ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: ఈసీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌!

ABN, Publish Date - Jun 22 , 2025 | 05:27 AM

ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. జవాబు చెప్పడం కాకుండా ఆధారాలను తుడిచివేయాలని ఈసీ ప్రయత్నిస్తున్నదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆధారాలు ధ్వంసం చేస్తారు.. ఓటరు జాబితాలు వెల్లడించరు

  • ఎందుకిదంతా అని నిలదీసిన రాహుల్‌

  • ఓటరు భద్రత, గోప్యత కోసమే: ఈసీ

న్యూఢిల్లీ, జూన్‌ 21: ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. జవాబు చెప్పడం కాకుండా ఆధారాలను తుడిచివేయాలని ఈసీ ప్రయత్నిస్తున్నదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మొదటినుంచీ ఆరోపిస్తున్న రాహుల్‌.. ఓటరు లిస్టులు, పోల్‌ డేటా, వీడియో ఫుటేజీలను వెల్లడిచేయాలని ఈసీని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఈసీ తాజాగా తీసుకున్న మరో నిర్ణయం ఆయనను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఎన్నికలు జరిగిన 45 రోజులవరకు ఫిర్యాదు రాకపోతే పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ పుటేజీలను, వెబ్‌కాస్టింగ్‌ పుటేజీలను తొలగించాలంటూ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌లకు జాతీయ ఎన్నికల సంఘం ఈ నెల 30న లేఖ రాసింది. ఆ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈసీ నిర్ణయాన్ని రాహుల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌గా దుయ్యబడుతూ శనివారం ‘ఎక్స్‌’లో హిందీలో పోస్టు పెట్టారు. ‘‘ఓటరు జాబితాకు సంబంధించి మిషన్‌-రీడబుల్‌ ఫార్మెట్‌ను బయటపెట్టరు. సీసీ టీవీ పుటేజీని దాచేశారు. దానికోసం చట్టాన్ని సైతం మార్చారు. ఫోటో-వీడియోలను ఏడాది లోపే, ఎన్నికలు జరిగిన 45 రోజుల్లో ధ్వంసం చేస్తారు. ఇదంతా ఆధారాలను ధ్వంసం చేయడం కోసమేనా అనేది ఈసీ జవాబు చెప్పాలి. మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందనేందుకు ఇదే దాఖలా. ఎన్నికల మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనేది ప్రజాస్వామ్యానికి విషం వంటిది’’ అని రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. పోలింగ్‌ సంబంధిత అతి కీలక సమాచారాన్ని కావాలనే ధ్వంసం చేయాలని ఈసీ చూస్తోందని ఆరోపించారు. ఈసీ పారదర్శకతను ఆయన ప్రశ్నించారు.

అందుకే ధ్వంసం: ఈసీ

ఈసీ తన నిర్ణయాన్ని ఒక ప్రకటనలో శనివారం సమర్థించుకుంది. సీసీ టీవీ ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్‌ ఫుటేజీలను తొలగించాలనే నిర్ణయం ఓటరు భద్రత, గోప్యతా హక్కును దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని వివరించింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా, ఇతర డేటాను బయటపెట్టాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. ఓటర్ల ప్రయోజనాలను, ప్రజాస్వామ్య సమగ్రతను కాపాడటం కోసమే ఈ తరహా డిమాండ్లు కొందరు చేస్తున్నట్టు కనిపించినా, వారి ప్రయోజనాలు అందుకు పూర్తి విరుద్ధమైనవని వ్యాఖ్యానించింది. ఫుటేజీని బయటపెట్టడం వల్ల ఓటరు భద్రత ప్రమాదంలో పడుతుందని తెలిపింది. దానివల్ల ఓటు వేసినవారిని, ఓటు వేయనివారిని సులువుగా గుర్తించి.. వారిని అవాంఛనీయ ఒత్తిడికి, వివక్షకు, బెదిరింపులకు గురిచేసే ముప్పు ఉందని వివరించింది. రాహుల్‌ విమర్శల్లోని ఒక్కో అంశంపై స్పందిస్తూ... ఓటరు గోప్యత, సుప్రీంకోర్టు గత తీర్పులు, వీడియోఫుటేజీకి ఉన్న ప్రాధాన్యం, ఓటువేసిన, వేయనివారి వివరాలు బయటపెట్టడం ఎలా శిక్షార్హమైన నేరం అవుతుందనేది ఈసీ ఆ ప్రకటనలో వివరించింది.

ఇవే విషయాలను రాష్ట్రాల ఈసీలకు రాసిన లేఖలోనూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన డేటాను కొంతమంది దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికలకు సంబంధించిన వివిధ దశలను ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్‌, సీసీటీవీ తదితర పలు రికార్డింగ్‌ పరికరాలతో చిత్రీకరించాలని తానే గతంలో ఆదేశించినట్టు గుర్తుచేసింది. ఎన్నికల చట్టాల ప్రకారం తప్పనిసరి కాకపోయినా, అంతర్గత అవసరాల కోసం ఎన్నికల ప్రక్రియను రికార్డింగ్‌ చేయించినట్టు తెలిపింది. అభ్యర్థులు కానివారి చేతిలో ఈ డేటా పడి, వారు దానిని సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం కోసం దుర్వినియోగం చేసిన ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయని గుర్తుచేసింది. అందువల్ల సీసీ టీవీ పుటేజీలు, వెబ్‌ కాస్టింగ్‌ డేటా, ఫొటోగ్రఫీ సమాచారాన్ని 45 రోజులు మాత్రమే భద్రపరచాలని కోరింది. ఈ లోపు ఎన్నికల పిటిషన్‌ హైకోర్టులో దాఖలు కాకపోతే ఆ ఆధారాలను ధ్వంసం చేయాలని సూచించింది.

Updated Date - Jun 22 , 2025 | 05:27 AM