Pahalgam Terror Attack: హృదయాన్ని కదిలించే విషాదం..పహల్గామ్ ఉగ్రదాడిలో అర్ధాంతరంగా ఆగిన జీవితం
ABN, Publish Date - Apr 23 , 2025 | 10:32 AM
పహల్గామ్ మంగళవారం ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చిన ఉగ్రవాద దాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ క్రమంలో పర్యాటకం కోసం వెళ్లిన అమాయకుల ప్రాణాలను ఉగ్రదాడి బలితీసుకుంది. ఈ క్రమంలో మానవత్వం కదిలించేలా చేసిన పలువురి విషాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జమ్మూ కశ్మీర్ పహల్గామ్‌లో మంగళవారం జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాద ఛాయలను నింపింది. ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ దాడి బాధితుల కుటుంబాలు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి మహారాష్ట్రలోని పన్వేల్ వరకూ, ఒడిశా నుంచి గుజరాత్ వరకూ శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ దాడి 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడుల్లో ఒకటిగా నిలిచింది.
నూతన వధూవరుల విషాదం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు. ఫిబ్రవరి 12, 2025న ఈ జంటకు వివాహం జరిగింది. ఆ క్రమంలో తన భార్యతో కలిసి కశ్మీర్‌లో విహారయాత్రకు వెళ్లారు. కానీ, ఈ యాత్ర వారి జీవితంలో చివరి ప్రయాణంగా నిలిచింది. శుభం బంధువు సౌరభ్ ద్వివేది మాట్లాడుతూ ఉగ్రవాది ముందుగా వారి పేర్లు అడిగి, ఆ తర్వాత కాల్పులు జరిపారని తెలిపాడు.
నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ బలి
ఈ దాడిలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 26 ఏళ్ల భారత నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా మరణించాడు. ఏప్రిల్ 16న వివాహం జరిగిన వినయ్, ఏప్రిల్ 19న వివాహ విందు కార్యక్రమం పూర్తి చేసుకుని, తన భార్యతో కలిసి కాశ్మీర్‌కు హనీమూన్ కోసం వెళ్లారు. కొచ్చిలో నౌకాదళంలో విధులు నిర్వహిస్తున్న వినయ్, రెండేళ్ల క్రితం నౌకాదళంలో చేరాడు. అతని మరణం వారి కుటుంబం, రక్షణ రంగంలో విషాద ఛాయలను నింపింది. ఆ తర్వాత ఆయన పక్కనే కూర్చుని నర్వాల్ భార్య ఏడుస్తూ కనిపించిన తీరు అనేక మందిని కలచివేసింది.
ఒడిశా నుంచి విషాద గాథ
ఒడిశాకు చెందిన అకౌంట్స్ అధికారి ప్రశాంత్ సత్పతి కూడా ఈ దాడిలో బలయ్యాడు. తన భార్య, చిన్న కుమారుడితో కలిసి కశ్మీర్‌లో విహారయాత్రలో ఉన్న ప్రశాంత్, ఈ దాడిలో మరణించాడు. అతని భార్య, కుమారుడి ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రశాంత్ అన్నయ్య సుశాంత్ సత్పతి మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాకు ఈ విషాద వార్త తెలిసింది. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు, మీ తమ్ముడు మరణించాడని మాత్రమే చెప్పారు.
గుజరాత్, మహారాష్ట్రలోనూ శోకం
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన షైలేష్ భాయ్ హిమ్మత్ భాయ్ కడతియా (44) కూడా ఈ దాడిలో మరణించాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కాశ్మీర్‌లో పర్యటిస్తున్న షైలేష్, కాల్పుల్లో మరణించగా, అతని కుటుంబం సురక్షితంగా ఉంది. మహారాష్ట్రలోని పన్వేల్‌కు చెందిన దిలీప్ దేసాలే కూడా ఈ దాడిలో మరణించాడు. బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాకూర్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
దేశవ్యాప్త ఖండన, స్థానికుల నిరసన
ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పహల్గామ్‌లోని టాక్సీ డ్రైవర్లు, స్థానికులు కొవ్వొత్తుల మార్చ్‌తో నిరసన తెలిపారు. బారాముల్లా, శ్రీనగర్, పూంచ్, అఖ్నూర్, కుప్వారాలలో స్థానికులు కొవ్వొత్తుల మార్చ్‌లు నిర్వహించారు. ఇది కేవలం పర్యాటకులపై దాడి కాదు, మా జీవనాధారంపై దాడి అని పేర్కొన్నారు. పహల్గామ్ ఎల్లప్పుడూ శాంతిమయం, పర్యాటకంపై ఆధారపడి ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి:
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి.. భారత్‌కు మద్దతుగా ప్రపంచ నేతల సంఘీభావం
PM Modi: విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అజిత్ దోవల్, జైశంకర్‌తో మోడీ అత్యవసర భేటీ
PM Modi: ప్రధాని మోదీ సౌదీ టూర్ రద్దు..ఇండియాకు వచ్చేసిన పీఎం
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 23 , 2025 | 10:32 AM