S Jaishankar: ట్రంప్ టారిఫ్ బెదిరింపుల వేళ.. మాస్కోకు జైశంకర్
ABN, Publish Date - Aug 13 , 2025 | 06:32 PM
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన ఖరారైంది. ఈనెల 20-21 తేదీల్లో ఆయన మాస్కోలో పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంగా భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకం విధించిన క్రమంలో కీలక పర్యటన చోటుచేసుకోనుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) మాస్కో పర్యటన ఖరారైంది. ఈనెల 20-21 తేదీల్లో ఆయన మాస్కోలో పర్యటించనున్నారు. భారత్-రష్యా సంబంధాలు, పరస్పర సహకారంపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ (Segey Lavrov)తో జైశంకర్ చర్చలు జరుపనున్నారు.
జైశంకర్, సెర్గీ లావ్‌రోవ్‌లు జూలై 15న జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైనప్పుడు కూడా ఇరువురూ చర్చలు జరిపారు. కాగా, భారత ప్రధాని మోదీ ఇటీవల ఫోన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక, దైపాక్షిక సంబంధాలపై ఉభయులూ చర్చించినట్టు అధికారిక ప్రకటనల్లో వారు తెలిపారు. ఈ ఏడాది చివర్లో భారత పర్యటనకు వచ్చే పుతిన్‌కు అతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నట్టు కూడా ప్రధాని పేర్కొన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేయాలని, లేకుంటే ప్రస్తుతం విధిస్తున్న 25 శాతం సుంకాలను 24 గంటల్లోనే మరింత పెంచుతామని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలను రష్యా తప్పుపట్టింది. సార్వభౌమాధికార దేశాలను ఎలా అడ్డుకుంటారని ట్రంప్‌ను నిలదీసింది. భారత్ సైతం దీటుగా జవాబిచ్చింది. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని తేల్చిచెప్పింది.
ఇవి కూడా చదవండి..
మా వద్ద బ్రహ్మోస్ ఉన్నాయ్... పాక్ ప్రధానిపై ఒవైసీ మండిపాటు
భారత్‌కు ఎన్నడూ మర్చిపోలేని గుణపాఠం చెబుతాం.. పాక్ ప్రధాని హెచ్చరిక
For More National News and Telugu News
Updated Date - Aug 13 , 2025 | 06:39 PM