Bihar Voter List: ఆ 65 లక్షల మంది పేర్లను వెబ్‌సైట్‌లో పెట్టండి.. ఎలక్షన్ కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
ABN, Publish Date - Aug 14 , 2025 | 04:31 PM
బిహార్ ఓటర్ జాబితా నుంచి ఏకంగా 65 లక్షల మందిని తొలగించినట్టు బయటకు రావడం సంచలనాలకు కారణమవుతోంది. ఈ అంశంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లను విచారించిన సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ: బిహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) పేరుతో ఎలక్షన్ కమిషన్ (Election Commission) చేస్తున్న హడావిడి తీవ్ర వివాదానికి కారణమవుతోంది. ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉన్న తరుణంలో ఈసీ ఇలా ఓటర్ జాబితాను (Bihar Voter List) సవరించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ జాబితా నుంచి ఏకంగా 65 లక్షల మందిని తొలగించినట్టు బయటకు రావడం సంచలనాలకు కారణమవుతోంది. ఈ అంశంపై పలువురు సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లను విచారించిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
బిహార్ ఓటర్ జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని, వారి పేర్లను తొలగించడానికి గల కారణాలను కూడా అప్‌లోడ్ చేయాలని సూచించింది. ప్రతి ఓటరు దానిని యాక్సెస్ చేయగలిగేలా ఈ జాబితాను ప్రచారం చేయాలని సూచించింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న బిహార్‌లో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ విచారించారు. జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించారని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.
22 లక్షల మంది మరణించినట్లయితే, దానిని బూత్ స్థాయిలో ఎందుకు వెల్లడించలేదని, పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 65 లక్షల మంది పేర్లను, వారిని తొలగించడానికి గల కారణాన్ని ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించారు. ఆ విషయాన్ని గరిష్ఠ సర్క్యులేషన్ ఉన్న స్థానిక భాషా వార్తాపత్రికలు, దూరదర్శన్, ఇతర ఛానెళ్ల ద్వారా ప్రచారం కల్పించాలని సూచించింది.
జిల్లా ఎన్నికల అధికారికి సోషల్ మీడియా హ్యాండిల్ ఉంటే, అక్కడ కూడా నోటీసును ప్రదర్శించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ జాబితాలో పేరు ఉన్న వ్యక్తులు తమ పేరును ఎందుకు తొలగించకూడదో పేర్కొంటూ తమ ఆధారాలను జిరాక్స్ కాపీలతో సహా సమర్పించుకోవడానికి అవకాశాలు కల్పించాలని పేర్కొంది. ఓటర్ జాబితా నుంచి తొలగించిన పేర్లను అన్ని పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్‌మెంట్, పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుపైనా ప్రదర్శించాలని, తద్వారా ప్రజలు జాబితాను మాన్యువల్‌గా యాక్సెస్ చేసుకునే వీలుంటుందని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాచైల్ మాతా యాత్ర మార్గంలో ఘోరం.. 12 మంది మృతి
ఏపీలో అమానుషం.. గర్భిణిని దారుణంగా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 14 , 2025 | 05:38 PM