India Air Defense: పాక్ క్షిపణులపై సుదర్శన చక్రం
ABN, Publish Date - May 09 , 2025 | 04:03 AM
రష్యా తయారు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించి నాశనం చేయగలదు. ఇది నాలుగు రకాల క్షిపణులతో శత్రు విమానాలు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను ఖచ్చితంగా తాకుతుంది.
ఎస్400లతో అడ్డుకున్న భారత్
భారత్‌లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్థాన్ బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో పెద్దఎత్తున దాడి చేసింది. అయితే ఆ దాడుల్ని సమర్థంగా అడ్డుకున్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. మన ‘ఇంటెగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్’ను ఉపయోగించి పాక్ క్షిపణుల్ని, డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. పాక్ దాడుల్ని అడ్డుకునేందుకు భారత్ వద్ద ఉన్న ఈ వ్యవస్థలు ఏమిటి అనేది పరిశీలిద్దాం...
యూఏఎస్ అంటే అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (డ్రోన్లు). ఎక్కడో ఉన్న ఆపరేటర్ వీటిని నియంత్రిస్తూ దాడి చేయిస్తాడు. అంటే వేరేచోటి నుంచి వీటికి సిగ్నల్స్ అందుతుంటాయి. ఇలాంటి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ను, డ్రోన్ కంట్రోల్ సిగ్నల్స్‌ను పసిగట్టే సిగ్నల్ ఇంటెలిజన్స్ వ్యవస్థలు భారత్ వద్ద ఉన్నాయి. వీటి ద్వారా డ్రోన్ల ఉనికిని, కదలికల్ని కనిపెడతారు. అలాగే డ్రోన్లు పనిచేయకుండా స్తంభింపజేయగల జామింగ్, స్పూఫింగ్ వ్యవస్థలు కూడా మన వద్ద ఉన్నాయి. వీటిని ఉపయోగించినా డ్రోన్ ముందుకు వస్తుంటే దానిని కూల్చివేయడానికి గన్స్, లేజర్ బేస్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లోని భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్ ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థల్ని రూపొందించింది. ఇవి కాకుండా డీఆర్‌డీవో డ్రోన్ డిటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ సిస్టమ్స్‌ను కూడా భారత్ తన పశ్చిమ సరిహద్దులో మోహరించింది. వీటివల్లే పాక్ డ్రోన్లను అడ్డుకోగలిగింది. ఇక పాక్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో భారత్ దేశీయంగా రూపొందించిన ఆకాశ్ క్షిపణులు, భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించిన బరాక్ 8 క్షిపణులు కీలక పాత్ర పోషించగా రష్యా నుంచి ఇటీవల కొనుగోలు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ అత్యంత ప్రధాన పాత్ర నిర్వహించినట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎస్-400 చాలా శక్తిమంతమైనది. భారత సైన్యం ఇటీవల మూడు ఎస్-400 రెజిమెంట్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఈ వ్యవస్థకు భారత్ ‘సుదర్శన్ చక్ర’ అని పేరు పెట్టింది.
- ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి
ఎస్-400 సత్తా ఇదీ...
రష్యన్ ఎస్-400 బాలిస్టిక్ క్షిపణుల్ని, క్రూజ్ క్షిపణుల్ని, శత్రు విమానాల్ని గుర్తించి ధ్వంసం చేయగలదు. ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది గుర్తించి దెబ్బతీయగలదు. ఈ క్షిపణి వ్యవస్థను వాహనాల్లో ఎక్కడికైనా సులభంగా తీసుకవెళ్లవచ్చు. అందువల్ల వీటిని ఎక్కడైనా సులభంగా మోహరించవచ్చు. ఈ వ్యవస్థలో నాలుగు రకాల క్షిపణులు ఉంటాయి.
1) 40 ఎన్6ఈ... ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంబర్ విమానాలను, అవాక్స్ విమానాలను ధ్వంసం చేయగలదు.
2) 48ఎన్6... ఇది 250 కిలోమీటర్ల దూరంలోని విమానాలను, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తుంది.
3) 9ఎం96ఈ2... ఇది 120 కిలోమీటర్ల రేంజ్ కలిగి తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను అతి వేగంగా కూల్చగలదు.
4) 9ఎం96ఈ... ఇది 40 కిలోమీటర్ల రేంజ్ కలిగి వేగంగా వచ్చే విమానాల్ని, క్షిపణుల్ని అత్యంత కచ్చితత్వంతో కూలుస్తుంది.
Updated Date - May 09 , 2025 | 07:41 AM