Share News

Massive Cloudburst: మాచైల్ మాతా యాత్ర మార్గంలో ఘోరం.. 46 మంది మృతి

ABN , Publish Date - Aug 14 , 2025 | 02:40 PM

జమ్మూకాశ్మీర్‌లోని కిష్టావర్‌లో గురువారం మేఘ విస్పోటనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. ఆ క్రమంలో 46 మంది మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

Massive Cloudburst: మాచైల్ మాతా యాత్ర మార్గంలో ఘోరం.. 46 మంది మృతి

శ్రీనగర్, ఆగస్ట్ 14: జమ్మూకాశ్మీర్‌ కిష్టావర్‌ జిల్లా పద్దార్ సబ్ డివిజన్ పరిధిలోని చిషోటీ గ్రామ పరిసర ప్రాంతంలో గురువారం మేఘ విస్ఫోటనం సంభవించింది. ఈ కారణంగా సంభవించిన మెరుపు వరదలతో 46 మంది మరణించారు. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాచైల్ మాతా యాత్ర మార్గంలో ఈ గ్రామం ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇక క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి జిల్లా యంత్రాంగం తరలించింది. మరో 70 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మేఘ విస్పోటనం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్, సీఎంలతో కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు.


అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అయితే ఈ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కిష్టావర్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.


ఈ ఘటనపై జమ్మూకాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. భారీ వరద కారణంగా 12 మంది మరణించడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే సహాయక చర్యలు తీసుకోవాలంటూ పౌర, పోలీస్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులకు గవర్నర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.


ఇంకోవైపు దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లో ఎడతెరపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు అంటే గురువారం ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక హిమాచల్ ప్రదేశ్‌ అంతటా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకూ 241మంది మరణించారని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వారంతా.. వర్షాధార విపత్తులతోనే మరణించారని వివరించింది.


ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 09:05 PM