కూడా 50 శాతం సుంకం చెల్లించేందుకు సిద్ధమవ్వాల్సిందే. ఇదే గనుక జరిగితే, మన ఔషధ కంపెనీల ఆదాయం 5-10 శాతం మేర తగ్గే ప్రమాదం ఉందని ఎస్‌బీఐ తాజా నివేదిక అంచనా వేసింది. ఎందుకంటే, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్. ఆ దేశానికి అత్యధికంగా (35 శాతం) జెనరిక్ ఔషధాలు సరఫరా చేసేది మనమే. గత ఆర్థిక సంవత్సరంలో మన ఫార్మా మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటాయే దాదాపు 40 శాతం. ముఖ్యంగా పెద్ద కంపెనీల ఆదాయంలో అమెరికాకు ఎగుమతుల ద్వారా సమకూరే వాటా 40-50 శాతం వరకు ఉంది. సుంకాల భారాన్ని కస్టమర్ల పైకి బదిలీ చేయలేక మన ఔషధ సంస్థల పోటీ సామర్థ్యం తగ్గిపోతుందని, దాంతో ఆదాయాలతో పాటు లాభదాయకతకూ గండిపడే అవకాశం కనిపిస్తోంది.
అమెరికా వినియోగదారులకే నష్టం: ఫార్మెక్సిల్
భారత ఫార్మాపై సుంకాలు విధిస్తే, అమెరికాకే నష్టమని ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషీ అన్నారు. దీంతో అమెరికా కస్టమర్లు ఔషధాల కోసం అధికంగా చెల్లించాల్సి వస్తుందన్నారు. మన జెనరిక్ ఔషధ తయారీ కంపెనీలు అతి స్వల్ప మార్జిన్లతో వ్యాపారం చేస్తాయని, సుంకాల భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. స్వదేశంలోనే ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడి ఆలోచన ఇప్పటికిప్పుడు సాకారమయ్యేది కాదని, కనీసం 3-5 ఏళ్ల సమయం పడుతుందన్నారు.
హైదరాబాద్ ఫార్మాపై అధిక ప్రభావం
డాక్టర్ రెడ్డీస్, దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా, హెటిరో, ఎంఎ్‌సఎన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా సహా 800కు పైగా కంపెనీలకు నెలవైన హైదరాబాద్ ఫార్మా పరిశ్రమపై సుంకాలు అధిక ప్రభావం చూపనున్నాయి. అమెరికాకు అత్యధికంగా ఔషధాలు ఎగుమతి చేస్తున్న కంపెనీల్లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్, అరబిందో, నాట్కో సహా మరికొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల ఆదాయాల్లో 40 శాతం వరకు ఒక్క అమెరికా నుంచే వస్తుండటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత్ నుంచి ఔషధ ఎగుమతులు 9 శాతం వృద్ధి చెందిన 3,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.2.5 లక్షల కోట్లు) దాటాయి. అందులో తెలుగు రాష్ట్రాల వాటా 30 శాతం పైమాటే.
Updated Date - Aug 10 , 2025 | 02:32 AM