Operation Sindoor: సిందూరమే.. సంహారమై
ABN, Publish Date - May 08 , 2025 | 03:49 AM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో 25 నిమిషాల్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలు సమూలంగా నాశనం కాగా, దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
80 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్?
పహల్గాంకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు
లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్
ప్రధాన కార్యాలయాలు సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం
వీటిలోనే కసబ్, డేవిడ్ హెడ్లీ తదితరులకు ఉగ్ర శిక్షణ
వాటి శిక్షణ, కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం
70 మంది ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు
మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, అనుచరులు
జైషే, లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలనే దాడుల లక్ష్యం
మరిన్ని దాడుల్ని అడ్డుకోవడానికే సైనిక చర్య: విక్రమ్ మిస్రీ
‘చున్ చున్ కే మారేంగే (ఏరి ఏరి మరీ చంపుతాం).. ‘షోలే’ సినిమాలో ధర్మేంద్ర డైలాగ్ ఇది! పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కొద్ది రోజుల కిందట కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే చెప్పారు! ఆయన అన్నట్లుగానే.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏరి ఏరి మరీ లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర స్థావరాలు, ప్రధాన కార్యాలయాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది! సరిహద్దు దాటకుండానే.. క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది! ఉగ్ర శిబిరాలు, స్థావరాలను నేలమట్టం చేసింది! కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్‌ను మళ్లీ కోలుకోలేకుండా చావు దెబ్బ కొట్టింది! ‘దాడుల్లో నేను కూడా చచ్చిపోతే బాగుండు’ అని అతడు అన్నాడంటే వాటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు! నిజానికి, బుధవారం సాయంత్రం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ఉంటుందని ప్రకటించారు కానీ.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాతే అసలైన ప్రతీకారానికి శ్రీకారం చుట్టేశారు! ఈ దాడులకు భారత సైన్యం పెట్టిన పేరు ‘ఆపరేషన్ సిందూర్’! పహల్గాంలో భార్యల కళ్లెదుటే భర్తలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి.. వారి సిందూరాలను ఉగ్రవాదులు రక్తంతో తుడిచేసిన సంగతి తెలిసిందే! తమ భర్తతోపాటు తమనూ చంపేయాలని ప్రాధేయపడితే.. ‘వెళ్లి మోదీకి చెప్పుకో పో’ అంటూ వదిలేశారు! అప్పట్లో చెరిగిపోయిన వారి సిందూరమే ఇప్పుడు మృత్యు క్షిపణిగా మారి ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది! వాళ్లు వెళ్లి మోదీకి చెప్పలేదు కానీ.. మోదీ రణ గర్జన ప్రపంచమంతా ప్రతిధ్వనించింది! గతానికి భిన్నంగా వీడియోలు, ఫొటోలు, సైనిక ఫుటేజీల రూపంలో తమ ప్రతీకార దాడుల తీవ్రత ప్రపంచం మొత్తానికి తెలిసేలా భారత్ చేసింది.
9 . ఉగ్ర శిబిరాలు
25. నిమిషాలు
24. క్షిపణి దాడులు
80. హతమైన ఉగ్రవాదులు
న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): మతం అడిగి మరీ 26 మంది అమాయకుల ఉసురు తీసిన.. మహిళల కన్నీటి ధారకు కారణమైన పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మారణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదుల ఆయువుపట్టులపై మన సైన్యం, వాయుసేన దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఉగ్ర శిబిరాలు, స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలను తుత్తునియలు చేశాయి. రెండు మూడు నిమిషాలకు ఒక దాడి చొప్పున కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్ర స్థావరాలపై 24 క్షిపణులను ప్రయోగించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్‌లోని బహావల్పూర్, మురిడ్కేల్లోని లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. మరో 70 మంది గాయపడ్డారు. మృతుల్లో కరుడు గట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు పది మంది సహా అతని అనుంగు అనుచరులు మరో నలుగురు ఉండడం గమనార్హం. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులకు భారత సైన్యం శ్రీకారం చుట్టింది. దాదాపు 1.05 గంటల నుంచి 1.30 గంటల వరకూ అంటే.. 25 నిమిషాలపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.
