NDA Cabinet Meeting: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి కేంద్ర మంత్రి మండలి సమావేశం
ABN, Publish Date - Jun 03 , 2025 | 10:36 AM
NDA Cabinet Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మండలి సమావేశం జరుగనుంది. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
న్యూఢిల్లీ , జూన్ 3: కేంద్ర మంత్రి మండలి సమావేశం (NDA Cabinet Meeting) రేపు (బుధవారం) జరగనుంది. సుదీర్ఘ కాలం తరువాత కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుష్మా స్వరాజ్ భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 9వ తేదీతో ఎన్డీఏ ప్రభుత్వం (NDA Govt) మూడోసారి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుండటంతోపాటు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో జరుగుతున్న కేంద్ర మంత్రి మండలి సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సమావేశంలో కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులు సహా వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. గత సంవత్సర కాలంలో తమ శాఖల ప్రగతి నివేదికలను ఈ సమావేశంలో కేంద్రమంత్రులు తెలియజేయనున్నారు. పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు మరింత చేరువవ్వడంపై కూడా మంత్రి మండలికి ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత జరుగుతున్న తొలి కేంద్ర మంత్రి మండలి సమావేశం ఇది. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత మొదట్లో ఒకసారి మాత్రమే నిర్వహించారు. అందరికీ పరిచయ కార్యక్రమంలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఇప్పుడు ఏన్డీఏ ప్రభుత్వం 1 1ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్రమంత్రి మండలి సమావేశం జరుగుతోంది. సహజంగా ప్రతీ బుధవారం కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది. కానీ నాలుగు ఐదు నెలలకు ఒకసారి మాత్రం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతంది. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం
మరోవైపు ఆపరేషన్ సిందూర్‌పై గుజరాత్ ప్రభుత్వం (Gujarath Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సరిహద్దు సమీపాన కచ్‌లో ఆపరేషన్ సిందూర్ స్మారక పార్కు (Operation Sindoor Memorial Park) ఏర్పాటుకు నిర్ణయించింది. సాయుధ దళాల పట్ల గౌరవం, దేశ ఐక్యత చిహ్నంగా సిందూర్ స్మారక పార్కు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘సిందూర్ వన్’ పేరుతో ఈ స్మారక పార్కు నిర్మితం కానుంది.
ఇవి కూడా చదవండి
నేడు, రేపు తేలికపాటి వర్షాలు..
Read Latest National News And Telugu News
Updated Date - Jun 03 , 2025 | 03:39 PM