Technical Glitches Disrupt: ప్రయాణికులకు ఎయిరిండియా పరీక్ష!
ABN, Publish Date - Aug 05 , 2025 | 04:00 AM
రెండు ఎయిరిండియా విమానాలు సోమవారం ఒకేరోజు సాంకేతిక సమస్యతో ప్రయాణికులను ఇక్కట్లకు గురిచేసింది.
ఒకేరోజు 2విమానాల్లో సాంకేతిక లోపం
బెంగళూరు, గన్నవరం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రెండు ఎయిరిండియా విమానాలు సోమవారం ఒకేరోజు సాంకేతిక సమస్యతో ప్రయాణికులను ఇక్కట్లకు గురిచేసింది. వీటిలో ఒకటి బెంగళూరు నుంచి కోల్‌కతాకు బయలుదేరి, గమ్యం చేరకుండానే వెనుదిరిగింది. ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరాల్సిన మరో విమానంలో సాంకేతిక సమస్యతో నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. వివరాలివీ.. బెంగళూరు నుంచి ఎయిరిండియా విమానం(1ఎక్స్ 2718) ఆదివారం రాత్రి 7.05 గంటలకు కోల్‌కతాకు బయల్దేరాల్సి ఉంది. కానీ 11 నిమిషాలు ఆలస్యంగా 7.16 గంటలకు టేకాఫ్ అయ్యింది. ఆకాశంలోకి వెళ్లిన కాసేపటికే విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు పైలట్‌లు గుర్తించారు. కోల్‌కతాకు వెళ్లేందుకు సమయం పడుతుందని భావించి వెంటనే వెనుదిరిగారు. ముందు జాగ్రత్త చర్యగా, విమానంలో ఇంధనం బరువు తగ్గించేందుకు రాత్రి 9.19 గంటల వరకు ఆకాశంలోనే చక్కర్లు కొట్టించారు. అనంతరం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అలాగే, ఢిల్లీ-విజయవాడ ఎయిరిండియా విమానం ప్రతి రోజూ ఢిల్లీలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి 12.40కి ఢిల్లీ వెళుతుంది. ఈ క్రమంలో సోమవారం గన్నవరానికి బయలుదేరగా.. టేకాఫ్ సమయంలో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి మళ్లీ రన్‌వే మీదకు తీసుకువచ్చారు. అందులో 155 మంది ప్రయాణికులున్నారు. సాంకేతిక సమస్యను సరి చేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు గన్నవరం చేరుకుంది. తిరిగి 4.48కి 103 మంది ప్రయాణికులతో ఢిల్లీ వెళ్లింది. మరో 32 మంది ప్రయాణికులు టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 05 , 2025 | 04:00 AM