Star Air: తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం
ABN, Publish Date - Aug 16 , 2025 | 08:33 PM
పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. బెళగావి నుంచి ముంబైకి విమానం బయలుదేరింది.
బెంగళూరు, ఆగస్టు 16: పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో 48 మంది ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం ఉదయం 48 మంది ప్రయాణికులతో కర్ణాటకలోని బెళగావి నుంచి ముంబైకి స్టార్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం టేకాఫ్ అయింది. అనంతరం కొన్ని నిమిషాలకు విమానంలోని ఒక ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ విషయాన్ని విమాన పైలట్ గుర్తించారు. ఆ వెంటనే ఆ విమానాన్ని తిరిగి బెళగావి ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరం అనుమతి తీసుకుని దింపేశారు. దీంతో విమాన ప్రయాణికులతోపాటు ఎయిర్ పోర్టు అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.
ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని గుర్తించే పనిలో స్టార్ ఎయిర్ సంస్థకు చెందిన నిపుణులు నిమగ్నమయ్యారు. అలాగే ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విమాన సంస్థ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అదే విధంగా అత్యవసర సమయంలో చాకుచక్యంగా వ్యవహరించిన విమాన పైలట్‌ను అభినందించింది. బెళగావి నుంచి ఉదయం 7.50 గంటలకు ఈ విమానం ముంబైకి బయలుదేరింది. ఈ విమానం 8.50 గంటలకు ముంబై చేరవల్సి ఉంది. మరోవైపు ఎయిర్ ఇండియా సంస్థ.. దేశంలోని అహ్మదాబాద్, ఛండీగఢ్, డెహ్రాడూన్‌లకు కొత్త సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది.
Updated Date - Aug 16 , 2025 | 08:46 PM