No Confidence Motion: సీఈసీపై అభిశంసన
ABN, Publish Date - Aug 19 , 2025 | 03:16 AM
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీద పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి యోచిస్తోంది..
ఇండియా కూటమి పార్టీల యోచన
ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేశ్ ఎదురు దాడికి దిగడంపై ఆగ్రహం
సీఈసీ కాదు.. బీజేపీ అధికార ప్రతినిధి
అవకతవకల్లేవని ఈసీ అఫిడవిట్ ఇస్తే..ఉన్నాయని ఇచ్చేందుకు మేం సిద్ధం: కాంగ్రెస్
2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18వేల అఫిడవిట్లు దాఖలు
వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదు: ఎస్పీ
రాజకీయ యజమానుల్ని మెప్పించే బదులు సీఈసీ రాజీనామా చేయాలి: తృణమూల్
ప్రతిపక్షంపై ఈసీ యుద్ధం: సీపీఎం
న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీద పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి యోచిస్తోంది. ఓటర్ల జాబితాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఇండీ కూటమి కొద్ది వారాలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారమని, అన్ని పార్టీల ప్రమేయంతోనే ఓటర్ల జాబితా రూపు దిద్దుకుంటుందని, ఏ దశలోనూ అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు అవకతవకలు అంటే ఎలా అని ప్రధాన కమిషనర్ ఎదురుదాడికి దిగారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని భావిస్తే ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ సమర్పించాలని ఆదివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన కమిషనర్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్షం యోచిస్తోంది. తీర్మానం ఏ సభలో ప్రవేశ పెట్టాలన్నా కనీసం 50 మంది ఎంపీల మద్దతు కావాలి. ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో నెగ్గాలి. అది సాధ్యమైన విషయం కాకపోయినా ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తేవడానికి పనికొస్తుందని విపక్షం భావిస్తోంది. తాము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చే బదులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్.. బీజేపీ అధికార ప్రతినిధిగా మాట్లాడారని ఇండియా కూటమి ధ్వజమెత్తింది. ఒక్క ప్రశ్నకూ ఆయన సమాధానం ఇవ్వలేదని, ఒక రాజ్యాంగ సంస్థకు ప్రతినిధిగా వ్యవహరించే బదులు ఆయన ఒక పార్టీ ప్రతినిధిగా వ్యవహరించారని మండిపడింది. ఎన్నికల ప్రక్రియను నిజాయితీగా నిర్వహిస్తున్నామని ప్రజలకు వివరించే బదులు ప్రతిపక్ష నేతలపై దాడులు చేసేందుకే సీఈసీ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించింది. ఇండియా కూటమి తరఫున పలువురు ఎంపీలు సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. బిహార్ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65లక్షల మంది పేర్లను విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎలాం టి వివరణా ఇవ్వలేదన్నారు. రాహుల్‌గాంధీని అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పడమే తప్ప మహదేవపుర నియోజకవర్గంలో ఓట్ చోరీపై సీఈసీ స్పందించలేదన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలులేవని ఎన్నికల సంఘం అఫిడవిట్ ఇస్తే అవకతవకలున్నాయని అఫిడవిట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియను నిజాయితీగా జరిపించడమనే రాజ్యాంగ విధిని నిర్వర్తించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీని ప్రశ్నించిన వారిపై ఎన్నికల సంఘం బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు అన్ని పార్టీల ప్రయోజనాలను సమానంగా కాపాడేందుకు సిద్ధంగా లేరన్నారు.
బిహార్‌లో ఓట్ల తొలగింపు, మహదేవురలో నకిలీ ఓటర్లను అనుమతించడం, మహారాష్ట్రలో 5నెలల్లో 75 లక్షల మంది ఓటర్లను చేర్చడం, 45 రోజుల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగింపు, ఆధార్‌ను అనుమతించకపోవడంపై సమాధానమివ్వకుండా సీఈసీ తప్పించుకున్నారని గొగోయ్ విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదార్ల ఓట్లను తొలగించడం మీద తాము 2022లో 18 వేల అఫిడవిట్లు దాఖలు చేశామని ఆ పార్టీ నేత రాంగోపాల్‌యాదవ్ ప్రస్తావించారు. ఎన్నికల సంఘం తాము సమర్పించిన 18 వేల అఫిడవిట్లపై ఏచర్య తీసుకుందని ప్రశ్నించారు. డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డుల గురించి తమ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఫిబ్రవరిలోనే ప్రశ్నించినా ఏ చర్యా తీసుకోలేదని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ఎన్నికల సంఘం కీలుబొమ్మలా వ్యవహరిస్తోందన్నారు. రాజకీయ యజమానులను మెప్పించే బదులు ఎన్నికల కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని సలహా ఇచ్చారు. బిహార్‌లో ప్రతిపక్షాల ఓటర్ అధికార యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రధాన కమిషనర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారని ఆర్‌జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. ప్రధాన కమిషనర్ పదవిలో ఉండే యోగ్యతను కోల్పోయారని ఆయన ప్రతిపక్ష పార్టీలపైనే యుద్ధం ప్రకటించారని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో 42వేల ఓట్లను తొలగించారని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ తెలిపారు.
ఓట్ల చోరీపై ఈసీకి స్టాలిన్ ఏడు ప్రశ్నలు
చెన్నై, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఓట్ల చోరీ అం శంపై కేంద్ర ఎన్నికల సంఘానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ఏడు ప్రశ్నలు సంధిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇంటింటి సర్వే తర్వాత భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు ఎలా జరిగింది? కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో యువ ఓటర్లను పరిగణనలోకి తీసుకున్నారా? బిహార్ ఓటర్ల జాబితా సమయంలో పాటించిన నిబంధనలు ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితా తయారీలోనూపాటిస్తారా? ఆధార్‌ను ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తోంది?’’అని ప్రశ్నించారు.
Updated Date - Aug 19 , 2025 | 03:16 AM