లష్కరే తాయిబా ఆత్మాహుతి బాంబర్ల కీలక శిక్షణ శిబిరమైన కోట్లీలోని అబ్బాస్ టెర్రరిస్టు క్యాంపుపై రాత్రి 1.04 గంటలకు తొలుత క్షిపణి దాడి చేసింది. ఏ సమయంలోనైనా ఇక్కడ 50 మందికిపైగా ఉగ్రవాదులు ఉంటారని చెబుతారు. ఆ వెంటనే, లష్కరే తాయిబా ప్రధాన కార్యాలయం, అతి పెద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరమైన మురుడ్కేలోని స్థావరంపై 1.06 గంటల నుంచి 1.10 గంటల వరకూ వరుస దాడులు చేసి పూర్తిస్థాయిలో ధ్వంసం చేశారు. ఆ తర్వాత.. ఉగ్ర ప్రణాళికలు, శిక్షణకు కీలకమైన బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని; సరిహద్దు ఉగ్రవాద చొరబాట్లకు శిక్షణ, సహకారం అందించే సియాల్ కోట్‌లోని ఉగ్రవాద స్థావరాన్ని నేలమట్టం చేసింది. అనంతరం, ఉగ్ర శిక్షణ, ఆయుధ నిల్వ, చొరబాట్లకు కీలకమైన ముజఫరాబాద్, భింబర్; చాక్ అమ్రు, గుల్పూర్‌లోని స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. చివరిగా.. సమీప భవిష్యత్తులోనూ ఉగ్రవాద దాడులు చేయకుండా నిలువరించడమే ధ్యేయంగా మురుడ్కేలోని లష్కరే తాయిబా ప్రత్యామ్నాయ స్థావరాన్ని ధ్వంసం చేసింది. సర్జాల్ జిల్లా తెహ్రా కలాన్‌లోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జైషే మహ్మద్ తన కమ్యూనికేషన్ కేంద్రాన్ని రహస్యంగా నిర్వహిస్తోంది.
అత్యంత కచ్చితత్వంతో దాడి చేసి దానిని నేలమట్టం చేసింది. జమ్ము కశ్మీరులోకి చొరబడే ఉగ్ర వాదులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇక్కడ ఉంటుంది. దాడుల్లో దానిని మొత్తాన్ని ధ్వంసం చేసింది. మిలటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ పరికరాలు, లాంగ్ రేంజ్ అలా్ట్ర సెట్లు, డిజిటల్ మొబైల్ రేడియోలు తదితరాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.
కచ్చితంగా.. గురి తప్పకుండా
ఎక్కడా గురి తప్పకుండా పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపైనే మన సైన్యం దాడులు చేసింది. మిలటరీ స్థావరాలు, పౌరులపై ప్రభావం చూపకుండా అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. దాడులు చేసిన అరగంటకే సైన్యం ఈ మేరకు ప్రకటన చేసింది. అనంతరం బుధవారం మధ్యాహ్నం ఆర్మీ కార్ప్స్ సిగ్నల్స్‌కు చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో కలిసి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌ను అమలు చేసిన తీరును వివరించారు. తొమ్మిది లక్ష్యాలపై తాము ఎందుకు గురి పెట్టాల్సి వచ్చిందో కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు.
సియాల్‌కోట్‌లోని సర్జల్, మెహమూనా జోయా స్థావరం (హిజ్బుల్), మురుడ్కేలోని మర్కజ్ తాయిబా (లష్కరే), బహవల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా (జైషే మహ్మద్), పీవోకేలోని సవాయి నాలా, ముజఫరాబాద్‌లో సైడ్నా బిలాల్, కోట్లీలోని గుల్పూర్, అబ్బాస్, బింభర్‌లోని బర్నాలా శిబిరాలను ధ్వంసం చేశామని ఆమె మ్యాప్‌ల ఆధారంగా వివరించారు. సంబంధిత ప్రదేశాల చిత్రాలను విడుదల చేశారు. ఉగ్రవాద శిబిరాల్లోని ఒక శిబిరంలో ముంబై దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ పొందారని తెలిపారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న జైషే, లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదులను నిర్మూలించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉగ్ర దాడులను నిలువరించడం, భవిష్యత్తులో జరగకుండా అడ్డుకోవడం అనివార్యంగా మారిందని, అందుకే, బాధ్యతాయుతంగా, తదుపరి ఉద్రిక్తతలకు తావు లేకుండా, దెబ్బకు దెబ్బ అన్న తీరులో దాడులు చేశామని విక్రమ్ మిస్రి వివరించారు.
తమ భూభాగంపై ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించేందుకు పాకిస్థాన్ నిర్దిష్టంగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, భారత్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశమూ ఉందని మన నిఘా వర్గాలు సంకేతాలు ఇచ్చాయని, ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్ర దాడి సూత్రధారులు, పాత్రధారులకు తగిన బుద్ధి చెప్పడం అనివార్యంగా మారిందని వివరించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నేలమట్టం చేయడం, ఉగ్రవాదులు చొరబడకుండా అడ్డుకోవడమే ధ్యేయంగా ఈ దాడులు జరిగాయన్నారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి దారుణం. అనాగరికం. 26 మంది పర్యాటకులను అత్యంత దారుణంగా చంపేశారు. ఎక్కువమందిని అతి తక్కువ దూరం నుంచి తలపై కాల్చి చంపేశారు. అది కూడా వాళ్ల కుటుంబ సభ్యుల కళ్లముందే. వాళ్లు చంపిన తీరు చూసి కుటుంబ సభ్యులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే జమ్ము, కశ్మీర్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులను తీసుకు రావాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టడమూ ఆ ఉగ్ర దాడి మరో లక్ష్యం’’ అని వివరించారు. ఈ కుట్రలను నిర్వీర్యం చేసిన ఘనత ప్రభుత్వం, ప్రజలదేనని అన్నారు. ఆ దాడులకు తమదే బాధ్యత అని ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్) ప్రకటించుకుందని, ఇది లష్కరే తాయిబా అనుబంధ సంస్థ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 04:39 AM