Rahul Gandhi's Voter Adhikar Yatra: బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ
ABN, Publish Date - Aug 17 , 2025 | 03:58 PM
రాజ్యాంగాన్ని రక్షించేందుకే తాను ఈ యాత్ర చేపట్టినట్లు ఎంపీ రాహుల్ గాంధీ వివరించారు. దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇలాగే ఓట్లు చోరీకి గురయ్యాయని ఆయన ఆందోళన చెందారు.
పాట్నా, ఆగస్ట్ 17: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం బిహార్‌లోని సాసారాంలో ఓట్ అధికార్ యాత్రను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర ఆరోపణలు సంధించారు. బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ్ (ఎస్ఐఆర్) ద్వారా ఓట్లను తొలగించడం, జోడించడం ద్వారా ఎన్నికల్లో ఓట్లను దొంగిలించడానికి కొత్త కుట్ర జరుగుతోందని విమర్శించారు.
రాజ్యాంగాన్ని రక్షించేందుకే తాను ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇలాగే ఓట్లు చోరీకి గురయ్యాయని ఆందోళన చెందారు. బిహార్‌లో ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల దొంగిలించేందుకు కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. దీని ద్వారా దేశ ప్రజలకు ఎన్నికల సంఘం ఎలా ఓట్లను చోరీ చేస్తుందో అర్థమవుతుందని చెప్పారు.
అయితే ఓటు చోరీపై తాను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత.. అఫిడవిట్ సమర్పించాలని తనను ఎన్నికల సంఘం కోరిందన్నారు. కానీ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై మాత్రం ఎన్నికల సంఘం స్పందించ లేదన్నారు. బిహార్‌లో ఓట్లు చోరీని తాము అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. పేదవారికి ఓటు ఒకటే అధికారమని తెలిపారు. వారి ఓటును లాక్కొనే అధికారం ఎవరికి లేదన్నారు.
ఇక ప్రతి ఎన్నికల్లో బీజేపీనే ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. మహారాష్ట్రతోపాటు పలు ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని పలు ఒపినియన్ పోల్స్ స్పష్టం చేశాయని గుర్తు చేశారు. 2024, సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు.. అంతకు ముందు జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇండియా కూటమిదే అధికారమని తేల్చి చెప్పాయని పేర్కొన్నారు. కానీ ఆ ఎన్నికలన్నింటిలో బీజేపీ భాగస్వామ్య పక్షాలే గెలిచాయని వివరించారు.
దాదాపు కోటి ఓట్లను కొత్తగా ఓటర్ల జాబితాలో చేర్చడం ద్వారా ఈ గెలుపు సాధ్యమైందని ఎంపీ రాహుల్ గాంధీ వివరించారు. అయితే బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఆందోళన చేస్తాయని తెలిపారు. మరికొన్ని నెలల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. వాటి లక్ష్యంగా ఓటు హక్కు తొలగించేందుకు ఎన్నికల సంఘం తన వంతు ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్ అధికార్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌తోపాటు ఇండియా కూటమికి చెందిన నేతలు పలువురు పాల్గొన్నారు. ఆగస్ట్ 17వ తేదీన సాసారాంలో ప్రారంభమైన ఈ యాత్ర.. సెప్టెంబర్ 1వ తేదీతో పట్నాలో ముగియనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 17 , 2025 | 05:17 PM