Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ను ప్రధాని మోదీ ఎలా ట్రాక్ చేశారో తెలుసా..
ABN, Publish Date - Jun 04 , 2025 | 03:54 PM
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో భారత్ ఎదుట పాకిస్థాన్ మోకరిల్లింది. అయితే ఈ ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాని మోదీ ఏం చేశారనే విషయాన్ని కేంద్ర మంత్రి వివరించారు.
న్యూఢిల్లీ, జూన్ 04: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అర్థరాత్రి సమయంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌ను ప్రధాని మోదీ ఎలా పర్యవేక్షించారనే విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తాజాగా వెల్లడించారు. ఇండియన్ ఆర్మీ మే 7వ తేదీ రాత్రి పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలను ధ్వంసం చేసిందని తెలిపారు మంత్రి. ఆ సమయంలో ప్రధాని మోదీ ప్రతి నిమిషం.. ఎక్కడ ఏం జరిగింది. ఎలా జరిగిందనే విషయాలను పర్యవేక్షించారని చెప్పారు. ఈ ఆపరేషన్ సమయంలో ప్రధాని ఎటువంటి ఒత్తిడికి లోను కాలేదని మంత్రి స్పష్టం చేశారు. సాధారణంగానే ప్రధాని మోదీ.. ఎక్కువగా రాత్రి సమయాల్లోనే పని చేస్తుంటారని చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఆపరేషన్ సిందూర్‌ను సైతం ఆయన రాత్రి సమయంలో పర్యవేక్షించారని తెలిపారు.
బుధవారం న్యూఢిల్లీలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. రక్షణ బలగాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో ఆయా బలగాలకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఒక స్పష్టత ఏర్పడిందన్నారు. అయితే ఈ తరహా నిర్ణయం గతంలో ఎన్నడూ తీసుకోలేదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో.. ప్రధాని మోదీ పక్కా స్పష్టతతో ఉన్నారన్నారు. అంతేకాకుండా.. ఈ దాడుల సమయంలో పౌరులకు ఎటువంటి హానీ జరగకూడదన్నది ఆయన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఇక పాకిస్థాన్ అణుబాంబుల పేరుతో భయపెట్టే ప్రయత్నం చేసినా.. ప్రధాని భయపడలేదన్నారు మంత్రి జితేంద్ర సింగ్. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా కానీ.. దేశ భద్రత పరంగా కానీ.. ఎలాంటి భయాందోళనకు గురికాలేదన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఖచ్చితమైన టార్గెట్‌తో.. సంయమనంతో చేసిందని స్పష్టం చేశారు. ఈ దాడులు కేవలం ఉగ్రవాద స్థావరాలు, వాటి మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేసుకుందే కానీ.. పౌరులు, ఆ దేశ సైనికులను టార్గెట్‌గా చేసుకోలేదని గుర్తు చేశారు. భారత దేశ పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోనులు, క్షిపణులతో దాడి చేసి.. పౌరులతోపాటు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని వివరించారు. దీంతో భారత్ ప్రతీకార చర్యలకు దిగిందని.. పాకిస్థాన్‌లోని కీలకమైన సైనిక స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నీ అంతు చూస్తానంటూ.. పోలీసులపై అంబటి దౌర్జన్యం
వెన్నుపోటుకు, కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. గంటా ఫైర్
For National News And Telugu News
Updated Date - Jun 04 , 2025 | 04:30 PM