Kashmir Terror Attack: ప్రశాంత కశ్మీరంలో మళ్లీ ఉగ్ర కలకలం
ABN, Publish Date - Apr 23 , 2025 | 03:49 AM
జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఘటనతో ఉగ్రవాదం మళ్లీ కలకలం రేపింది. పర్యాటక రంగం పునరుద్ధరణలో ఉన్న సమయంలో, ఉగ్రవాదుల దాడులతో భద్రతపై ప్రశ్నలు కలుగుతున్నాయి.
జమ్మూకశ్మీర్, ఏప్రిల్ 22: జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉంటూ.. కశ్మీరీలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో.. పహల్గాం ఘటన మళ్లీ ఉగ్ర కలకలాన్ని రేపింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎ్‌సఐ ప్రేరేపిత లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రమూకలకు అడ్డాలుగా ఉన్న ప్రాంతాలు క్రమంగా శాంతి నెలకొంటున్న క్రమంలో.. మరోమారు కల్లోలం రేగింది. ఇప్పుడిప్పుడే పర్యాటకం జోరందుకుంటున్న దశలో.. ఉగ్రవాదుల దాడితో పర్యాటకుల భద్రత మళ్లీ ప్రశ్నార్థకంలో పడుతోంది.
బాలీవుడ్ గీతాలకు నెలవు
‘‘యే చాంద్ స రోషన్ చహరా.. జుల్ఫోంకీ రంగ్ సునెహరా..’’ అంటూ 1980ల వరకు బాలీవుడ్ పాటలకు కేరా్‌ఫగా కశ్మీర్ లోయలోని అందమైన సరస్సులు.. హిమనీనదాలు నిలిచాయి. ఆ తర్వాతి కాలంలో ఉగ్రమూకలు కశ్మీరీ పండిట్ల ఊచకోతలతో అట్టుడికించారు. అడపాదడపా అమర్నాథ్ యాత్రికులను, జవాన్లను టార్గెట్‌గా చేసుకుని, దాడులు చేస్తున్నారు. 2016 సెప్టెంబరు 18న ఉడీలోని సైనిక శిబిరంపై దాడిలో 17 మంది జవాన్లు.. 2019 ఫిబ్రవరి 14న జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన మానవబాంబు దాడిలో 44 మంది దుర్మరణంపాలయ్యారు. ఆ తర్వాత అతిపెద్ద ఉగ్రదాడి మంగళవారం నాటిదే..!
ప్రశాంతత నెలకొంటుండగా..
2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేశాక.. జమ్మూకశ్మీర్ రెండుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత కశ్మీరీ పండిట్లు క్రమంగా తమ స్వస్థలాలకు రావడం ప్రారంభించారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తై.. మళ్లీ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పాటై, ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడితో మరోమారు కలకలం రేగుతోంది.
ఇవి కూడా చదవండి
జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..
Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..
Updated Date - Apr 23 , 2025 | 03:49 AM