ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: వర్దమాన దేశాలకు ప్రాతినిధ్యమేదీ

ABN, Publish Date - Jul 07 , 2025 | 01:51 AM

ప్రపంచస్థాయి సంస్థల్లో వర్దమాన, వెనుకబడిన దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంపై భారత ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

  • ప్రస్తుత పరిస్థితులకు సరిపోని ఐరాస

  • బడుగు దేశాల సమస్యలపై చర్చే లేదు

  • బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

రియో డి జనైరో, జూలై 6: ప్రపంచస్థాయి సంస్థల్లో వర్దమాన, వెనుకబడిన దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంపై భారత ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని మరింత సమ్మిళితంగా, బహుళ ధ్రువ సంస్థలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘గ్లోబల్‌ సౌత్‌’గా వ్యవహరిస్తున్న వెనుకబడిన దేశాలకు మరింత ప్రాధాన్యం లభించాల్సి ఉందని తెలిపారు. ఆదివారం బ్రెజిల్‌లోని రియో డి జనైరో నగరంలో జరిగిన 17వ బ్రిక్స్‌ కూటమి సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సదస్సుకు కీలక నేతలైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గైర్హాజరు కావడం గమనార్హం. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు కారణంగా ప్రపంచ స్థాయి సంస్థల్లో గ్లోబల్‌ సౌత్‌ దేశాలు బాధితులుగా మిగులుతున్నాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత వంటి విషయాల్లో చిన్నచూపునకు గురవుతున్నాయని తెలిపారు. 20వ శతాబ్దంలో ఏర్పాటయిన ప్రపంచస్థాయి సంస్థల్లో మూడింట రెండో వంతు మానవ జాతికి తగిన ప్రాతినిధ్యమే లేకుండా పోతోందని ఆరోపించారు.

‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానే సహకరిస్తున్న దేశాలకు విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో తగిన స్థానం ఉండడం లేదు. ఇది కేవలం ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్యే కాదు.. ఆయా సంస్థల విశ్వసనీయత, సమర్థతకు సంబంధించినది కూడా. గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు ప్రాతినిధ్యం లేని సంస్థలను ప్రపంచస్థాయి సంస్థలు అంటే..అవి సిమ్‌ కార్డు ఉండి నెట్‌ వర్క్‌లేని మొబైల్‌ ఫోన్లు లాంటివి’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచస్థాయి సంస్థ అయిన ఐక్యరాజ్యసమితిపై అభిప్రాయం చెబుతూ అది 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనలేకపోతోందని చెప్పారు. ‘‘ప్రపంచంలో పలుచోట్ల జరుగుతున్న యుద్ధాలు, కరోనా వంటి మహమ్మారులు, ఆర్థిక సంక్షోభం, సైబర్‌ నేరాలు, అంతరిక్షంలోని సమస్యలకు ఈ సంస్థల వద్ద సమాధానాలు లేవ’’ని ప్రధాని అన్నారు. నూతన సమ్మిళిత ప్రపంచ వ్యవస్థను నెలకొల్పాలంటే ముందుగా ఇప్పుడున్న ప్రపంచస్థాయి సంస్థలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సి ఉందని అన్నారు.

పరిపాలన వ్యవస్థ, ఓటింగ్‌ హక్కులు, నాయకత్వ స్థానాల్లో మార్పులు ఉండాలని చెప్పారు. బ్రిక్స్‌లో కూడా మరిన్ని దేశాలను కలుపుకోవాలని, కాలానికి తగ్గట్టుగా ఈ కూటమి కూడా మారుతుందని నిరూపించాలని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ(ఏఐ)ను అన్ని దేశాలకు అందుబాటులో ఉంచడంపైనా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘సాంకేతిక పరిజ్ఞానం ప్రతి వారం మారుతోంది. కానీ ఓ ప్రపంచ స్థాయి సంస్థ మాత్రం దీనిని ఎనిమిదేళ్లకు ఒకసారయినా అప్‌డేట్‌ చేసేందుకు ఇష్టపడడం లేదు. 20వ శతాబ్దపు టైప్‌రైటర్ల మీద 21వ శతాబ్దం సాఫ్ట్‌వేర్‌ పనిచేయదు’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌ మాత్రం నిర్మాణాత్మక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ పరిపాలన, శాంతి, భద్రత, కృత్రిమ మేధ రంగాల్లో సహకారం అందిస్తుందన్నారు.

పహల్గామ్‌ ఉగ్రదాడి ప్రస్తావన

ఉగ్రవాదం పహల్గామ్‌ దాడి అంశాలనూ మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉగ్రవాదం ప్రపంచమానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ అని పేర్కొన్న ఆయన, పహల్గామ్‌ ఉగ్రదాడి సమస్త మానవాళిపై జరిగిన దాడి అన్నారు. కాగా, అర్జెంటినా పర్యటన ముగించుకొని బ్రెజిల్‌ చేరుకున్న మోదీకి రియో డి జనైరోలో భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు.

Updated Date - Jul 07 , 2025 | 01:51 AM