Operation Sindoor: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. 10 మంది పౌరులు మృతి..
ABN, Publish Date - May 07 , 2025 | 10:23 AM
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఏకపక్షంగా, విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ దాడిలో సరిహద్దు గ్రామ ప్రజలపై విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం..
న్యూఢిల్లీ, మే 07: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఏకపక్షంగా, విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ దాడిలో సరిహద్దు గ్రామ ప్రజలపై విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం.. పాక్ కాల్పుల్లో 10 మంది పౌరులు చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. దాదాపు రెండు వారాలుగా పాకిస్తాన్ ఆర్మీ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతోంది. పాక్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ ధీటైన జాబిస్తూ వచ్చింది. బుధవారం తెల్లవారజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్ ఏ మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత త్రివిధ దళాలు మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల తరువాత భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ ఆర్మీ రెచ్చిపోయి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ ఆర్మీ విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. యూరీ, కుప్వారా, రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో కాల్పులు జరుపుతోంది. పాక్ రేంజర్ల కాల్పులను భాతర బలగాలు తిప్పికొడుతున్నాయి. భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు కూడా మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.
1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్‌పై జరిగిన తొలి త్రివిధ దళాల ఆపరేషన్‌లో.. ఆర్మీ, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా దాడి జరిపాయి. బుధవారం తెల్లవారుజామున 1.44 గంటలకు ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగింది. ఈ ఆపరేషన్‌కు సిందూర్ అనే కోడ్‌నేమ్ పెట్టారు. గత నెలలో అమెరికా, రష్యా, చైనా, ప్రధాన యూరోపియన్ దేశాల దౌత్యవేత్తలతో పంచుకున్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని భారతదేశం ఇంతకు ముందే చెప్పింది. పాక్ ప్రమేయంతోనే.. అక్కడి ఉగ్ర సంస్థ పహల్గామ్ దాడిని ప్లాన్ చేసిందని ప్రపంచ దేశాలకు ఆధారాలను చూపించింది భారత్. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్.. పర్యాటక కేంద్రంగా ఉన్న పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు.
భారత్ దాడి చేసిన ప్రాంతాలివే..
బహవల్‌పూర్, మురిడ్కే, గుల్పూర్, సవాయి, కోట్లి, సర్జల్, బర్నాలా, మెహమూనా ప్రాంతాలపై ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది.
బహవల్‌పూర్ జైషే ప్రధాన కార్యాలయంగా, ప్రధాన దాడులకు ప్రణాళికా కేంద్రంగా ఉండేదని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
మురిద్కే ముంబైపై 26/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన లష్కరే స్థావరం.
2023, 2024 మధ్య జమ్మూ కశ్మీర్ లోని రాజౌరి, పూంచ్ లలో దాడులకు గుల్పూర్ స్థావరంగా ఉంది.
సవాయి శిబిరం.. పహల్గామ్ ఉగ్రదాడితో సహా భారతదేశంలో జరిగిన పలు దాడులతో సంబంధం ఉన్న లష్కర్ శిబిరం.
కోట్లీ ఉగ్రవాద శిక్షణా కేంద్రంగా ఉంది.
సర్జల్, బర్నాలా ఎల్‌ఓసి, అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఉగ్రవాద శిబిరాలు. చొరబాటు కోసం ఉపయోగిస్తుంటారు.
మెహమూనా హిజ్బుల్ ముజాహిదీన్ ప్రధాన శిబిరం.
Updated Date - May 07 , 2025 | 10:23 AM